breaking news
health news
-
సింపుల్.. ఈ 7 టిప్స్ పాటిస్తే వందేళ్లు బతికేయొచ్చు!
మనిషి వందేళ్లు జీవించాలనే కల ఎప్పటినుంచో ఉంది. కానీ మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గిపోవడంతో ఆ కల అందరికీ సులభంగా నెరవేరడం లేదు. అయితే ఆరోగ్యంగా, చురుగ్గా శతాధిక వయసు దాటిన ఓ బామ్మ మాత్రం సుదీర్ఘ జీవితానికి పెద్ద పెద్ద రహస్యాలు అవసరం లేదంటోంది. రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లే ఆరోగ్యానికి పునాది అని బంగారు మాట చెబుతోంది.ఆమె వయసు 111 ఏళ్లు. ఇంకా ఆరోగ్యంగానే ఉంది. ఉత్సాహంగా, చురుగ్గా ఉన్న ఈ బామ్మ జీవన విధానం నెట్టింట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వయసు పెరిగినా.. శరీరాన్ని కదిలిస్తూ ఉండటమే తన ఆరోగ్య రహస్యమని ఆమె చెబుతోంది. అంతేకాదు.. తాను పాటించే ఏడు సూత్రాలే తన దీర్ఘాయుష్షుకు కారణమని చెబుతున్నారు. శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడం, పరిమితంగా ఆహారం తీసుకోవడం, ప్రశాంతమైన మనసుతో జీవించడం వంటి సాధారణ అలవాట్లే ఆరోగ్యకరమైన జీవితానికి పునాది అని ఆమె నమ్మకం.తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని రుగావో ప్రాంతానికి చెందిన వాంగ్ గైయింగ్ అనే ఈ బామ్మ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా నిలిచారు. వందేళ్లు దాటిన వారి సంఖ్య ఎక్కువగా ఉండే ప్రాంతంగా రుగావోకు పేరుంది. ఐదు తరాల కుటుంబంతో కలిసి జీవిస్తున్న వాంగ్.. 100 ఏళ్లు దాటిన తర్వాత కూడా పొలాల్లో పనులకు సాయం చేసేవారు. వేరుశెనగలు, పుచ్చకాయల కోత వంటి పనుల్లో పాల్గొనేవారు.ప్రస్తుతం వయసు కారణంగా పనులు తగ్గించినా.. ఇంట్లో చిన్న చిన్న పనులు మాత్రం స్వయంగా చేసుకుంటారు. టేబుళ్లు తుడవడం, బట్టలు మడతపెట్టడం వంటి పనులను వ్యాయామంగా భావిస్తారు. “శరీరం కదులుతూ ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది” అనేది ఆమె నమ్మకం.ఆహారంలోనూ అదే సూత్రంవాంగ్ ఎప్పుడూ కఠినమైన డైట్‌ను పాటించలేదు. అన్ని రకాల ఆహారాలను సమతుల్యంగా తీసుకోవడమే తన అలవాటు అని చెబుతారు. కుడుములు, ఆవిరితో ఉడికించిన బన్స్ వంటి సాధారణ ఆహారాలతో పాటు చేపలు ఆమెకు ఎంతో ఇష్టం. జీర్ణం కావడానికి సులభంగా ఉండటంతో చేపలను ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఎంత ఇష్టమైన ఆహారమైనా అతిగా తినకూడదనేది ఆమె సూత్రం.కోపానికి దూరం.. ప్రశాంతతకు దగ్గరదీర్ఘాయుష్షుకు ఆహారం మాత్రమే కారణం కాదని వాంగ్ చెబుతారు. మంచి మనసు, ప్రశాంతమైన ఆలోచనలు కూడా ఎంతో ముఖ్యమని అంటారు. ప్రతిరోజూ కనీసం ఒక మంచి పని చేయాలని ఆమెకు ఓ నియమం ఉంది. అది కుటుంబ సభ్యులను అభినందించడం కావచ్చు.. పాత స్నేహితుడికి ఓ మెసేజ్ పంపడం కావచ్చు. ఎవరితోనైనా గొడవ జరిగినా ఎక్కువసేపు ఆలోచిస్తూ బాధపడకుండా నిద్రపోతే ఉదయం అంతా సర్దుకుంటుందని ఆమె నమ్మకం.12 గంటల నిద్ర.. క్రమబద్ధమైన జీవనంవాంగ్ రోజువారీ జీవితం కూడా చాలా క్రమబద్ధంగా ఉంటుంది. రాత్రి 7 గంటలకే నిద్రకు వెళ్లి.. ఉదయం 7 గంటలకు నిద్ర లేస్తారు. మధ్యాహ్నం ఒకటి లేదా రెండు చిన్న కునుకులు కూడా తీసుకుంటారు. ఆమె జీవన విధానం చూస్తే.. దీర్ఘాయుష్షు కోసం ఖరీదైన పద్ధతులు, ప్రత్యేక మందులు అవసరం లేదని తెలుస్తోంది. శరీరాన్ని చురుగ్గా ఉంచడం, పరిమితంగా తినడం, ప్రశాంతంగా జీవించడం వంటి సాధారణ అలవాట్లే ఆరోగ్యకరమైన జీవితానికి బాటలు వేస్తాయని ఈ 111 ఏళ్ల బామ్మ చెబుతోంది. వయసు పెరగడం సహజం.. కానీ ఆరోగ్యంగా, ఆనందంగా వృద్ధాప్యాన్ని ఆస్వాదించడం మన అలవాట్లపైనే ఆధారపడి ఉంటుందేమో!బామ్మ చెప్పిన జీవన రహస్యాల్లో ప్రధానంగా 7 పాయింట్లు.. 1. బద్ధకించకూడదుబద్ధకం ఏ వయసు వాళ్లకైనా మంచిది కాదు. వయసు పెరిగినా శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలి. ఇంటి పనులు కూడా ఒకరకంగా వ్యాయామమే!.2. బ్యాలెన్స్డ్ ఫుడ్సుదీర్ఘమైన ఆయుషు కోసం కఠినమైన డైట్ లాంటి వేవీ అక్కర్లేదు. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం.3.అతిగా తినకూడదుఇష్టమైన ఆహారం అయినా మితంగా తీసుకోవాలన్నది ఆమె సూత్రం.4. సులభంగా జీర్ణమయ్యే ఆహారానికి ప్రాధాన్యంఈ తరహా ఆహారం.. ఆరోగ్యానికి మంచివి5. మంచి మనసుతో జీవించాలిప్రతిరోజూ కనీసం ఒక మంచి పని చేయాలన్నది ఆమె అలవాటు.6. కోపం, ఆందోళనకు దూరంగా ఉండాలిసమస్యలను ఎక్కువగా మదిలో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండటం.7. క్రమబద్ధమైన నిద్ర అలవాటురాత్రి త్వరగా నిద్రపోవడం, ఉదయం త్వరగా లేవడం.. మధ్యలో విశ్రాంతి తీసుకోవడం. అది ఏడు గంటలా?, 8 గంటలా? అనేది మీ ఇష్టం.కొసమెరుపు.. వాంగ్ గైయింగ్ నివసించే రుగావో ప్రాంతం దీర్ఘాయుష్షుకు పేరుగాంచింది. అక్కడ 100 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారు గణనీయంగా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఆ ప్రాంతంలో 672 మంది శతాధికులు (100 ఏళ్లు దాటిన వారు) ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఆ ప్రాంత ప్రజల జీవనశైలి, ఆహార అలవాట్లు, పర్యావరణ పరిస్థితులు దీర్ఘాయుష్షుకు కారణాల్లో ఒకటిగా పరిశోధకులు భావిస్తున్నారు. -
గుజరాత్లో ‘చండీపుర’ వైరస్ కలకలం..!
అహ్మదాబాద్: గుజరాత్లో అరుదైన 'చండీపుర వైరస్' ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరల్ వ్యాధి బారిన పడి ఇప్పటివరకు 22 మంది చిన్నారులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో ఏడుగురు పిల్లలు వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో 184 మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా, వారిలో 35 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని వైద్యులు వెల్లడించారు. అయితే, వైరస్ బారిన పడిన వారంతా 15 ఏళ్లలోపు చిన్నారులేనని మంత్రి ప్రఫుల్ పన్సేరియా తెలిపారు. ఇప్పటివరకు ఆరుగురు పిల్లలు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు చెప్పారు.దీంతో గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో చండీపుర వైరస్ కేసులు నమోదవుతుండటంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ, పరీక్షలు, వైద్య చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది.అధికారుల ప్రకారం, 'చండీపుర ఎన్సెఫలైటిస్' అనేది అరుదైన వైరల్ వ్యాధి. ఇది ఇసుక ఈగల ద్వారా వ్యాపించి మెదడు వాపునకు దారితీస్తుంది. ఈ వ్యాధి ప్రధానంగా 15 ఏళ్లలోపు పిల్లలపై ప్రభావం చూపుతోందని, అయితే, ఈ వ్యాధికి ప్రస్తుతం నిర్దిష్టమైన టీకా లేదా యాంటీవైరల్ చికిత్స అందుబాటులో లేనట్లుగా వైద్యలు తెలిపారు. అలాగే, సకాలంలో చికిత్స అందకపోతే వాంతులు, మూర్ఛ వంటి తీవ్రమైన లక్షణాలు కనిపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. -
లేవగానే ఫోన్ ఎందుకు చూస్తాం?
ఉదయం కళ్లు తెరిచిన వెంటనే చాలామందికి తెలియకుండానే చేయి ఫోన్ వైపు వెళ్తుంది. అలారం ఆపిన వెంటనే.. వాట్సాప్ మెసేజ్‌లు, ఇన్స్టాగ్రామ్.. ఈమెయిల్స్ చెక్ చేయడం.. ఆఖరికి వాతావరణం ఎలా ఉందో చూడడం రోజువారీ అలవాటుగా మారిపోయింది. చాలామంది దీన్ని “మొబైల్ అడిక్షన్” భావిస్తారు. కానీ సైకాలజీ నిపుణుల ప్రకారం.. కాదంట!. ఉదయం లేవగానే ఫోన్ చూడాలనే కోరిక వెనుక కేవలం వ్యసనం మాత్రమే ఉండదు. అలవాటు, ఆసక్తి, అనిశ్చితిని తగ్గించుకోవాలనే మెదడు స్వభావం, కొత్త సమాచారం కోసం ఎదురుచూపు వంటి అనేక మానసిక అంశాలు పనిచేస్తాయి.రాత్రంతా ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆత్రుత.. మనిషి మెదడు సహజంగానే అనిశ్చితిని ఇష్టపడదు. మనం నిద్రలో ఉన్న సమయంలో ప్రపంచం ముందుకు సాగుతూనే ఉంటుంది. ఎవరైనా మెసేజ్ పంపి ఉండొచ్చు.. ముఖ్యమైన వార్త వచ్చి ఉండొచ్చు.. ఆఫీసు నుంచి మెయిల్ వచ్చి ఉండొచ్చు.. మరుసటి రోజు ప్లాన్ మారి ఉండొచ్చు. లేవగానే ఫోన్ చూడటం ద్వారా మన మెదడు ‘‘ఏమైనా ముఖ్యమైన విషయం జరిగిందా?’’ అనే సందేహానికి సమాధానం వెతుకుతుంది.ఉదాహరణకు.. ముఖ్యమైన ఇంటర్వ్యూ లేదా పరీక్ష ఉన్న రోజు లేవగానే ఫోన్ చెక్ చేయాలనే కోరిక మరింత ఎక్కువగా ఉంటుంది. కారణం.. ఆ రోజు గురించి ఏదైనా కొత్త సమాచారం వచ్చిందేమో తెలుసుకోవాలనే మెదడు ప్రయత్నం.అలవాటు ఎలా బలపడుతుంది?సైకాలజీలో దీనిని హ్యాబిట్ లూప్ (Habit Loop) అంటారు. ఒకే పని ఒకే సందర్భంలో పదేపదే చేయడం వల్ల అది క్రమంగా ఆటోమేటిక్‌గా మారుతుంది.ఇక్కడ:సంకేతం (Cue): ఉదయం నిద్ర లేవడంచర్య (Routine): ఫోన్ చెక్ చేయడంబహుమతి (Reward): కొత్త మెసేజ్, నోటిఫికేషన్, ఆసక్తికరమైన సమాచారం తెలుసుకోవడం.. ఈ మూడు కలిసి ఒక అలవాటుగా మారతాయి.కొంతకాలానికి ఫోన్లో ఏదైనా ఆసక్తికరమైన విషయం ఉంటుందని మెదడు ముందుగానే ఊహిస్తుంది. దీంతో ఉదయం లేవగానే ఫోన్ చూడాలనే అలవాటు మరింత బలపడుతుంది.ఏదో ఒకసారి వచ్చే ‘రివార్డ్’ మరింత ఆకర్షిస్తుంది.. ఫోన్ చెక్ చేసిన ప్రతిసారీ ఆసక్తికరమైన విషయం కనిపించకపోయినా.. అప్పుడప్పుడు వచ్చే మంచి అనుభవం ఆ అలవాటును కొనసాగిస్తుంది. ఒక రోజు పాత స్నేహితుడి నుంచి మెసేజ్ రావచ్చు. మరో రోజు ముఖ్యమైన ఈమెయిల్ ఉండొచ్చు. ఇంకో రోజు ఆసక్తికరమైన వీడియో కనిపించొచ్చు. ఇలా ఎప్పుడు ఏ కొత్త విషయం కనిపిస్తుందో తెలియకపోవడం వల్లే మెదడు మళ్లీ మళ్లీ ఫోన్ వైపు ఆకర్షితమవుతుంది. సైకాలజీలో దీనిని వేరియబుల్ రివార్డ్ (Variable Reward) అంటారు.ప్రపంచంతో మళ్లీ కనెక్ట్ అయ్యేందుకు.. నిద్రలో ఉన్నప్పుడు మనిషి కొంత సమయం ప్రపంచానికి దూరంగా ఉంటాడు. లేవగానే ఫోన్ చూడటం ద్వారా చాలామంది తమ చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం సమయం ఎంత?, వాతావరణం ఎలా ఉంది?, ఎవరైనా కాల్ చేశారా?, ఈరోజు ఏ పనులు ఉన్నాయి?.. ఇలా రోజును ప్రారంభించేందుకు అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఫోన్ ఒక సాధనంగా మారింది.అయితే ఇది ఆరోగ్యకరమైన అలవాటేనా?ఉదయం ఫోన్ చూడటం అనేది సాధారణ అలవాటే అయినప్పటికీ.. అది ఎంతసేపు కొనసాగుతుందన్నదే ముఖ్యం. లేవగానే రెండు నిమిషాలు ముఖ్యమైన విషయాలు చూసి పక్కన పెట్టడం పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ అదే అలవాటు 45 నిమిషాల పాటు సోషల్ మీడియా స్క్రోలింగ్‌గా మారితే.. దృష్టి, ఉత్పాదకత, మానసిక స్థితిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.ఫోన్ చూడటం అంటే అడిక్షన్ కాదు!లేవగానే ఫోన్ కోసం వెతకడం మాత్రమే చూసి దాన్ని వ్యసనంగా పరిగణించలేమని నిపుణులు చెబుతున్నారు. నిజమైన మొబైల్ అడిక్షన్ అంటే నియంత్రణ కోల్పోవడం, అవసరం లేకున్నా పదేపదే ఉపయోగించడం, దాని వల్ల రోజువారీ జీవితంపై ప్రతికూల ప్రభావం పడటం వంటి లక్షణాలు ఉండాలి. అందుకే.. ఉదయం ఫోన్ వైపు చేయి వెళ్లడం వెనుక కేవలం అలవాటు మాత్రమే కాదు.. మెదడు కొత్త సమాచారం కోసం చేసే సహజ ప్రయత్నం కూడా ఉంటుంది. -
బోసి మెడ.. ఖాళీ చేతులు.. ఇదేం అలవాటు?
చేతికి వాచ్ లేదు.. వేళ్లకు ఉంగరాలు కనిపించవు.. మెడలో చైన్, చెవులకు ఆభరణాలు కూడా ధరించరు.. ఇలాంటి వారిని చూసినప్పుడు చాలామందికి ఒకే ప్రశ్న వస్తుంది.. “ఇదేం అలవాటు?” అని. కొందరు వీరికి ఫ్యాషన్‌పై ఆసక్తి ఉండదని అనుకుంటారు. కానీ ఆభరణాలకు దూరంగా ఉండటానికి కేవలం ఫ్యాషన్ కారణమే కాదు.. ఇతర కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.సైకాలజీ ప్రకారం.. ఒక వ్యక్తి ఏ వస్తువులు ధరిస్తారు.. ఏవి ధరించరు అన్నది వారి వ్యక్తిగత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించొచ్చు. కొందరికి చేతికి వాచ్, బ్రేస్లెట్, ఉంగరం వంటి వస్తువులు పెట్టుకోవడం అసౌకర్యంగా అనిపిస్తుంది. రోజువారీ పనుల్లో అవి ఇబ్బందిగా అనిపించడం, శరీరంపై అదనంగా ఏదైనా ఉండటం ఇష్టం లేకపోవడం వంటి కారణాలతో వాటికి దూరంగా ఉంటారు.ముఖ్యంగా సింపుల్ జీవనశైలిని ఇష్టపడేవారు తక్కువ వస్తువులతోనే ఉండాలని కోరుకుంటారు. వారికి ఆర్భాటం కంటే సౌకర్యం, స్వేచ్ఛ, సమయం ముఖ్యమని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు.ఫ్యాషన్ అంటే వ్యతిరేకత కాదు!ఆభరణాలు ధరించని వారంతా ఫ్యాషన్‌కు వ్యతిరేకమని భావించడం తప్పు. కొందరు తమ రూపాన్ని సహజంగా ఉంచుకోవాలని కోరుకుంటారు. మరికొందరు దుస్తులు, అలంకరణ కంటే వ్యక్తిత్వం, పనితీరు, ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అలాగే కొందరికి చిన్నప్పటి నుంచి అలాంటి అలవాటే ఉండొచ్చు. కుటుంబ వాతావరణం, పెరిగిన తీరు, వ్యక్తిగత అనుభవాలు కూడా ఇలాంటి అభిరుచులపై ప్రభావం చూపుతాయి.ఆర్థిక కారణాలు కూడా ఉండొచ్చు!ఆభరణాలకు దూరంగా ఉండటానికి ఆర్థిక కారణాలు కూడా ఒక అంశం కావచ్చు. బంగారం, వెండి వంటి ఆభరణాలు కొనుగోలు చేయడం అందరికీ సాధ్యపడకపోవచ్చు. కొందరు అవసరమైన ఖర్చులకు ప్రాధాన్యం ఇస్తూ ఆభరణాల కొనుగోలును పక్కన పెడతారు. మరికొందరు ఆభరణాలు కొనుగోలు చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ.. వాటిపై డబ్బు ఖర్చు చేయడం కంటే పొదుపు, పెట్టుబడులు లేదంటే ఇతర అవసరాలకు ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి ఎవరైనా ఆభరణాలు ధరించకపోతే దాన్ని కేవలం వారి అభిరుచితోనే ముడిపెట్టలేమని నిపుణులు చెబుతున్నారు.తక్కువ వస్తువులు.. తక్కువ ఆందోళనకొంతమంది జీవితంలో మినిమలిజం (తక్కువ వస్తువులతో సరళంగా జీవించడం)ను పాటిస్తారు. ఎక్కువ వస్తువులను నిర్వహించడం కంటే అవసరమైన వాటితోనే జీవించడం వారికి ఇష్టం. ఇలాంటి వారు దుస్తులు, ఆభరణాలు, ఇతర వస్తువుల ఎంపికలో కూడా సరళతకు ప్రాధాన్యం ఇస్తారు.అయితే ఆభరణాలు ధరించని వ్యక్తి తప్పనిసరిగా అంతర్ముఖి అని, సామాజికంగా కలవలేడని చెప్పలేం. అదే విధంగా ఆభరణాలు ఎక్కువగా ధరించే వారు ఆర్భాటాన్ని ఇష్టపడతారని కూడా భావించకూడదు.అలవాటు వెనుక కారణం ఒక్కటే కాదు..మనిషి ప్రవర్తన అనేది అనేక అంశాల కలయిక. వ్యక్తిగత అభిరుచులు, సౌకర్యం, ఆర్థిక పరిస్థితులు, జీవన విధానం.. ఇలా ఎన్నో విషయాలు కలిసి ఒకరి అలవాట్లను నిర్ణయిస్తాయి. అందుకే బోసి మెడ, ఖాళీ చేతులు కనిపిస్తే దాని వెనుక ఒకే కారణం ఉందని భావించకూడదు. అది వారి స్వంత ఎంపిక కావచ్చు.. వారి జీవనశైలిలో భాగం కావచ్చు.(గమనిక: ఇవి సైకాలజీ, ప్రవర్తనా విశ్లేషణల ఆధారంగా చెప్పే సాధారణ అంశాలు మాత్రమే. ఒక్క అలవాటుతో ఒకరి వ్యక్తిత్వం లేదంటే ఆర్థిక పరిస్థితిని నిర్ణయించలేం.) -
Health: తప్పొప్పుల ఉప్పు..
మనం ప్రతిరోజూ ఉప్పు వాడకుండా అస్సలు ఉండం. ఇందులో ఉండే రసాయనం పేరే ‘సోడియమ్ క్లోరైడ్’. సాంకేతికంగా సంక్షిప్తంగా ఎన్ఏసీఎల్ అంటూ చెబుతారు. ఇప్పుడు మార్కెట్లో రకరకాల ఉప్పులు దొరుకుతున్నాయి. వాటి ప్రయోజనాలూ, ప్రతికూలతలూ పరిశీలిద్దాం. ఉప్పు మోతాదు ఎక్కువైనా తక్కువైనా ముప్పు అన్న విషయాన్నీ తెలుసుకుందాం.- మన సంస్కృతిలో ఉప్పు భూమిక తక్కువేమీ కాదు.- మన వాడుకలో ఉప్పు వాడకం చిన్నదేమీ కాదు. అందుకే అది...- ‘ఉప్పు’కప్పురంబు అంటూ పద్యాల్లో ఉంటుంది. - పదునగు మంచికూర నలపాకం చేసి... అందు ‘ఉప్పు’ లేక రుచిపుట్టగ నేర్చునా అంటూ శతకాల్లో ఉంటుంది. - ఎంతటి ధనవంతుడైనా ఉప్పు భోజనమే తప్ప మెరుగుబంగారం మింగబోడంటూ జాతీయాల్లో ఉంటుంది. - ఒకప్పుడు వేతనం ఉప్పు రూపంలో ఉండటంతో ‘‘మీ ఉప్పు తిని బతికాం’’ అంటూ నుడికారాల్లోనూ ఉంటుంది. - ఉప్పు లేని కూర... చప్పిడి భోజనం అంటూ సామెతల్లోనూ ఉంటుంది. - వీటన్నింటికీ తోడు మన వంటల్లో ఎలాగూ ఉంటుంది. - సంస్కృతిలోనే కాదు... ఆరోగ్యం పేరిట ఇప్పుడు వంట దినుసుగా కూడా ఎన్నెన్నో రకాలుగా దొరుకుతోంది. ఆ ‘ఉప్పు’ స్వరూపాలేమిటో, వాటి ఉపయోగాలేమిటో చూద్దాం.1. ఫ్లేక్ సాల్ట్..ఇది పూర్తిగా సాధారణ టేబుల్ సాల్ట్ లాంటిదే. అయితే ఇది స్ఫటికాలలా కాకుండా చాలా పలుచని రేకుల్లా, తేలిగ్గా విరిగే (బ్రిటిల్) పొరలు పొరల రేకుల్లా, కొన్ని సందర్భాల్లో ఖాళీగా ఉండే పిరమిడ్‌లా కూడా ఉంటుంది. దీన్ని ఖరీదైన రెస్టారెంట్లలో వాడుతుంటారు. వంట చివర్లో చల్లుతారు.లాభాలు / లోపాలు ఫ్లేక్ సాల్ట్‌ను రుచి కోసం కంటే మంచి టెక్స్చర్ కోసం ఎక్కువగా వాడతారని చెప్పవచ్చు. వంటల్లో త్వరగా కరిగిపోతుంది. ఇది మినహా మిగతాదంతా దాదాపుగా టేబుల్ సాల్ట్ లాగే ఉంటుంది.2. స్మోక్డ్ సాల్ట్..ఇది కొన్ని ప్రత్యేకమైన కలప / చెక్కను కాల్చి ఆ పొగతో పొగచూరేలా చేసిన ఉప్పు. నిర్దిష్టమైన కొన్ని రకాల చెక్క బెరడును కాలుస్తూ ఆ పొగను దాదాపు 14 రోజుల పాటు పొగచూరేలా చేశాక ఆ ఉప్పు ఒక రకమైన (సు)వాసన వస్తుంటుంది. ఇలా ఉప్పును ‘స్మోక్డ్’ ఉప్పుగా మార్చడం కోసం సాధారణంగా ఓక్, ఆపిల్ ఉడ్, ఆల్డర్, హికరీ, మెస్క్వైట్ వంటి చెక్కలను కాలుస్తారు. ఇలా సరికొత్త ఫ్లేవర్‌తో రూపొందడంతో ఈ తరహా ఉప్పు బార్బెక్యూ వంటలకు బాగా సరిపోతుంది.లాభాలు / లోపాలుదీని వాడకం వల్ల జీర్ణక్రియ కొంత మెరుగుపడుతుందనే భావన ఉంటుంది. ఇందుకు శాస్త్రీయమైన రుజువులు పెద్దగా లేవు. అయితే పరిమితంగా వాడినప్పుడు అలాంటి ఫీలింగ్ కొంతమందిలో కనిపిస్తుంది. దీన్ని ఎక్కువగా వాడటం వల్ల కడుపు ఉబ్బరం వంటి ప్రతికూలతలు కనిపిస్తాయి. ఎక్కువగా వాడితే సాధారణ ఉప్పు వల్ల ఉండే దుష్పరిణామాలే ఉంటాయి.3. పొటాషియం ఉప్పు..(పొటాషియమ్ ఉప్పు) లేదా ‘లో–సోడియం సాల్ట్’ (సోడియమ్ తక్కువ మోతాదులో ఉండే ఉప్పు) ఇందులో సోడియం మోతాదును కొంత తగ్గించి పొటాషియం క్లోరైడ్ కలుపుతారు. ఎందుకంటే సోడియమ్ క్లోరైడ్‌కు బదులు పూర్తిగా పొటాషియమ్ క్లోరైడ్ ఉంటే అది ఒకరకమైన చేదైన రుచితో ఉండవచ్చు.లాభాలు / లోపాలుసాధారణంగా సోడియమ్ లవణాలు రక్తపోటు (బీపీ)ను పెంచితే... దీనికి భిన్నంగా పొటాషియమ్ బీపీని తగ్గిస్తుంది. అందుకే బీపీ ఉన్నవారికి ప్రయోజనకరంగా దీన్ని కొందరు ఉపయోగిస్తుంటారు. అయితే దీన్ని ఎక్కువగా వాడటం వల్ల రక్తంలో పొటాషియమ్ మోతాదు పెరిగి ‘హైపర్కెలామియా’ అనే ఆరోగ్యపరమైన అనర్థం కలగవచ్చు. దీనికి తోడు కిడ్నీ వ్యాధి లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు దీని వాడకంలో జాగ్రత్తగా ఉండటం అవసరం.4. సెలరీ సాల్ట్సెలరీ గింజల పొడిని ఉప్పుతో కలిపి బ్లెండ్ చేయడం వల్ల వచ్చే ‘ఉప్పు’ను ‘సెలరీ సాల్ట్’గా పేర్కొంటారు. ఇది పూర్తిగా మామూలు ఉప్పు లాంటిదే అయినప్పటికీ కొన్ని రకాల ఆహారాల్లో ఫ్లేవర్ కోసం దీన్ని వాడుతుంటారు. సాధారణంగా బేకరీ ఐటమ్స్ అయిన హాట్‌డాగ్‌లు, కొన్ని మాక్‌టెయిల్ పానియాల్లో, అలాగే కొన్ని రకాల సలాడ్స్‌లో దీన్ని వాడతారు. ఇక కొన్ని సూపులూ, రోస్టెడ్ వెజిటబుల్స్లోనూ ఉపయోగిస్తారు. సెలరీ గింజలను కలపడం తప్ప దీని మిగతా గుణాగణాలన్నీ సాధారణ ఉప్పువే.5. వెల్లుల్లి ఉప్పు (గార్లిక్ సాల్ట్) మూడు మోతాదుల ఉప్పుకు ఒక మోతాదు ఎండిన వెల్లుల్లి ΄ûడర్‌ను కలిపి తయారు చేసేదే ఈ గార్లిక్ సాల్ట్. వంటల్లో మంచి రుచికోసం దీన్ని వాడుతుంటారు. సాధారణంగా మంచి రుచి కోసం మాంసాహారాలూ, కొన్ని రకాల శాకాహారాలతో పాటు ముఖ్యంగా పాప్‌కార్న్ తయారీలో దీన్ని ఉపయోగిస్తుంటారు. ఇది మినహా దాదాపుగా ఇది సాధారణ ఉప్పు లాంటిదే.6. ఉల్లి ఉప్పు (ఆనియన్ సాల్ట్)వెల్లుల్లి ఉప్పులో వెల్లుల్లి కలిపినట్టే... ఇందులో మూడు మోతాదుల ఉప్పుకు ఒక మోతాదు ఎండబెట్టిన ఉల్లి ΄ûడర్‌ను కలిపి దీన్ని తయారు చేస్తారు. కాస్తంత మంచి ఫ్లేవర్ కోసం దీన్ని వాడుతుంటారు. ఇది మినహా ఇందులోనూ దాదాపు టేబుల్ సాల్ట్‌లో ఉండే గుణగణాలూ, లాభనష్టాలే ఉంటాయి. 7. అయోడైజ్డ్ సాల్ట్సాధారణ టేబుల్ సాల్ట్‌కు అయోడిన్ కలిపితే వచ్చేదే ఐయోడైజ్డ్ సాల్ట్. కొన్నేళ్ల నుంచి మనదేశంలో సామాజిక, సామూహిక ఆరోగ్యం కోసం వాడుతున్న ఉప్పు ఈ అయోడైజ్డ్ ఉప్పు.లాభాలు..- ఒకప్పుడు మన దేశంలో లక్షలాది మందికి అయోడిన్ లోపం వల్ల... గాయిటర్, థైరాయిడ్ సమస్యలు- పిల్లల్లో మెదడు ఎదుగుదలలో లోపాలు... కనిపించేవి. అందుకే మన ప్రభుత్వాల ఆధ్వర్యంలో అయోడైజ్డ్ ఉప్పుకు ప్రాధాన్యం,ప్రోత్సాహం దొరికింది. దాంతో పిల్లలూ, పెద్దల్లో ఆ ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టాయి.లోపాలు..ఒక్క అయోడిన్ కలపడం మినహా ఇది పూర్తిగా సాధారణ టేబుల్ సాల్ట్ లాంటిదే. అందుకే ఎక్కువ మోతాదులో వాడితే బీపీ పెరగడం వంటి అనర్థాలు ఏర్పడతాయి. రక్తం వడపోత సమయంలో మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావాలు కనపడతాయి.8. సీజనింగ్ సాల్ట్ ఇందులో సాధారణ ఉప్పుకు మిరియాల ΄ûడర్, వెల్లుల్లి ΄ûడర్, ఉల్లి ΄ûడర్, కొన్ని సందర్భాల్లో అజినమోటో వంటి (ఎమ్ఎస్జీ) ΄ûడర్, పాప్రికా (ఇది ఒకరకం కలరింగ్ అండ్ ఫ్లేవర్ ఏజెంట్)తో పాటు ఇతర రకాల మసాలాలు కలిపి తయారు చేస్తారు. మంచి రుచి కోసం వాడే ఉప్పు ఇది. ఇందులోనూ ప్రధానంగా రుచి కోసం కలిపే పదార్థాల గుణాలు తప్ప... ఎక్కువ మోతాదు సాధారణ ఉప్పే ఉంటున్నందున... పరిమితికి మించి వాడితే దానివల్ల కలిగే దుష్పరిణామాలే కనిపిస్తాయి.9. అజినోమోటో (ఎమ్ఎస్జీ)ఇది చైనీస్ వంటకాల్లో వాడే ఉప్పు అని చాలామందికి తెలిసిన విషయమే. సాధారణ ఉప్పులో ఉండే రసాయనం సోడియమ్ క్లోరైడ్ అయితే ఇందులో మోనో సోడియమ్ గ్లుటామేట్ అనే రసాయనం ఉంటుంది. దీనివల్ల సా«ధారణంగా మనకు తెలిసిన తీపి, ఉప్పు, చేదు, వగరు రుచులకు తోడుగా ‘ఉమామీ’ అనే ప్రత్యేకమైన రుచి వస్తుంది. అందుకే ఈ ప్రత్యేక రుచి కోసం జపనీయులు, కొరియన్లు... మరీ ముఖ్యంగా చైనీస్ తమ వంటకాల్లో ఈ తరహా ‘ఉప్పు’ను వాడుతుంటారు.10. పిక్లింగ్ సాల్ట్దీన్ని ఊరగాయల కోసం ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇందులో అయోడిన్, యాంటీ–కేకింగ్ పదార్థాలు ఉండవు కాబట్టి ఊరగాయ రంగు మారకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది.11. సాధారణ ఉప్పు (టేబుల్ సాల్ట్)ఇది దాదాపు మనందరమూ ప్రతిరోజూ కూరల్లో, వంటకాల్లో... భోజనం అయ్యాక పెరుగులో రోజూ వాడే తెల్లని ఉప్పు. ఇందులో ఉండేవి...- 97–99% సోడియం క్లోరైడ్.- ఉప్పు గడ్డకట్టకుండా ఉండటం కోసం కొద్దిగా యాంటీ–కేకింగ్ ఏజెంట్లు వాడతారు.- కొంతకాలం కిందటి నుంచి అయోడిన్ కలుపుతున్నారు. - లాభాలు.. చాలా చవక, దాదాపు చాలావరకు పరిశుభ్రంగా ఉంటుంది.- అయోడిన్ కలిపితే అయోడైజ్డ్ రూపంలో దొరుకుతుంది.- లోపాలు.. సోడియం మోతాదు ఎక్కువ. ఎక్కువగా తినడం వల్ల హై–బీపీ రావచ్చు. (బీపీ పెరగవచ్చు)12. రాక్ సాల్ట్ (సైంధవ లవణం)ఇది కూడా సాధారణ టేబుల్ సాల్ట్ లాంటిదే అయినా ఇది లభ్యమయ్యేది గనుల నుంచే. అందుకే కొన్ని ఇతర లవణాలు కలవడం వల్ల దీన్ని రంగు కాస్త వేరుగా ఉండవచ్చు. సాధారణంగా దీని రంగు... తెలుపు, గులాబీ, లేత బూడిద.- ప్రత్యేకత : ఇందులో కొద్ది మోతాదులో కొన్ని సహజ ఖనిజాలు ఉంటాయి. కానీ వాటి మోతాదు చాలా చాలా తక్కువ. అందువల్ల ‘రాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల దేహానికి కాల్షియం, మెగ్నీషియం బాగా అందుతాయి’ అనే మాటలో పెద్దగా వాస్తవం లేదు.13. కోషర్ సాల్ట్ ఇది పూర్తిగా సాధారణ ఉప్పులాంటిదే. అయితే దీని స్ఫటికాల సైజు, వాటి సాంద్రత వేరుగా ఉంటాయి. ఇందులో అయోడిన్, యాంటీ కేకింగ్ ఏజెంట్స్ ఉండవు.దీని ప్రత్యేకతలు..- దీని లభ్యత పెద్ద స్ఫటికాల రూపంలో.- చేతితో చల్లడానికి సులువుగా ఉంటుంది.- మాంసానికి బాగా అంటుతుంది. సాధారణ ఉప్పతో పోలిస్తే ఆరోగ్య పరంగా ప్రత్యేకమైన తేడా ఏమీ ఉండదు.14. బ్లాక్ సాల్ట్ (కాలా నమక్)ఇది భారతదేశంలో బాగా ప్రసిద్ధి. తెలుగులో దీన్ని ‘నల్ల ఉప్పు’ / ‘నల్లుప్పు’ అని పిలుస్తారు. ఇందులో గంధకం (సల్ఫర్) సమ్మేళనాలు ఉండటం వల్ల కొద్దిగా ఉడికించిన గుడ్డులాంటి వాసన లేదా కాస్తంత ఘాటైన వాసన వస్తుంటుంది. దీన్ని చాట్ మసాలాలు, పెరుగుచట్నీ (రాయితా), పండ్లపై చల్లుతారు.15. హిమాలయన్ పింక్ సాల్ట్ఇది కూడా ఒక రకం రాక్ సాల్టే. కాకపోతే ఇది హిమాలయ సానువులనుంచి లభ్యమయ్యే లవణం. దీనికి గులాబీ రంగు రావడానికి కారణం ఇందులో ఉండే ఐరన్ ఆక్సైడ్. అయితే దీన్ని మార్కెట్ చేసే కొన్ని కంపెనీలు ఇందులో ‘84 రకాల ఖనిజలవణాలు (మినరల్స్) ఉన్నాయంటూ పేర్కొంటుంటాయి. ఇది వాస్తవమే అయినప్పటికీ... నిజానికి ఆ మోతాదులు చాలా చాలా తక్కువ. ఆ 84 ఖనిజాలన్నీ చాలా సూక్ష్మ పరిమాణాల్లో మాత్రమే ఉంటాయి. అందువల్ల వాటి ద్వారా ఆరోగ్యానికి ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరతాయని చెప్పే మాటలకు బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు.16. సముద్రపు ఉప్పు (సీ సాల్ట్)దీన్ని సముద్రపు నీటి నుంచి తయారు చేస్తారు. సముద్రపు ఒడ్డున మడిలాగా చేసి అనేక మడులలో సముద్రపు నీటిని ప్రవహింపజేసి, ఆ నీరు క్రమంగా ఇగిరిపోయేలా / ఆవిరైపోయేలా చూస్తారు. ఇలా మడిలా చేసి తీస్తారు కాబట్టి దీన్ని సముద్రం నుంచి పండించే ‘‘ఉప్పు పంట’’గా అభివర్ణిస్తారు.ఇందులో ‘సోడియం క్లోరైడ్’తో పాటు ఉండేవి... మెగ్నీషియం – కాల్షియం ∙పొటాషియం... అనే ఈ లవణాలన్నీ కూడా కొద్ది కొద్ది మోతాదుల్లో ఉంటాయి. ఈ లవణాల కారణంగా రుచి కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ ఇది దాదాపు టేబుల్ సాల్ట్‌తో సమానమే. ఇందులోని అనుకూలతలూ, ప్రతికూలతలూ సాధారణ టేబుల్ సాల్ట్‌తో సమానం.ఇదొక ఉప్పు కాని ఉప్పు..వాస్తవంగా చెప్పాలంటే ఇది మామూలు ఉప్పు లాంటిది కాదు. ఈ మోనోసోడియం గ్లూటామేట్ రసాయనంలో గ్లూటామేట్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. దీనివల్లనే ఉమామీ అనే కొత్త రుచి వస్తుంది. ఈ తరహా ఉప్పు కాని ఉప్పులో కొన్ని రకాల మష్రూమ్ (పుట్టగొడుగుల) పొడి, సముద్రపు ఆల్గే తాలూకు పొడి, ఎండిన టమాటా, ఈస్ట్ నుంచి తీసిన ఎక్స్‌ట్రాక్ట్‌ల వంటివి కలిపి తయారు చేస్తారు. దీన్ని కొన్ని రకాల వంటల్లో ఒక సీజనింగ్ మిశ్రమాలతో తయారైన ‘ఉమామీ సాల్ట్’గా వాడుతుంటారు. అందుకే దీన్ని ఉప్పు అనడం కంటే... ఇదొక అనేక రకాల ఫ్లేవర్లను ఇచ్చే పదార్థాల ఒక ప్రత్యేకమైన మిశ్రమంగా చెప్పవచ్చు.ఒక సూచన: దీన్ని ఎక్కువగా వాడటం వల్ల ఆరోగ్యపరమైన అనర్థాలు ఎక్కువే. అందుకే దీన్ని చాలా పరిమితంగా మాత్రమే... అందునా చాలా అరుదుగా వాడటమే మంచిది.ఉప్పు... ముప్పు! చాలా కంపెనీలు తమ ఉత్పాదన తాలూకు ఉప్పులో 70 రకాల ఖనిజాలు, 84 ఖనిజాలు, ప్రాచీన సముద్రాల ఉప్పు‘, ‘డిటాక్స్ సాల్ట్’, ‘మినరల్ సాల్ట్‘ వంటి ఆకర్షణీయమైన పదాలతో ప్రచారం చేసుకుంటూ ఉంటాయి. వినడానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, ఆరోగ్యపరంగా వాటితో అంతగా ప్రయోజనం ఉండదన్న విషయం తెలుసుకోవాలి. అది ఏ రకమైన ఉప్పు అయినప్పటికీ అందులోని సోడియం మోతాదు ఎక్కువైతే అధిక రక్తపోటు, గుండె–రక్తనాళాల సమస్యల ప్రమాదాలు పెరుగుతాయి. అందుకే మనం ఏ రకమైనది అయినప్పటికీ ‘ఉప్పు పెరిగితే ముప్పు’ అని గుర్తుంచుకోవాలి.ఒక ముఖ్యమైన విషయం... సాధారణ ప్రజలలందరూ వాడుకోతగినది అయోడైజ్డ్ ఉప్పు. ఇక రక్తపోటు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు లో–సోడియం (పొటాషియం) ఉప్పు వాడుకోవచ్చు. అలాగే రాక్ సాల్ట్, పింక్ సాల్ట్, సీ సాల్ట్ వంటి వాటిని రుచి లేదా వంట అవసరాల కోసం వాడవచ్చుగానీ అవేవో ఆరోగ్యపరంగా అద్భుతాలు చేస్తాయన్నది కేవలం అపోహ మాత్రమే. చివరగా... ఆసక్తికరమైన విషయం చెప్పాలంటే... ఉప్పు (సోడియం క్లోరైడ్)లోని అయాన్ల వల్లనే మన మెదడు నుంచి కండరాలకు కదలికల కోసం అవసరమైన సంకేతాలు అందుతుంటాయి. ఈ ఉప్పు అనేదే లేకపోతే మన నరాల నుంచి విద్యుత్ తరంగాల రూపంలో సంకేతాలు అందవు. అప్పుడు కండరాలు కదలవు, గుండె సక్రమంగా కొట్టుకోదు. అందుకే ఎంత మోతాదులో అవసరమో అంత మోతాదులో ఉప్పు వాడాల్సిందే. అది ప్రతివ్యక్తికి రోజుకు 5 గ్రాములు మించకూడదు (డబ్ల్యూహెచ్ఓ ప్రకారమైనా లేదా మన ఐసీఎమ్ఆర్ సూచనల ప్రకారమైనా) అని గుర్తుంచుకోండి. అంతేతప్ప పూర్తిగా ఉప్పు మానేస్తే ‘హైపో నైట్రీమియా’ అనే ఆరోగ్యపరమైన అనర్థం ఏర్పడుతుందని గుర్తుంచుకోవాలి.- ఎస్. స్వాతి, క్లినికల్ డైటీషియన్నిర్వహణ: యాసీన్ -
‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
కండలవీరుడు, బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో కనిపించిన ఆయన తాజా లుక్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఎప్పుడూ ఫిట్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపించే సల్మాన్.. ఈసారి కాస్త సన్నగా, ముఖం మొత్తం పాలిపోయి కనిపించడంతో పలువురు అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.ముంబైలోని స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ (SRA) కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. అక్కడ ఆధునిక డేటా కలెక్షన్, వెరిఫికేషన్ సపోర్ట్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అలాగే లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. సల్మాన్ ఆరోగ్యంపై అభిమానుల మధ్య చర్చ మొదలైంది. కొందరు ఆయన బాగా సన్నబడ్డారని, అలసటగా కనిపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరేమో వయసు పైబడడం వల్లేనేమో అని చర్చించుకున్నారు.Is everything ok with Salman Khan and his health ..? 😳😳 pic.twitter.com/dSSPmz0OCX— Yo Yo Funny Singh (@moronhumor) July 19, 2026సల్మాన్ ఖాన్(60) గతంలో ట్రైజెమినల్ న్యూరాల్జియా (Trigeminal Neuralgia) అనే నరాల సంబంధిత సమస్యతో బాధపడినట్లు వెల్లడించారు. తీవ్రమైన ముఖ నొప్పిని కలిగించే ఈ వ్యాధిని సాధారణంగా సూసైడ్ డిసీజ్ “Suicide Disease” అని కూడా పిలుస్తారు. ఈ సమస్య కారణంగా తాను ఒక దశలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. విదేశాల్లో చికిత్స సైతం తీసుకున్నానని ఆయన సల్మాన్ గతంలో తెలిపారు. అలాగే మెడకు సంబంధించిన సమస్యలు, నొప్పుల కారణంగా కూడా ఆయన గతంలో చికిత్స తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆయన తాజా లుక్కు ఈ ఆరోగ్య సమస్యలే కారణమా? అనే చర్చా జోరందుకుంది. అయితే సల్మాన్ ఖాన్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. “Aap logon ki tabiyat kaisi hai?” (మీ అందరి ఆరోగ్యం ఎలా ఉంది?) అంటూ ఆయన అభిమానులను పలకరించారు. తాజాగా కనిపించిన లుక్‌తోనే ఆయన బ్లాక్ అండ్ వైట్‌లో స్టైలిష్ ఫొటో షూట్ ఫొటోలను పోస్ట్ చేసి మరీ ఆ ప్రశ్న వేశారాయన. దీంతో కొందరు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు అభిమానులు కూడా స్పందిస్తూ.. “ముందుగా మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పండి భాయ్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.Aap logon ki tabiyat kaisi hai ? pic.twitter.com/sFWklGKo8K— Salman Khan (@BeingSalmanKhan) July 19, 2026ప్రస్తుతం సల్మాన్ ఆరోగ్యంపై అధికారికంగా ఆయన బృందం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఆయన కూడా నేరుగా స్పందించలేదు. అయితే ఆయన తాజా లుక్, ఆ తర్వాత చేసిన ట్వీట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. పలువురు అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. “భాయ్ జాగ్రత్తగా ఉండండి”, “మీ ఆరోగ్యం ముఖ్యం” అంటూ సందేశాలు పంపుతున్నారు. మరికొందరు మాత్రం వయసు పెరుగుతున్నా సహజంగా కనిపించడం గొప్ప విషయమని ప్రశంసిస్తున్నారు.ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ అనే సినిమాలో నటిస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆయన భారత సైన్యానికి చెందిన కల్నల్ పాత్రలో కనిపించనున్నారు. చిత్తరంగదా సింగ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు ఈద్ 2027 సందర్భంగా నయనతారతో ఓ కొత్త ప్రాజెక్ట్‌లోనూ సల్మాన్ కనిపించనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించే ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. -
ఎబోలా వైరస్ అవగాహన చాలు ఆందోళన వద్దు
ఇటీవల ప్రపంచాన్ని భయపెడుతున్న వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఎబోలా వైరస్ కూడా ఒకటి. ఈ వ్యాధిగ్రస్తుల్లో మరణాల రేటు 25% నుంచి 90% వరకు ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా ఇది బెంబేలెత్తిస్తోంది. అదే ఇటీవల ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేసిన కరోనా వైరస్ (కోవిడ్)లో మరణాల రేటు కేవలం 0.5% నుంచి 2% మాత్రమే. అయితే కోవిడ్‌లో మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ప్రబలడంతో దాని మృతుల సంఖ్య ప్రపంచాన్ని నివ్వెరపరచింది. అలా కాకుండా ఎబోలా వైరస్ మాత్రం ఇప్పటికీ కేవలం ఆఫ్రికాలోని సబ్–సహారా దేశాల్లోనే వ్యాప్తిలో ఉంది. అయితే ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. ఇటు తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు అటు ఆంధ్రప్రదేశ్‌లోకి... చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశవిదేశాల ప్రయాణికులు వస్తున్న నేపథ్యంలో ఎబోలాపై ఆందోళన ముప్పిరిగొంటోంది. ఈ నేపథ్యంలో ‘ఎబోలా వైరస్ డిసీజ్’పై ప్రాథమిక అవగాహన కోసం ఈ కథనం.ఇటీవలే ఎబోలా వైరస్ పీడిత దేశాల నుంచి 28 మంది ప్రయాణికులు దేశంలోకి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. దాంతో ఒక్కసారిగా అప్రమత్తమైన ఆరోగ్య యంత్రాంగం విమానాశ్రయంలో ప్రయాణికులను పరీక్షించడమే కాకుండా... ఒకవేళ వారు ఎబోలా విస్తరిస్తున్న ప్రాంతాల నుంచి వచ్చినట్టు గుర్తిస్తే... వెంటనే వారిని 21 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచి పరిశీలించడానికి పూనుకుంటున్నారు. ఇది మినహా ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎబోలా తాలూకు ఎలాంటి కేసులూ లేవు. కాబట్టి దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు, అవగాహన పెంచుకోవడం అవసరమని గుర్తిస్తే చాలు. ఈ నేపథ్యంలో ఎబోలా అంటే ఏమిటి, అదెలా వ్యాపిస్తుంది, లక్షణాలేమిటి వంటి అంశాలను సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఏమిటీ ఎబోలా? ఎబోలా వైరల్ డిసీజ్‌ను మునుపు ‘ఎబోలా హీమరేజిక్ ఫీవర్’ అని పిలిచేవారు. ఒకరకంగా చూస్తే 25% నుంచి 90% ఫెటాలిటీ రేటుతో ఇది చాలాసార్లు ప్రాణాంతకంగా పరిణమించేదే. ఇందులో చాలా రకాల వైరల్ ప్రజాతులున్నాయి. ఇవి ఫైలోవిరిడే అనే కుటుంబానికి చెందిన వైరస్లు. ఈ రకం వైరస్లు ‘వైరల్ హీమరేజిక్ ఫీవర్’ అనే జ్వరాలకు కారణమవుతాయి. ఆ జ్వరాల్లో కలిగే తీవ్రమైన బాహ్య, అంతర్గత రక్తస్రావం వల్ల పరిస్థితి తీవ్రమవుతుంది. ఈ వైరస్ మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసి అవయవాల పనితీరును దెబ్బతీస్తుంది. వ్యాధి తీవ్రమైనప్పుడు బాహ్య, అంతర్గత రక్తస్రావం, వ్యవస్థల వైఫల్యం (మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్)తో మరణం సంభవిస్తుంది. ప్రభుత్వాల ఆరోగ్య సంస్థల హెచ్చరికలు... ఎబోలా వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొకరికి నేరుగా శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. భారతదేశంలో ఇప్పటివరకూ ఎబోలా వైరస్‌కు సంబంధించి ఎలాంటి కేసులూ నమోదు కాలేదు. అయితే మన హైదరాబాద్, పొరుగున ఉన్న చెన్నై వంటి అంతర్జాతీయ విమానాశ్రయాలున్న నగరాలకు ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి రాకపోకలు కొనసాగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. అందుకే కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు, ఐసీఎమ్ఆర్ సంస్థలు... ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం కొన్ని మార్గదర్శకాలు ఏర్పరచి ఆ మేరకు వాటిని అమలు చేస్తున్నాయి. ఎబోలా వైరస్ రకాలు... ఎబోలా వైరస్‌కు చెందిన ఆరు రకాల ప్రజాతులను గుర్తించారు.వ్యాప్తి ఇలా... ఎబోలా వైరస్... కరోనా వైరస్‌లా గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. ఇది... బాధితుల రక్తంతో గానీ లేదా వారి శరీరద్రవాలను తాకడం వల్ల, వారికోసం ఉపయోగించిన (ఇన్ఫెక్టెడ్) వైద్యపరికరాలను తాకడం వల్ల, బాధితులతో లైంగికంగా కలవడం వల్ల వ్యాప్తి చెందే అవకాశాలుంటాయి. ఇలా వ్యాప్తి చెందదు... బాధితుల పక్కనే కూర్చోవడం ∙వారు వదిలిన గాలిని పీల్చడం ∙వారితో కలిసి తినడం ∙దోమ కాటు వల్ల వ్యాప్తి చెందదు. బాధితుల ఫ్లుయిడ్స్‌తో కాంటాక్ట్‌లోకి రావడం మినహా మరే రకంగానూ ఇది వ్యాప్తి చెందే అవకాశం లేదు కాబట్టి దీని గురించి ఆందోళన పడనక్కర లేదు. నిర్ధారణ పరీక్షలు... ఎబోలా వ్యాధి తాలూకు మొదటి లక్షణాలు మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి వ్యాధి లక్షణాలతో పోలి ఉండటం వల్ల వెంటనే దీని నిర్ధారణ ఒకింత కష్టం. అయితే రెండో, మూడో దశల్లోని లక్షణాలతో పోల్చుకుని చూసుకోవడం వల్ల నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి నిర్ధారణ కోసం వైద్యులకు పనికి వచ్చే అంశాలేమిటంటే... ∙గత 21 రోజుల వ్యవధిలో వ్యాప్తి చెందుతున్న ఆఫ్రికా దేశాల్లో ప్రయాణం చేసి ఉండటం, ఎబోలా వ్యాధి సోకినవారి అంత్యక్రియలకు హాజరు కావడం, వృత్తి సంబంధంగా ఏవైనా ప్రయోగశాలల సందర్శనతో పాటు... ∙ఆర్టీపీసీఆర్ పరీక్ష ∙ఎలీజా పరీక్ష ∙వైరస్ కల్చర్ వంటి పరీక్షతో. ఇది వైరల్ జ్వరం కావడం వల్ల ప్రస్తుతానికి మందులేం అందుబాటులో లేవు. అయితే 2019లో ఆర్ వీఎస్వీ జెబోవ్ అనే వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే ఇన్బాజెబ్, ఎబాంగా వంటి మందులతోనూ... అలాగే దేహం డీహైడ్రేట్ కాకుండా తగినన్ని ద్రవాలను ఇవ్వడం, సెలైన్ పెట్టడం, రక్తపోటు అదుపులో ఉండేలా చూడటం, అవసరమైతే ఆక్సిజన్ పెట్టడం, మంచి పోషకాహారాన్ని అందించడం. ఈ చికిత్సలతోపాటు వ్యాధి నిరోధకత తగ్గడం వల్ల వచ్చే బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స అందించడం ద్వారా దీనివల్ల కలిగే అనర్థాలను తగ్గించడానికి తగిన చికిత్సలు అందిస్తూ బాధితులను కాపాడేందుకు చాలావరకు అవకాశాలున్నాయి. చివరిగా... 38 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా 100 ఫారెన్‌హీట్ కంటే ఎక్కువగా జ్వరం ఉండటంతోపాటు తలనొప్పి, వాంతులు లేదా విరేచనాలు, కళ్ల నుంచి పంటి చిగుర్ల నుంచి రక్తస్రావం, తీవ్రమైన నీరసం, నిస్సత్తువ, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం వైద్యులను సంప్రదించాలి. అయితే ఇప్పటివరకూ ఎబోలాకు సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కానందున... ఈ ప్రాథమిక అవగాహనను పెంచుకోవడం మినహా ప్రస్తుతానికి దీని గురించి ఆందోళన అక్కర్లేదు. లక్షణాలు... ఎబోలా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తరువాత 2నుంచి 21 రోజుల మధ్య లక్షణాలు కనిపించవచ్చు. లక్షణాలను ఎంత త్వరగా గుర్తిస్తే బాధితులను కాపాడుకోవడానికి అంతగా అవకాశముంటుంది. మొదటిది ప్రారంభ దశ... ఇందులో... ∙ఒక్కసారిగా తీవ్రమైన జ్వరం (హై ఫీవర్) ∙తీవ్రమైన అలసట (ఫెటీగ్) ∙తీవ్రమైన తలనొప్పి (సివియర్ హెడేక్) ∙కండరాల నొప్పులు (మజిల్ పెయిన్స్) ∙తీవ్రమైన గొంతు నొప్పి రెండో దశను మధ్యంతర దశగా చెప్పవచ్చు. ఇందులో... ∙వాంతులు ∙చాలా ఎక్కువగా విరేచనాలు కావడం ∙కడుపునొప్పి ∙కళ్లుఎర్రబడటం ∙చర్మంపై దద్దుర్లు ∙ఎక్కిళ్లు ∙ఛాతినొప్పిమూడో దశలో లక్షణాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో... ∙కళ్లు, ముక్కు చెవుల నుంచీ, దంతాల నుంచి రక్తస్రావం ∙కాలేయం, మూత్రపిండాల వైఫల్యం ∙తీవ్రమైన షాక్ ∙అయోమయం, ఫిట్స్ ∙తీవ్రమైన డీహైడ్రేషన్- డాక్టర్ బి. వెంకట్ నాని కుమార్సీనియర్ కన్సల్టెంట్ఇంటర్నల్ మెడిసిన్ – యాసీన్ -
చద్దన్నం తినడం మంచిదా? కాదా?..
మిగిలిపోయిన అన్నాన్ని నీటిలో, పెరుగులో లేదా మజ్జిగలో నానబెట్టి మరుసటి రోజు తినడం ఒకప్పుడు మన ఇళ్లలో సాధారణ అలవాటు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చద్దన్నం ఉదయపు ఆహారంలో అంతర్భాగంగా ఉండేది. అయితే కాలం మారేకొద్దీ ఈ అలవాటు క్రమంగా కనుమరుగవుతోంది. రాత్రంతా నానబెట్టిన అన్నం ఆరోగ్యానికి మంచిది కాదనే అభిప్రాయం చాలామందిలో బలపడింది. కానీ తరతరాలుగా కొనసాగుతున్న ఈ ఆహారపు అలవాటు వెనుక నిజంగా ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? చద్దన్నం కేవలం పాతకాలపు ఆహారమేనా, లేక ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఇందులో నిజంగానే దాగి ఉన్నాయా?.. సైన్స్ మరోసారి ఈ అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసింది.. వండిన అన్నాన్ని రాత్రంతా నీటిలో నానబెడితే ఉదయానికి సహజ కిణ్వ ప్రక్రియ (ఫెర్మెంటేషన్) ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియలో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా పెరిగి, అన్నంలోని సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేస్తాయి. దీంతో అన్నం మరింత సులభంగా జీర్ణమవుతుంది. ఇది కేవలం పుల్లటి రుచిని ఇవ్వడమే కాదు.. శరీరానికి ఉపయోగపడే మంచి సూక్ష్మజీవుల పెరుగుదలకు కూడా దోహదపడుతుంది. అందుకే చద్దన్నాన్ని సహజ ఫెర్మెంటెడ్ ఆహారంగా పరిగణిస్తారు.మిగిలిపోయిన అన్నం.. పోషకాల నిల్వ?ఫెర్మెంటేషన్ వల్ల ఆహారంలోని కొన్ని పోషకాలు శరీరానికి మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బీ-కాంప్లెక్స్ విటమిన్ల లభ్యత పెరగడంతో పాటు ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను శరీరం మరింత సమర్థంగా గ్రహించగలుగుతుంది. సాధారణంగా ఆహారంలోని కొన్ని పదార్థాలు ఖనిజాల శోషణకు అడ్డుపడతాయి. ఫెర్మెంటేషన్ ఆ అవరోధాలను తగ్గించడం వల్ల పోషకాలు మరింత ఉపయోగకరంగా మారుతాయి.గట్ హెల్త్‌పై ఎందుకింత చర్చ?ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా "గట్ హెల్త్" అంటే పేగుల ఆరోగ్యం గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, శరీర పోషకాల శోషణలో కీలక పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గట్ హెల్త్‌ను మెరుగుపరిచే ఆహారాలపై ఆసక్తి పెరిగింది.ఇక్కడే చద్దన్నం ప్రాధాన్యం పెరుగుతోంది. ఖరీదైన ప్రోబయోటిక్ డ్రింక్స్, సప్లిమెంట్లకు బదులుగా ఇందులో సహజంగా ఏర్పడే లాక్టోబాసిల్లస్ వంటి మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరచడంలో, కడుపు ఉబ్బరం తగ్గించడంలో, మలబద్ధకం వంటి సమస్యలను నియంత్రించడంలో సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.వేసవిలో ఎందుకు ఎక్కువగా తినేవారు?భారతదేశంలో చద్దన్నం సంప్రదాయం ఎక్కువగా వేసవికాలంలో కనిపించడం యాదృచ్ఛికం కాదు. ఇది శరీరాన్ని చల్లబరచడంలో, హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. చద్దన్నంలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో శరీరానికి తేమ అందుతుంది. అలాగే ఫెర్మెంటేషన్ వల్ల ఏర్పడే లాక్టిక్ యాసిడ్ శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఒకప్పుడు రైతులు, కూలీలు ఎండలో పనికి వెళ్లే ముందు చద్దన్నం తినేవారు. ఇది కడుపు నిండిన భావనను కలిగించడంతో పాటు రోజంతా శక్తిని అందించేదని పెద్దలు చెబుతుంటారు.ఎలా తింటే మంచిది?రాత్రి మిగిలిన అన్నాన్ని శుభ్రమైన పాత్రలో నీటితో నానబెట్టి, ఉదయం పెరుగు లేదా మజ్జిగ కలిపి తినవచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు జోడిస్తే రుచితో పాటు పోషక విలువలు కూడా పెరుగుతాయి. కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం మట్టి పాత్రలో నానబెడితే సహజ ఫెర్మెంటేషన్‌కు మరింత అనుకూలంగా ఉంటుంది.అందరికీ సరిపోతుందా?చద్దన్నం చాలామందికి మేలు చేసినా.. ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా సరిపోతుందని చెప్పలేం. మధుమేహం ఉన్నవారు పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అలాగే జీర్ణకోశ సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులు లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.మొత్తానికి... చద్దన్నం గురించి ఇన్నాళ్లూ ఉన్న అనుమానాలకు శాస్త్రం ఆసక్తికరమైన సమాధానం చెబుతోంది. ఇది ఏదో అద్భుత ఔషధం కాకపోయినా.. సహజ ఫెర్మెంటేషన్ వల్ల జీర్ణక్రియకు, పేగుల ఆరోగ్యానికి, వేసవిలో శరీరానికి తేమ అందించడంలో ఉపయోగపడే సంప్రదాయ ఆహారంగా గుర్తింపు పొందుతోంది. ఒకప్పుడు "మిగిలిపోయిన అన్నం"గా తక్కువగా చూసిన చద్దన్నం.. ఇప్పుడు శాస్త్రీయ పరిశోధనల్లో కొత్త కోణంలో కనిపిస్తోంది. ఖరీదైన ఆరోగ్య ఆహారాల కోసం వెతుకుతున్న ఈ కాలంలో.. మన వంటింట్లోనే తరతరాలుగా ఉన్న ఈ సాధారణ ఆహారం వెనుక దాగి ఉన్న విజ్ఞానాన్ని సైన్స్ మరోసారి గుర్తు చేస్తోంది. -
మతి మరపు @ అతి బరువు
వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు వస్తుండటం సహజం. ఇప్పడు పెరిగే వయసుతో పాటూ పెరిగే బరువు కూడా మతిమరపును ప్రేరేపిస్తోందంటూ కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇందులో అత్యంత సాధారణం అల్జీమర్స్ అనే మతిమరపు. దీనికి పెరిగే వయసుతో పాటు బరువు పెరుగుతుండట కూడా అల్జీమర్స్‌కూ అంతే కారణమవుతోందనేందుకు పరిశోధనల రూపంలో తార్కాణాలు లభ్యమవుతున్నాయి. ఇలా బరువు పెరుగుతుండటంతో పాటు అల్జీమర్స్‌కు కారణమవుతున్న ఇతర అంశాలేమిటన్నది తెలుసుకుంటూ బరువు తగ్గించుకోవడం ద్వారా మెదడు ఆరోగ్యం ఎలా మెరుగవుతుందో చూద్దాం...మతిమరపును ఇంగ్లిష్‌లో ‘డిమెన్షియా’ అంటారు. డిమెన్షియాకు కారణాల్లో అత్యంత సాధారణమైనది ‘అల్జీమర్స్’. డిమెన్షియా కొత్త అంశాల్ని నేర్చుకునేందుకు సహాయపడే (కాగ్నిటివ్) నైపుణ్యాల్లోని జ్ఞాపకశక్తి (మెమరీ)పైనా, తార్కికంగా ఆలోచించే సామర్థ్యం (రీజనింగ్)పైనా ప్రతికూలంగా ప్రభావం చూపుతుంది. ఇటీవలి కాలంలో అల్జీమర్స్ బాగా పెరుగుతోంది. ఇది అకస్మాత్తుగా కాకుండా క్రమంగా... అంటే కొన్ని నెలలు మొదలుకొని ఏళ్ల వ్యవధిలోమరచిపోయే అంశాలను పెంచుతూ పోతుంటుంది. ఉదాహరణకు మొదట్లో పేర్లు, కొద్దిసేపటి కిందట జరిగిన సంఘటనలూ, ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోవడం, కుటుంబ సభ్యుల్ని అడిగిన ప్రశ్నల్నే మళ్లీ మళ్లీ అడగడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, అటు తర్వాత తెలిసిన దారులనూ, అటు తర్వాత సమీప వ్యక్తులనూ, కుటుంబ సభ్యులను మరచిపోవడం జరుగుతుంది. చివరగా... భయభ్రాంతులకు లోనవ్వడం, మలమూత్ర విసర్జనలపై నియంత్రణ కోల్పోవడం వరకు జరగవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే నేర్చుకున్న అనేక అంశాలు రాతిమీది రాతల్లా ఉండిపోవాల్సినవి కాస్తా... పలక మీద రాతలా చెరిపివేతకు గురవ్వడాన్ని అల్జీమర్స్‌గా చెప్పవచ్చు. ఒకసారి అల్జీమర్స్ మొదలయ్యాక బాధితుల్ని మునపటిలా పూర్తిగా నార్మల్ అయ్యేలా చేయడం ఇప్పటికి సాధ్యం కాదు.చికిత్స...అల్జీమర్స్‌ను పూర్తిగా తగ్గించే మందులు లేకపోయినప్పటికీ... వాటి పురోగతిని ఆలస్యం చేయడానికి మందులు అందుబాటులో ఉన్నాయి. లక్షణాల తీవ్రత ఆధారంగా డోనెపెజిల్, రివాస్టిగ్మిన్, మెమాంటిన్, గ్యాలంటమైన్ వంటి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. మెదడులోని అన్నిరకాల కార్యకలాపాలను నిర్వహించే ఎసిటైల్ కోలిన్ అనే రసాయనం సరైన మోతాదుల్లో ఉంచడానికి ఇవి ఉపయోగపడతాయి. గత కొద్దికాలం కిందట ‘లెకనిమ్యాబ్’, ‘డొనానిమ్యాబ్’ అనే సరికొత్త మందుల్ని ఎఫ్‌డీఏ ఆమోదించింది. పైవన్నీ నోటిద్వారా తీసుకునే మందులు కాగా... లెకానిమ్యాబ్ను రెండోవారాలకు ఒకసారి సూది మందు రూపంలో ఇస్తారు. ఈనెలలోనే (మే, 2026లో) ‘డొనానిమ్యాబ్’ అనే సరికొత్త మందు మనకు అంటే రెండు తెలుగు రాష్ట్రాలకూ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఈ మందు అల్జీమర్స్ తొలిదశలో ఇది అత్యంత ప్రభావవంతమైనది. దీన్ని నెలకొక ఇంజెక్షన్ చొప్పున తీసుకోవాలి.పెరిగే బీఎమ్ఐతో జ్ఞాపకశక్తి తగ్గు తున్నా... అది నివారించగలిగే అంశమే... యూనివర్జిటీ ఆఫ్ జార్జియాలో నిర్వహించిన ఇటీవలి తాజా పరిశోధన ఫలితాలేమిటంటే... వయసు పెరుగుతున్న కొద్దీ వారి జ్ఞాపకశక్తి గతంలో వారు యువకులుగా ఉన్నంతగా ఉండకపోవచ్చు. దీనికి తోడు పెరుగుతున్న బరువు (బాడీ మాస్ ఇండెక్స్–బీఎమ్ఐ) పెరుగుతున్న కొద్దీ వారిలోనూ అభ్యాసనం ద్వారా నేర్చుకునే (కాగ్నిటివ్) నైపుణ్యాలూ, గుర్తుంచుకునే సామర్థ్యాలు (మెమరీ), భావోద్వేగాల అదుపు (మేనేజింగ్ ఎమోషన్స్), ప్లానింగ్ అలాగే నిర్వహణ సామర్థ్యాలూ, ఏకాగ్రత (కాన్సంట్రేషన్) తగ్గుతాయని తేలింది. 24 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారిలో దాదాపు 8,200 మందిపై నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అయితే ఇదేమీ చెడు వార్త కాదనీ... ఒకవేళ మనం మన బరువును అదుపులో పెట్టుకుంటే ఆ దుష్పరిణామాలు నివారించవచ్చని ఈ అధ్యయనంలో పాల్గొన్న యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో కాలేజ్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన లీడ్ ప్రొఫెసర్ డాక్టర్ సుహాంగ్ సాంగ్ పేర్కొన్నారు.నివారణ... పై అంశాలలో పెరిగే వయసు, జన్యుపరమైన అంశాలు నిరోధించలేనివి. ఇవి మినహా మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్‌ను చాలావరకు ప్రయత్నపూర్వకంగా అదుపులో ఉంచడం ద్వారా వీటిని చాలావరకు నివారించవచ్చు. ఈ కింది అంశాలు నివారణకు చాలావరకు తోడ్పడతాయి.ఆహారం... పోషకాలన్నీ ఉండే సమతులాహారం తీసుకోవడం మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా భారతీయ వంటల్లో వాడే పసుపుతో పాటు పాశ్చాత్య ఆహారాల్లో మెడిటేరియన్ డైట్ (ఆల్మండ్స్, వాల్నట్, డార్క్ చాక్లెట్స్, ఆలివ్ ఆయిల్, క్రాన్బెర్రీ) వంటివి మతిమరపు నివారణకు బాగా తోడ్పడతాయి.మెదడుకు మేత కొత్త భాషలు నేర్చుకోవడం, పుస్తక పఠనం, పజిల్స్ వంటి సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం వంటి మెదడుకు మేత కల్పించే పొడుపుకథలు, ఉల్లాసంగా ఉంచే హాబీలు, మానసిక వ్యాయామాలు మెదడును చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంచి మతిమరపు నివారణకు తోడ్పడతాయి.వ్యాయామం...దేహాన్ని చురుగ్గా ఉంచే వ్యాయామాలు చేయాలి. దాంతో మెదడుకు రక్తప్రసరణ బాగాజరిగి, న్యూరాన్లూ వాటి న్యూరల్ కనెక్షన్లు, వివిధ జీవక్రియల కోసం మెదడు స్రవించే రసాయనాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. ఫలితంగా జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.నిర్ధారణ అల్జీమర్స్ నిర్ధారణ కోసం ఇప్పడు కొన్ని రకాల పరీక్షలు కూడా అందుబాటులోకి వచ్చాయి. గతంలోని ఎమ్మారై బ్రెయిన్‌తో పాటు కొన్ని రక్తపరీక్షలూ ఇప్పుడ అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి టీఏయూ (టావు) అండ్ అమైలాయిడ్ శాతాన్ని నిర్ధారణ చేయడం; అమైలాయిడ్ పెట్ స్కాన్ ద్వారా అల్జీమర్స్‌ను నిర్ధారణ చేయవచ్చు. ఇవి చాలా తాజాగా అందుబాటులోకి వచ్చిన వైద్యపరీక్షలు.సమాజంలో నలుగురితో పాటు ఒకరిగా మెలగడం...వేడుకలు, పుట్టినరోజులూ, పెళ్లిళ్ల వంటి ఫంక్షన్లలో పదిమందినీ కలవడం వంటివి మతిమరపును దూరం చేస్తుంది. అలాంటి ఉల్లాస జీవితం వల్ల భవిష్యత్తులో అల్జీమర్స్ వచ్చే ముప్పూ తగ్గుతుంది.దీర్ఘకాలిక వ్యాధుల అదుపు...డయాబెటిస్, హైబీపీ, క్రానిక్ ఇన్ఫ్లమేషన్స్ వంటి వాటిని అదుపులో పెట్టుకోవాలి.మతి మరుపు, అల్జీమర్స్ కారణమయ్యే అంశాల్లో కొన్ని...మతిమరుపునకూ, అల్జీమర్స్‌కూ అనేక అంశాలు కారణమవుతుంటాయి. వాటిల్లోని అతి ముఖ్యమైన ఓ అరడజను కారణాలేమిటో చూద్దాం...1. జన్యుపరమైనవి : అల్జీమర్స్‌తో వచ్చే మతిమరుపునకు జన్యుపరమైన అంశాలు అతి ముఖ్య కారణాలు. కొందరి కుటుంబాల్లో అల్జీమర్స్ వంశాపారంపర్యంగా కనిపిస్తుంటుంది. ఏపీఓఈ 4 ఎల్లీల్ జన్యువు వంటి కొన్ని నిర్దిష్టమైన జన్యువులు ఈ అల్జీమర్స్ ముప్పును పెంచుతాయి.2. వయసు : పెరుగుతున్న వయసు పై సమస్యలకు ప్రధానమైన ముప్పు (రిస్క్ ఫ్యాక్టర్). పైగా ఇది నిరోధించలేని అంశం.3. పెరుగుతుండే బరువు : అధిక బరువు / ఊబకాయం (ఒబేసిటీ) వల్ల దేహంలో కొవ్వుల మోతాదు పెరగడమనే అంశం అల్జీమర్స్ వ్యాధి వచ్చే ముప్పును పెంచుతుందని ఇటీవల కొన్ని తాజా అధ్యయనాల్లో తేలింది. దేహంలోనూ, అందునా మరీ ముఖ్యంగా నడుము చుట్టూ కొవ్వు పెరగడంతో పాటు ఫిట్నెస్ తగ్గడమనే అంశం మెదడును మందకొడిగా మార్చడంతో పాటు మతిమరపును తెచ్చిపెట్టే ప్రమాదమైన సిగ్నల్స్ కారణంగా అల్జీమర్స్ వస్తుందనేది కొన్ని పరిశోధనల్లో తేలిన అంశం.4. జీవనశైలి (లైఫ్ స్టైల్) : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించినవారిలో... అంటే... ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, కొవ్వులు, చక్కెరలు ఎక్కువగా తీసుకోవడం, చురుకైన జీవితానికి దూరంగా ఒకేచోట మందకొడిగా ఉండటం, వ్యాయామం లేకుండా బద్ధకంగా ఉండటం, పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం వంట అనారోగ్యకరమైన జీవనశైలి ఉన్నవాళ్లలో అల్జీమర్స్ ముప్పు ఎక్కువ.5. దేహంలో దాగి ఉన్న ఇతర సమస్యలు : దీర్ఘకాలికంగా ఉండే డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు (కార్డియో వాస్క్యులార్ సమస్యలు)లతో పాటు దీర్ఘకాలికంగా దేహంలో ఉండే ఇన్ఫ్లమేషన్ (క్రానిక్ ఇన్ఫ్లమేషన్) మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతూ అల్జీమర్స్‌కు కారణమయ్యే అవకాశాలెక్కువ.6. వాతావరణ అంశాలు : వాతావరణంలోని కాలుష్యాలు, విషపూరిత (టాక్సిక్) పదార్థాలు కూడా అల్సైమర్స్ మతిమరపునకు కారణమవుతాయి. దీనికి విరుధ్ధంగా వీలైనంతవరకు పరిశుభ్రమైన ప్రదేశాలూ, కాలుష్యాలు లేని వాతావరణాలూ వీటి నివారణకు చాలావరకు తోడ్పడతాయి.- డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డిసీనియర్ న్యూరో ఫిజీషియన్ నిర్వహణ యాసీన్ -
దాహం లేకున్నా నీళ్లు తాగండి.. ఎందుకంటే?
సాక్షి, హైదరాబాద్: ఎండ దెబ్బకు గుండె గుభేల్మంటోంది. పగటి ఉష్ణోగ్రతలు సుమారు 45 డిగ్రీల దాకా నమోదవుతుండటం, తీవ్ర వడగాడ్పులు వీయడం, వాతావరణంలో మార్పులతో హృద్రోగాలు పెరుగుతున్నాయి. సమ్మర్ హార్ట్ ఎటాక్స్ కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లోనూ ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక రోగాలకు మందులు వాడుతున్న వారు, హృద్రోగులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.శరీర సాధారణ ఉష్ణోగ్రత 35 డిగ్రీల నుంచి 38 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ సమయంలో గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఉష్ణోగ్రత ఒక డిగ్రీ పెరిగితే గుండె 10 సార్లు ఎక్కువ కొట్టుకుంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైనే నమోదవుతుండటంతో వేసవిలో హార్ట్ ఎటాక్స్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. చర్మం నుంచి చెమట రూపంలో సోడియం, పొటాషియం వంటివి ఎక్కువ మోతాదులో బయటకు వెళ్లిపోతాయి. లవణాలు బ్యాలెన్స్ తప్పితే గుండెలయ తప్పుతుంది. డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు రక్తం చిక్కగా మారి గడ్డకట్టే ప్రమాదం ఏర్పడుతుంది. దీనివల్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని వైద్యులు చెబుతున్నారు.వాతావరణంలో మార్పులకు అనుగుణంగా గుండె పనితీరు మారుతుందని.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే సమ్మర్ కార్డియాక్ అరెస్టు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ప్రతి లక్షలో 200 మంది నుంచి 500 మందిలో గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని.. వేసవి వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలతో ఈ సమస్య 2–3 రెట్లు పెరుగుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.దాహం లేకున్నా నీళ్లు తాగండి డీహైడ్రేషన్ వల్ల రక్తం చిక్కగా మారిపోతుంది. వేసవిలో దాహం అనిపించినా లేకున్నా అరగంటకోసారి 50 మిల్లీలీటర్ల నుంచి 80 మిల్లీలీటర్ల నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటివి తాగడం మంచిది. బీపీకి మందులు (బీటా బ్లాకర్స్) వినియోగించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వేసవి వేడికి హార్ట్ రేటు పెరుగుతుంది. దీన్ని బీపీ మందులు కంట్రోల్ చేస్తాయి. దీంతో శరీరానికి అవసరమైన రక్త సరఫరా జరగదు. వేసవిలో రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. చర్మంలో రక్తనాళాల పరిమాణం పెరిగితేనే చెమట వస్తుంది.ఇలాంటి సమయంలో మెదడు, ఇతర శరీర అవయవాలకు రక్త సరఫరా తగ్గిపోతుంది. దీంతో కార్డియాక్ అరెస్ట్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రజలు ప్రత్యేకించి వృద్ధులు ఎండలో తిరగొద్దు. అలాగే సాలిడ్ ఫ్రూట్ జ్యూస్, సోడా, మద్యం, కాఫీ వంటి వాటికి దూరంగా ఉండాలి. – డాక్టర్ ఓరుగంటి సాయి సతీశ్,హెచ్ఓడీ కార్డియాలజీ యూనిట్–1, నిమ్స్ -
గుండెపోటుకు కారణాలివే...
విజయవాడ గొల్లపూడికి చెందిన 35 సంవత్సరాల చందు ఉదయాన్నే నిద్రలేవగానే ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని తొలుత సమీపంలోని ఆస్పత్రికి, అనంతరం విజయవాడలోని గుండె ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విజయవాడ లబ్బీపేటకు చెందిన రమేష్ వయసు 40 సంవత్సరాలు. ఇటీవల వేకువ జామున 4 గంటలకు ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పాడు. గ్యాస్ నొప్పిగా భావించి ఒక మాత్ర వేసుకుని పడుకున్నాడు. మళ్లీ 6 గంటలకు ఛాతీలో పెయిన్ ప్రారంభమైంది. దీంతో తమ ఇంటికి 300 మీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ గుండె వైద్యుడు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. ఇలా వీరిద్దరే కాదు.. గుండెపోటుతో ఆకస్మికంగా మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. వాకింగ్ చేస్తూ... క్లాస్రూమ్ లో పాఠాలు వింటూ... కుప్పకూలి మరణిస్తున్న వారిని నిత్యం చూస్తున్నాం. ప్రస్తుతం అతిపెద్ద కిల్లర్‌గా గుండెపోటు మారిందని వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ పేర్కొంది. గుండెపోటు మరణాలను నివారించాలంటే ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. జీవనశైలిని మార్పు చేసుకోవడంతో పాటు, ముందస్తు నిర్ధారణ పరీక్షల ద్వారా గుండెపోటు మరణాలను నివారించవచ్చునని వైద్యులు అంటున్నారు. ఉరుకుల పరుగుల జీవనంలో వత్తిడిని తగ్గించుకోవడం కూడా చాలా అవసరం అంటున్నారు. గుండెపోటుకు కారణాలివే... ∙ వయస్సు రీత్యా వచ్చే గుండెపోటు, ఇవి 45 ఏళ్లు నిండిన వారికి వస్తుంటాయి. ∙ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న వారు 40 ఏళ్ల లోపు గుండె పోటుకు గురవుతున్నారు. అందుకు కారణాలిలా ఉన్నాయి. ∙ ఫ్యామిలీ(తల్లి, తండ్రి) గుండెపోటుకు గురైన వారు ఉండటం∙ స్మోకింగ్ చేయడం ∙ కోవిడ్ ప్రభావం ∙ పుట్టుకతోనే కొన్ని రకాల జన్యుపరమైన లోపాలు ఉండటం ∙ ప్రొటీన్ డెఫిషియన్సీ ∙ జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అధిక కొలస్ట్రాల్, ఒబెసిటీ రావడం ముందస్తుగా ఏమి చేయాలి... ∙ ప్రతి ఒక్కరూ 40 ఏళ్లు దాటిన తర్వాత సీటీ యాంజియో చేయించుకోవడం ద్వారా గుండె రక్తనాళాల్లోని బ్లాక్‌లను గుర్తించవచ్చు. ∙ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న వారు వయస్సుతో సంబంధం లేకుండా వైద్యుల సూచన మేరకు సీటీ యాంజియో చేయించుకోవాలి ∙ రక్తపోటు, మధుమేహం ఉన్న వారు వాటిని అదుపులో ఉంచుకుంటూ, కొల్రస్టాల్ మందులు రెగ్యులర్‌గా వాడాలి. వ్యక్తిగత జాగ్రత్తలు ∙ వత్తిడిని తగ్గించుకోవాలి. మంచి నిద్రపోవాలి ∙ స్మోకింగ్ అలవాటు ఉంటే మానుకోవాలి ∙ ఆహారపు అలవాట్లను మార్పుకోవాలి ∙ నాన్ వెజ్ వంటకాలు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది ∙ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి మధుమేహమూ కారణమే... మధుమేహం అదుపులో లేని వారు గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది. మెదడు, పాదాలకు రక్త ప్రసరణ సరిగా లేని శరీర తత్వం ఉన్న వారిలో గుండె రక్తప్రసరణలోనూ లోపాలు తలెత్తే అవకాశం ఉంది. అలాంటి వారు గుండె, మధుమేహ పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండటం, క్రమం తప్పకుండా మందులు వాడటం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చు. సమతుల ఆహారం, క్రమం తప్పని వ్యాయామంతో పాటు, అధిక రక్తపోటు, కొలస్ట్రాల్‌లను మెరుగ్గా నియంత్రించుకోవాలి. వాకింగ్‌తో బ్లాక్స్‌కు చెక్ ప్రతిరోజూ 45 నిమిషాల పాటు వాకింగ్ చేయడం ద్వారా రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడకుండా చూడవచ్చునని వైద్యులు చెపుతున్నారు. వాకింగ్ చేసే వారిలో రక్తనాళాల్లోని కొల్రస్టాల్ బ్లాక్స్ పెరిగే అవకాశం ఉండదంటున్నారు. ముఖ్యంగా మధుమేహుల్లో రక్తనాళాలు సన్నబడి రక్త ప్రసరణకు అవరోధం ఏర్పడుతుందని, వాకింగ్ చేస్తే అలాంటి సమస్యలు రావంటున్నారు. మొత్తంగా రోజుకు 45 నిమిషాల చొప్పున వారంలో 5 రోజులు వాకింగ్ చేస్తే రక్తనాళాల్లో బ్లాక్స్ రాకుండా చూడటంతో పాటు, గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గించుకోవచ్చునంటున్నారు. ముందస్తు పరీక్షలతో మేలు 40 ఏళ్లు నిండిన వారు గుండె రక్తనాళాల్లోని బ్లాక్స్‌ను నిర్ధారించేందుకు సీటీ యాంజియో చేయించుకుంటే మంచిది. ఆరోగ్యకర జీవన విధానం, వత్తిళ్లను తగ్గించుకోవడం, ఆహార నియమాలు పాటించడం, రెగ్యులర్‌గా వాకింగ్ చేయడం ద్వారా గుండెపోటు రాకుండా చూసుకోవచ్చు. స్మోకింగ్ చేసే వారిలో, కోవిడ్ ప్రభావం ఉన్న వారిలో చిన్న వయస్సులోనే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. – డాక్టర్ కృష్ణచంద్ కాగిత, కార్డియాలజిస్ట్,సెంటినీ, విజయవాడ -
నొప్పిని పోగొట్టే ‘అయాన్’
‘నొప్పి’ని తగ్గించేందుకు వైద్య శాస్త్రంలో నిరంతరం పరిశోధనలు జరుగుతున్నాయి. అయినా నొప్పికి విరుగుడు కనిపెట్టడంలో ఇంకా పూర్తి విజయాన్ని సాధించలేకపోయారు. కీళ్ల నొప్పి, ఆర్థరైటిస్, గాయాలు... ఇవన్నీ మనిషికి నొప్పి కలిగిస్తాయి. శరీరంలో నొప్పి, సందేశాలను అణచివేసే రసాయనాలు ప్రవేశపెడితే ఈ నొప్పికి విరుగుడుగా ఉంటుంది. శరీరంలో నొప్పికి విరుగుడుగా ‘విద్యుత్ చికిత్స’ ఉత్తమమని పరిశోధకులు గుర్తించారు. శరీరంలోకి బలహీనమైన విద్యుత్‌ను ప్రసారం చేస్తే అది మత్తు మందులా పనిచేసి రోగికి నొప్పి తెలియకుండా చేస్తుంది.నొప్పిని కల్గించే ప్రేరణలను మందగింపచేయడమే గాక మెదడుకు సమచారం వెళ్లకుండా ఈ విద్యుత్ నిరోధిస్తుంది. దీనినే ‘ఎలక్ట్రిక్ స్టిములేషన్’ పద్ధతి అంటారు. మన భారతీయ పరిశోధకుడు ఒకాయన ‘అయాన్ వైద్య చికిత్స’ రూపొందించారు. ఈ చికిత్స వలన అనేక మంది రోగులు నొప్పి నుండి విముక్తి పొందినట్లు ఆయన ప్రకటించారు. అమెరికాలోని వైద్య పరిశోధకులు ఈ ‘అయాన్ వైద్య చికిత్స’ బాగా పనిచేస్తోందని చెప్పారు. మూడవ డిగ్రీ స్థాయి వరకు శరీరం కాలిన రోగులకు విద్యుదావేశం కాబడిన గాలిని తగిలేటట్లు చేస్తే కొంతమేర స్వస్థత చేకూరిందని తెలియ జేశారు. అంటే నొప్పికి విద్యుత్ ఒక ‘బామ్’గా పనికి వస్తుందన్నమాట. విద్యుత్ పరికరాల సహాయంతో ఋణవిద్యుదావేశం గల గాలిని తయారు చేశారు. ఈ గాలిని బాగా పోగుచేసి నొప్పిగల ప్రదేశం మీదకు పంపారు. ఫలితంగా నొప్పి తగ్గినట్లు వారు గుర్తించారు.ఈ అయాన్లు గల గాలి వైద్యంతో కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుం నొప్పులు వంటి వాటిని నయం చేయడానికి ప్రయోగించి మంచి ఫలితాలు సాధించారు. శరీరానికి గాయం అయితే ఆ ప్రాంతంలో నొప్పి ఉంటుంది. ఎందుకంటే అక్కడి జీవకణాలకు విద్యుత్ నిరోధం తక్కువగా ఉంటుంది. ఆ కారణంగా ఆ ప్రాంతంలో ఏర్పడే ద్రవపదార్థాలకు విద్యుత్ వాహకత్వం ఉంటుంది. రష్యాలోని పరిశోధకులు ఈ నిజాలు తెలుసుకుని తక్కువ విద్యుత్ నిరోధం గల జీవకణం పైకి విద్యుత్‌ను ప్రవహింప చేశారు. ఫలితంగా అది తిరిగి విద్యుత్ నిరోధక శక్తిని పుంజుకుంది. ‘ఇదే నొప్పి నివారణకు విద్యుత్ ఉపయోగపడుతున్న తీరు’ అని వివరించారు.చదవండి: డయాబెటిస్ రోగుల కాళ్లకు దెబ్బ తగిలితే ఏం చేయాలి?ఈ చికిత్స వలన నొప్పి తగ్గిన వారిలో మళ్ళీ నొప్పి పునరావృతం కాలేదు. రోగి విద్యుత్ చికిత్స సమయంలో గాని ఆ తరువాత నాలుగు గంటల వరకు గానీ ఎటువంటి లోహపు వస్తువులనూ తాకకూడదు. నీటితో శరీరాన్ని శుభ్రం చేసుకోకూడదు. రబ్బరు తొడుగులు ధరించి రోగి చికిత్స చేయించుకోవాలి. లేకపోతే రోగికి సరఫరా చేసిన విద్యుత్ ఎర్త్ అయిపోతుంది.– డాక్టర్ సి.వి. సర్వేశ్వర శర్మ, పాపులర్ సైన్స్ రచయిత -
3డీ ప్రింట్ ఎముకలు వచ్చేస్తున్నాయ్
సాక్షి, హైదరాబాద్: కింద పడి కాలో, చెయ్యో విరిగిందని ఆసుపత్రికి వెళితే పిండి కట్టు వేయడం చూశాం. దెబ్బవాపు తగ్గిన తరువాత పిండి కట్టు సరిగా సెట్ కాకపోతే ఎముక అటు ఇటుగా వంకరయ్యే సందర్భాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో విరిగిన ఎముకకు రాడ్లు పెట్టి స్క్రూలు బిగిస్తుంటారు. ఇవన్నీ పాత పద్ధతులు. ప్రస్తుతం 3డీ ఎముకలు (3D printing bones) అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఎక్కడైనా ఎముక, కీళ్లు దెబ్బతింటే వాటిని తొలగించి కొత్త అవయవాన్ని రీప్లేస్ చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నారు. మోకీళ్లు, చీలమండ, తుంటి, వెన్నెముక, భుజం ఇలా ఏ స్థానంలోని ఎముక దెబ్బతిన్నా దాన్ని మార్చివేస్తున్నారు. ఫలితంగా చికిత్స అనంతరం రోగి అన్ని కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. 35 ఏళ్ల నుంచే మొదలు సాధారణంగా 35 ఏళ్ల నుంచే మహిళలలో కీళ్ల నొప్పులు మొదలైపోతున్నాయి. వాతావరణ పరిస్థితులు, జీవన విధానాలు దీనికి కారణంగా కనిపిస్తున్నాయి. ఎక్కువ మందిలో కీళ్ల వాతం కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. చేతి వేళ్లు వంగకపోవడం, మోచేయి, మణికట్టు తిప్పినప్పుడు నొప్పి అనిపించడం, తుంటి, మోకాలు, పాదం, భుజం ఇలాంటి భాగాల్లో భరించలేని నొప్పులు వేధిస్తున్నాయి. వీటిని అధిగమిచేందుకు తాజాగా ఏ భాగమైనా డిస్క్ రీప్లేస్మెంట్ (disc replacement) ఆప్షన్ వచ్చేసింది. గతంలో వైద్య పరికరాలు, కృత్రిమ అవయవాలు అమెరికా, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. దీంతో రవాణా, పన్నులు, ఇతరాలు కలిపి వైద్యం భారంగా మారేది. ప్రస్తుతం దేశీయంగా తయారు చేస్తుండటంతో తక్కువ ఖర్చులోనే మెరుగైన వైద్యం సాధ్యమైంది. చికిత్సల అనంతరం సాధారణ జీవితం కొనసాగించవచ్చని వైద్యులు చెబుతున్నారు. గతంలో రూ.2 లక్షలు అయ్యే చికిత్స ప్రస్తుతం సుమారుగా రూ.50 వేల నుంచి రూ.లక్షలో పూర్తవుతుంది. సీటీస్కాన్ సాయంతో.. సహజసిద్ధమైన ఎముక స్థానంలో కృత్రిమంగా తయారు చేసిన అవయవాన్ని నిక్షిప్తం చేయాలంటే ఎంతో కచ్చితత్వం అవసరం. అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ముందుగా బాధితుడి ఎముక, కీళ్లు దెబ్బతిన్న ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. సిటీ స్కాన్ సాయంతో ఎంత మేరకు ఎముకను తొలగించాల్సి ఉంటుందనేది లెక్కిస్తారు. దీని ఆధారంగా 3డీ ప్రింటెడ్ టైటానియంతో తయారు చేసిన కృత్రిమ అవయవాన్ని ఆ స్థానంలో అమరుస్తారు. ఈ పరికరం వల్ల ఎంఆర్ఐ వంటి స్కానింగ్‌ల సందర్భంలోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని వైద్యులు చెబుతున్నారు.చదవండి: స్కూళ్లలో షుగర్ బోర్డులు.. ఎందుకో తెలుసా? సాధారణ ప్రజలకు అందుబాటులో.. చికిత్స విధానాల్లో టెక్నాలజీ మారుతోంది. బోన్ ఫ్యాక్చర్ అయితే కట్టు కట్టేవాళ్లు. ఎముక అతుక్కోవడానికి కొంత సమయం పడుతుంది. ఈలోగా శరీరం వాపు తగ్గిపోవడంతో కట్టిన కట్టు లూజ్ అవుతుంది. కొన్ని దఫాలు ఎముకలు వంకర్లు తిరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం విరిగిపోయిన, దెబ్బతిన్న, కుల్లిన ఎముకలు, కీళ్లను అవసరాల మేరకు ప్లేట్స్ స్క్రూ బిగించడం, 3డి ప్రింటెడ్ అవయవాలను మారుస్తున్నాం. డిస్క్ రీ ప్లేస్మెంట్ ఆప్సన్ వచ్చేసింది. టైటానియం వినియోగిస్తున్నాం. దీంతో సిటీస్కాన్, ఎమ్మారై చేసినా ఇబ్బంది ఉండదు. సాధారణ ప్రజలకు సైతం అందుబాటులో ఉండే ధరల్లోనే చికిత్సలు పూర్తవుతున్నాయి. – డా.సునీల్ దాచేపల్లి, ఆర్థోపెడిక్, రోబోటిక్ సర్జన్ -
ప్లాస్టిక్ సర్జరీలలో భద్రత ముఖ్యం.. ఉన్న అందం చెడకుండా
హైదరాబాద్: సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా, వైద్యశాస్త్రంలో సరికొత్త మార్పులు వస్తున్నా ఇప్పటికీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్, లేజర్ చికిత్సలు, ముఖానికి సంబంధించిన మార్పుల కోసం చేయించుకునే శస్త్రచికిత్సల విషయంలో చాలామంది వెనకడుగు వేస్తున్నారు. దానికి ప్రధాన కారణం.. చేయించుకుంటే ఏమైనా అవుతుందేమోనన్న భయం. రోగుల్లో ఈ భయం రావడానికి కూడా కారణాలు లేకపోలేవు. కొన్నిసార్లు ఈ తరహా చికిత్సల వల్ల కొంతమందికి ఇన్ఫెక్షన్లు రావడం, రకరకాల సమస్యలు తలెత్తడం లాంటివి ఉంటున్నాయి. కుప్పలు తెప్పలుగా నకిలీ వైద్యులు పుట్టుకురావడం, ఉన్నవారిలో కొందరికి నైపుణ్యాలు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలని వక్తలు పేర్కొన్నారు. రోగులకు ఈస్థటిక్ చికిత్సలు, కాస్మొటిక్ శస్త్రచికిత్సలు, ప్లాస్టిక్ సర్జరీలు అత్యంత సురక్షితంగా చేయడం ఎలాగన్న విషయాన్ని తెలియజేయడమే ప్రధాన ఉద్దేశంగా నగరంలోని టి-హబ్ వేదికగా రెండురోజుల పాటు నిర్వహించే సేఫ్ ప్లాస్ట్-2025 సదస్సు శనివారం ఘనంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన 120 మందికి పైగా ప్లాస్టిక్ సర్జన్లు, డెర్మటాలజిస్టులతో పాటు విదేశాల నుంచి ఆన్లైన్లో కూడా కొందరు పాల్గొన్న ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి 25 మంది సీనియర్ ప్లాస్టిక్ సర్జన్లు వివిధ అంశాలపై మాట్లాడి అవగాహన కల్పించారు.ఈ సదస్సులో దుబాయ్‌కి చెందిన ప్రముఖ సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సంజయ్ పరాశర్ మాట్లాడుతూ, ‘‘ప్లాస్టిక్, ఈస్థటిక్ సర్జరీలు చాలా సంక్లిష్టమైనవి. కొన్ని సందర్భాల్లో మనం నూటికి నూరుశాతం కృషిచేసినా, ఫలితాలు మాత్రం అలా ఉండకపోవచ్చు. మరికొన్నిసార్లు అనుకోని అవాంతరాలు ఎదురవు తుంటాయి. అలా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించు కోవాలో తెలియడం ముఖ్యం. అలాగే అసలు సమస్యకు కారణం ఏంటన్నది కూడా గుర్తించాలి. అసలు ప్రక్రియ ఎలా చేయాలన్నది తగినంత శిక్షణ లేకుండా కేవలం పుస్తకాలు చూసి చేసేయడం కూడా సరికాదు. పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన తర్వాత చేస్తే మాత్రమే రోగులకు అత్యంత సురక్షితంగా చికిత్స చేయగలం. మిగిలిన విభాగాలలో చేసే చికిత్సలు వేరు, ప్లాస్టిక్ సర్జన్లు, డెర్మటాలజిస్టులు చేసే చికిత్సలు వేరు. కాస్త అందంగా కనపడాలని, ఉన్న లోపాన్ని సరిచేయించుకోవాలని వచ్చేవాళ్లకు మనం పూర్తి సంతృప్తి ఇవ్వగలగాలి. అంతే తప్ప ఉన్నదాన్ని కూడా మరికొంత చెడగొడితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. చికిత్స చేసిన తర్వాత ఏదో ఒక కారణంతో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అవి రాకుండా చూసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా లైపోసక్షన్, కాస్మొటిక్ శస్త్రచికిత్సలు, ముఖం మీద వివిధ భాగాలు అంటే ముక్కు, గడ్డం, బుగ్గలు.. ఇలాంటివి సరిచేయించుకునే చికిత్సలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ లాంటివి చాలా సున్నితమైనవి. వీటి విషయంలో ఇప్పుడు చెప్పిన విషయాలన్నింటినీ జాగ్రత్తగా గమనించుకుని రోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని చెప్పారు.పెర్సానిక్స్ కాస్మొటిక్స్, ప్లాస్టిక్ సర్జరీ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గురుకర్ణ వేముల మాట్లాడుతూ, ‘‘అసలు ఈ చికిత్సలు చేయించుకోవడానికి ఎవరి వద్దకు వెళ్లాలనేది రోగులు ముందుగా నిర్ణయించుకోవాలి. అందుకోసం వాళ్ల ప్రొఫైల్, వెబ్సైట్లు, రాష్ట్ర స్థాయిలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లాంటివాటిలో రిజిస్ట్రేషన్లు అన్నీ చూసుకోవాలి. వైద్యుల డిగ్రీల గురించి తెలుసుకోవాలి. ఎంబీబీఎస్, ఎండీ, ఎంసీహెచ్ లాంటివి అన్నీ మంచి డిగ్రీలు. అవికాకుండా ఎఫ్ఐఎస్ఎస్, ఇలాంటి ఏవేవో పేర్లతో ఉండే ఫెలోషిప్‌లు ఉన్నాయంటే మాత్రం కొంత అనుమానించాలి. తగిన శిక్షణ లేని వాళ్లు ఇలాంటి చికిత్సలు చేయడం వల్ల పలురకాల సమస్యలు వస్తున్నాయి. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నప్పుడు కొంతమందికి తలమీద ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. అలాగే బొటాక్స్, ఫిల్లర్లు, లేజర్ చికిత్సల వల్ల కూడా కొన్ని దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయి. ఇవన్నీ లేకుండా ఉండాలంటే.. రోగులు ముందుగా తగిన వైద్యుడిని ఎంచుకోవడం ముఖ్యం. అలాగే, ఈస్థటిక్ సర్జరీల గురించి మన దేశంలో ఇంకా శిక్షణ మెరుగుపడాలి. శిక్షణ కార్యక్రమాలు పెంచాలి. బొటాక్స్, ఫిల్లర్స్, లేజర్స్, హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ లాంటి చికిత్సలను అత్యంత సురక్షితంగా చేయాలి. ప్లాస్టిక్ సర్జరీ చేసేటప్పుడు అనుక్షణం అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఇది కేవలం అందాన్ని మెరుగుపరిచేది మాత్రమే కాదు.. అనేక సందర్భాలలో ప్రాణాలను సైతం రక్షిస్తుంది. ఇక్కడ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి, అలాగే విదేశాల నుంచి వచ్చిన సీనియర్లు చెబుతున్న విషయాలేవీ వైద్య పుస్తకాల్లో ఉండవు. వీటిని కేవలం వారి అనుభవాల ద్వారానే తెలుసుకోవాలి. ఈ రంగంలో ఉన్న అత్యుత్తమ వైద్య నిపుణులు తమ అనుభవాలను పాఠాలుగా చెబుతున్నందున వీటినుంచి నేర్చుకుంటే ప్లాస్టిక్ సర్జన్లు, డెర్మటాలజిస్టులు తమ వృత్తి జీవితంలో రాణించగలరు’’ అని తెలిపారు. -
కేన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?
సాక్షి ప్రతినిధి, వరంగల్: విస్తృతంగా విస్తరిస్తున్న కేన్సర్ మహమ్మారి ప్రజలు, ప్రభుత్వాలకు సవాల్ విసురుతోంది. వేగంగా ప్రబలుతున్న ఈ వ్యాధి దేశాన్నే కలవరపెడుతోంది. చాపకింద నీరులా అయిదేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఎగబాకింది. అధికారిక గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 5 ఏళ్లలో కేన్సర్ కేసుల సగటు పెరుగుదల 11.55 శాతంగా ఉంది. ఏపీలో 9 శాతం, తెలంగాణలో 10 శాతం చొప్పున కేసులు పెరిగాయి. మృతుల సంఖ్య కూడా దేశవ్యాప్తంగా లక్షల్లోనే ఉంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 41 శాతం రొమ్ము, గర్భాశయ ముఖద్వార, రక్త, నోటి కేన్సర్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు / యూటీలలో కేన్సర్ పరిస్థితిపై ఇటీవలి భారతీయ ప్రజారోగ్య సంస్థ (ఐఐపీహెచ్) నివేదికపై ఏప్రిల్ 1న పార్లమెంట్‌కు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపిన ఈ వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కాగా కేన్సర్ ఇదే విధంగా కొనసాగితే.. జనాభాలో మార్పుల కారణంగా 2040 నాటికి కేసులు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని నిపుణులు, నివేదికలు హెచ్చరిస్తున్నాయి.మొదటి స్థానాల్లో యూపీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ ఏడాది ఏప్రిల్ 1న పార్లమెంట్లో.. మూడేళ్లలో విస్తరించిన కేన్సర్ కేసులపై రాష్ట్రాల వారీగా నివేదిక సమర్పించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 2022లో 14,61,427 కేసులు నమోదైతే, 2023 నాటికి 14,96,972కు పెరిగాయి. 2024 వచ్చేసరికి కేసుల సంఖ్య 15,33,055 గా నమోదైంది. కాగా రాష్ట్రాల వారీగా చూస్తే 2022, 2023, 2024లలో మూడేళ్లపాటు వరుసగా 2,10,958, 2,15,931, 2,21,000 కేసులతో.. దేశంలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో 1,21,717, 1,24,584, 1,27,512లతో మహారాష్ట్ర, ఆ తర్వాత స్థానంలో పశ్చిమ బెంగాల్లో 1,13,581, 1,16,230, 1,18,910 కేన్సర్ కేసులు పెరిగాయి. 4, 5, 6, 7 స్థానాల్లో బిహార్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ ఉన్నాయి.కేన్సర్ వ్యాప్తికి ఇవే కారణాలు90–95 శాతం కేన్సర్లు జీవనశైలి, పర్యావరణ కారకాల వల్ల వస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ధూమపానం, మద్యపానం, పాన్, గుట్కా వంటివి నమలడం, ఊబకాయం, మానసిక ఒత్తిడి, మర్మావయవాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు కేన్సర్‌కు కారకాలుగా చెబుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పౌష్టికాహారం లోపించడం, 18 ఏళ్లలోపే పెళ్లి కావడం, పిల్లలు పుట్టడం, ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, 35 ఏళ్లు దాటాక గర్భధారణ, బిడ్డకు తల్లిపాలు పట్టకపోవడం, తక్కువ పండ్లు, కూరగాయల వినియోగం కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని అంటున్నారు. వ్యవసాయంలో రసాయనాల వాడకం కూడా కేన్సర్ వ్యాప్తికి ఒక కారణం కావచ్చని నివేదికలు చెబుతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లోనూ అధికమే..కేన్సర్ కేసుల ఉధృతి తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కువగానే ఉంది. దేశవ్యాప్తంగా చూస్తే.. ఆంధ్రప్రదేశ్ 8, తెలంగాణ 11 స్థానాల్లో ఉన్నాయి. ఏపీలో 2022లో 73,536 కేసులు ఉండగా, 2023లో 75,086, 2024లో 76,708గా, తెలంగాణలో మూడేళ్లలో 49,983, 51,145, 52,334ల కేసులు నమోదయ్యాయి. కాగా తెలంగాణలోని హైదరాబాద్‌లో రొమ్ము కేన్సర్ (Breast Cancer) కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, పొగాకు, మద్యపానం, ఆహారపుటలవాట్లు, వ్యవసాయంలో రసాయనాల వాడకం వంటివి వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి.చదవండి: ఔషధ మొక్క.. ఆరోగ్యానికి రక్ష ఉమ్మడి వరంగల్‌కు వస్తే పురుషుల్లో ఊపిరితిత్తులు, శ్వాసనాళం, తల, గొంతు, బోన్, రక్త (లుకేమియా), ప్రోస్టేట్ కేన్సర్లు ఎక్కువగా ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అత్యల్పంగా 28, 31, 32 కేసుల చొప్పున వరుసగా మూడేళ్లలో లక్షద్వీప్‌లో, డామన్‌లో 150 నుంచి 173, దాద్రా నగర్ హవేలీలో 238ల నుంచి 268లు, లద్దాఖ్‌లో 302 నుంచి 318కు కేన్సర్ కేసులను గుర్తించారు.స్క్రీనింగ్ టెస్టులకు ముందుకు రావాలి..కేన్సర్‌ను గుర్తించేందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించింది. జిల్లాల్లో 18 ఏళ్లు నిండిన వారికి ఉచితంగా స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో ఏడాదిలో 600కు పైగా కేన్సర్ కేసులున్నాయి. వీరిలో 102కు పైగా నోటి కేన్సర్‌తో బాధపడుతున్న వారే.. గుట్కా, పొగాకు వల్ల నోటి కేన్సర్, ధూమపానం వల్ల ఊపిరితిత్తుల కేన్సర్ వస్తున్నాయి. నలభయ్యేళ్లు దాటిన స్త్రీలు రొమ్ము కేన్సర్ రాకుండా ఆరు నెలలకోసారి కేన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. – ఎ.అప్పయ్య, డీఎంహెచ్‌వో, హనుమకొండ జిల్లా -
నవజాత శిశువుల్లో హైపోగ్లైసీమియా
సాక్షి, విశాఖపట్నం: నవజాత శిశువుల్లో చక్కెర స్థాయిలు తగ్గుతుండటం ఆందోళన కలిగించే విషయమని ఈశాన్య రాష్ట్రాల ఎండోక్రైన్ సొసైటీ ఈసీ మెంబర్, వైద్య పరిశోధకురాలు డాక్టర్ అభామోనీ బారో అగర్వాల్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు జన్మిస్తున్న వారిలో 25 శాతం మంది ఈ హైపోగ్లైసీమియా వ్యాధి బారిన పడుతున్నారని వెల్లడించారు. శిశువుల్లో 72 గంటల్లో సాధారణ స్థాయిలకు చక్కెర నిల్వలు తీసుకురాకపోతే ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. ఎండోక్రైన్ జాతీయ వైద్య సదస్సులో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన సందర్భంగా డాక్టర్ బారో అగర్వాల్ ‘సాక్షి’తో మాట్లాడారు. శిశువుల్లో హైపోగ్లైసీమియా లక్షణాలు, వ్యాధిని గుర్తించడం, చికిత్స పద్ధతులు, నిర్లక్ష్యం చేస్తే వచ్చే ఇబ్బందుల గురించి వివరించారు.హైపోగ్లైసీమియా ఎందుకు వస్తుందంటే...రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయి చాలా తక్కువగా ఉన్నప్పుడు హైపోగ్లైసీమియా అని పిలుస్తారు. మెదడు, శరీరానికి ఇంధనంలా పనిచేసే ప్రధాన వనరు గ్లూకోజ్. నవజాత శిశువుల్లో అనేక కారణాల వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. ఇది శిశువుల్లో వణుకు, చర్మం నీలంగా మారిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను కలిగిస్తుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో తల్లికి సరైన పోషకాహారం అందకపోవడం, గర్భిణుల్లో మధుమేహం సరిగా నియంత్రించకపోవడం వల్ల ఎక్కువగా ఇది సంక్రమిస్తుంటుంది.నెలలు నిండకుండా పుట్టినవారికి, తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు, వివిధ కారణాల వల్ల మందులు ఎక్కువగా వాడిన గర్భిణులకు పుట్టిన పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా బయటపడుతుంది. ప్యాంక్రియాస్ కణితి వంటి ఇతర కారణాల వల్ల శిశువు మలం ద్వారా ఎక్కువ ఇన్సులిన్ బయటికిపోతుంది. ఇది కూడా ఓ కారణమేనని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రోజూ జన్మిస్తున్న వారిలో 25 శాతం మంది శిశువులు హైపోగ్లైసీమియా బారిన పడుతున్నారు. మన దేశంలో ప్రతి 100 మంది నవజాత శిశువుల్లో 76 మందికి ఈ వ్యాధి నిర్ధారణ అవుతోంది.గర్భిణులే జాగ్రత్త వహించాలిబిడ్డ కడుపులో పడినప్పటి నుంచి గర్భిణులు అత్యంత జాగ్రత్తగా నడచుకోవాలి. అప్పుడే ఈ తరహా వ్యాధులు చిన్నారుల దరికి చేరవు. ముఖ్యంగా పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వ్యాయామం చేస్తూ ఒత్తిడి లేని జీవితం గడపాలి. చక్కెర స్థాయిలు సక్రమంగా ఉండేటట్లుగా ఆహారపు అలవాట్లలోనూ మార్పులు చేసుకోవాలి.ముందుగా గుర్తిస్తే మేలుశిశువుల్లో హైపోగ్లైసీమియాను గుర్తించేందుకు రక్తంలో గ్లూకోజ్ స్థాయిల కోసం సాధారణ రక్త పరీక్షలు చేస్తే సరిపోతుంది. ఒకవేళ శిశువుల్లో ఈ సమస్య ఉంటే వెంటనే దానిపై దృష్టిసారించాలి. పుట్టినప్పుడు తల్లి పాలు తాగిన తర్వాత 4 గంటల్లోపు గ్లూకోజ్ రీడింగ్ నమోదు చేయాలి. చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటే వైద్యం అందించాలి.తర్వాత 24 గంటల్లోపు చెక్ చేసుకోవాలి. అలా ప్రతి 12 నుంచి 24 గంటలకు ఒకసారి పర్యవేక్షిస్తూ 72 గంటల్లోగా సాధారణ స్థాయికి తీసుకురావాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే.. పిల్లలు పెరిగే కొద్దీ ప్రమాదకరంగా మారుతుంది. దేశంలో కేవలం 55 శాతం మంది నవజాత శిశువుల్లో మాత్రమే ముందుగా ఈ వ్యాధిని గుర్తిస్తున్నారు. వీరికే సకాలంలో వైద్యం అందుతోంది. 45 శాతం మందికి ఆలస్యంగా గుర్తిస్తున్నారు. దీనివల్ల ఆ చిన్నారులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.అందుబాటులో అత్యుత్తమ వైద్యసేవలుఈ వ్యాధి బారిన పడిన శిశువులను 72 గంటల్లో ఆరోగ్యవంతులుగా మార్చేందుకు అనేక అత్యుత్తమ వైద్య సేవలు అందబాటులోకి వచ్చాయి. పుట్టిన శిశువు బరువు, నెలలు నిండాయా... లేదా..? ఇలా ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి వైద్యం అందిస్తుండాలి. అప్పుడే చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి వచ్చి.. శిశువు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారుతాడు. గ్లూకోజ్ లెవెల్స్ మరీ దారుణంగా ఉన్న శిశువులకు 40శాతం డెక్ట్స్ట్రోస్ (చక్కెరలాంటి ఒక రూపం) జెల్‌ను నేరుగా నోటికి పూస్తారు. ఇలా వెద్య విధానాలు అందుబాటులోకి రావడం వల్లే చిన్నారుల ప్రాణాలు నిలబడుతున్నాయి. చిన్న వ్యాధే కదా.. అని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. -
'హాడ్జికిన్స్ లింఫోమా' ను అర్థం చేసుకుని.. సరైన చికిత్సనందించటం ఎలా?
సాక్షి : బ్లడ్ క్యాన్సర్‌కు సంబంధించి ఒక నిర్దిష్టమైన ఉపరకం, హాడ్జికిన్స్ లింఫోమా. ఇది రోగనిరోధక వ్యవస్థ యొక్క లింఫాటిక్ డివిజన్ ( శోషరస విభాగం) ని ప్రభావితం చేస్తుంది మరియు తెల్ల రక్తకణాల అసాధారణ పెరుగుదలకు దారితీస్తుంది. ఈ కారణం చేత శరీరంలోని వివిధ ప్రాంతాలలో శోషరస కణుపులు (లింప్ నోడ్స్) పెద్దవిగా మారడం మరియు కణితులు ఏర్పడటం జరగవచ్చు. ఇది అరుదైన మరియు తీవ్రమైన పరిస్థితి అయినప్పటికీ, సత్వర గుర్తింపు మరియు చికిత్సతో విజయవంతంగా కోలుకోవడం సాధ్యమవుతుంది. అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ లో సీనియర్ కన్సల్టెంట్ హెమటో-ఆంకాలజిస్ట్ & బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్ గా సేవలనందిస్తున్న డాక్టర్ అనిల్ అరిబండి ఈ జబ్బు గురించి మాట్లాడుతూ.. "2020 సంవత్సరంలో, భారతదేశంలో దాదాపు 11,230 కొత్త హాడ్జికిన్స్ లింఫోమా కేసులు నమోదయ్యాయి. ఈ జబ్బు మగవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా 20- 39 సంవత్సరాల మధ్య మరియు 65 ఏళ్లు పైబడిన వారిపై అధిక ప్రభావం చూపుతుంది. అయినప్పటికీ, వంశపారంపర్యంగా ఈ సమస్య వున్నవారు మరింత ఎక్కువగా ప్రమాదంలో పడే అవకాశాలున్నాయి. HIV/AIDS మరియు ఎప్స్టీన్-బార్ వైరస్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు దీని తీవ్రతను మరింతగా వృద్ధి చేసే ప్రమాదం ఉంది" అని అన్నారు. వ్యాధి లక్షణాలు.. రోగ నిర్ధారణ.. హాడ్జికిన్స్ లింఫోమా యొక్క ప్రారంభ సంకేతాలు చాలా సూక్ష్మంగా ఉండవచ్చు. సాధారణంగా మెడ, చంకలు లేదా గజ్జలువంటి ప్రాంతాల్లో నొప్పి లేకుండా లింప్ నోడ్స్ పెద్దగా ఉన్నట్లు కనిపిస్తాయి. ఇతర లక్షణాలలో తరచుగా జ్వరం రావటం, దీర్ఘకాలిక అలసట, తీవ్రమైన దురద మరియు రాత్రి సమయంలో అధిక చెమటలు పట్టడం వంటివి కనిపిస్తాయి. ఈ సంకేతాలను సాధారణంగా ఇతర ఆరోగ్య సమస్యగా తప్పుగా భావించవచ్చు. కచ్చితమైన రోగ నిర్ధారణ మరియు సకాలంలో చికిత్స కోసం వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. హాడ్జికిన్స్ లింఫోమా ను గుర్తించే విధానం గురించి అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ లో సీనియర్ కన్సల్టెంట్ హెమటో-ఆంకాలజిస్ట్ & బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ అనిల్ అరిబండి చెబుతూ "హాడ్జికిన్స్ లింఫోమాను గుర్తించడానికి, ప్రాథమిక దశలో శారీరక పరీక్ష చేసి, లింప్ నోడ్స్ వాపు జరిగిందా లేదా అన్నది నిర్ణయించడం చేస్తారు. హాడ్జికిన్స్ లింఫోమా యొక్క సంభావ్యతను గుర్తించడానికి CBC (కంప్లీట్ బ్లడ్ పిక్చర్) చేసి హాడ్జికిన్స్ లింఫోమా కనుగొనే ప్రయత్నం చేస్తారు. దీనిని మరింతగా ధృవీకరించడానికి, వైద్యులు PET స్కాన్, CT స్కాన్ మరియు Tissue biopsy కూడా సిఫారసు చేయవచ్చు. రోగనిర్ధారణ జరిగిన తర్వాత, వైద్యులు వ్యాధిని స్టేజ్ I నుండి IV వరకు విభజించి, తగిన చికిత్సను అందిస్తారు " అని అన్నారు. చికిత్స అవకాశాలు: ► కీమోథెరపీ: క్యాన్సర్ కణాలను నాశనం చేసే ఒకే ఔషదాన్ని నేరుగాగానీ, పలు ఔషదాల మిశ్రమంను నోటి ద్వారాగానీ, నరాల ద్వారా శరీరంలోకి ఇస్తారు. ► రేడియేషన్ థెరపీ: క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకోవడానికి, అలగే నాశనం చేయడానికి అధిక-తీవ్రత కలిగిన కిరణాలు ఉపయోగించబడతాయి. ► టార్గెటెడ్ థెరపీ: ఈ ప్రత్యేక చికిత్స నిర్దిష్ట క్యాన్సర్ కణాలపై దృష్టి పెడుతూ.. తొలగిస్తుంది. ► ఇమ్మ్యూనో థెరపీ: ఈ పద్ధతి శరీరం యొక్క సహజమైన రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, సాధారణంగా చెక్‌పాయింట్ ఇన్హిబిటర్ల వినియోగం ద్వారా ఇది చేస్తారు. ► బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్: రోగి, దాత నుండి మూలకణాలను ఉపయోగించి, ఈ ప్రక్రియలో ప్రభావితమైన ఎముక మజ్జ (బోన్ మారో)ను రక్తం, రోగనిరోధక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడానికి ఆరోగ్యకరమైన మూలకణాలతో భర్తీ చేస్తారు. స్థిరమైన జీవనశైలి మార్పులు.. హాడ్జికిన్స్ లింఫోమా ఉన్న రోగులు గుర్తించవలసినది ఏమిటంటే, తమ రోజువారీ అలవాట్లలో మార్పులు చేసుకోవటం చికిత్స ఫలితాల పరంగా ప్రధానంగా మార్పు తీసుకువస్తుందని. ఆహార ప్రాధాన్యతలు, వ్యాధి మధ్య ప్రత్యక్ష సంబంధం లేనప్పటికీ, ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలోపేతమవుతుంది. హాడ్జికిన్స్ లింఫోమా చికిత్స చేయగలదని పరిగణనలోకి తీసుకుంటే, ముందుగా గుర్తించడం.. సత్వర చికిత్స వైద్య ఫలితాలను, రోగుల జీవన నాణ్యతను బాగా మెరుగుపరుస్తుందని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ లో సీనియర్ కన్సల్టెంట్ హెమటో-ఆంకాలజిస్ట్ & బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ అనిల్ అరిబండి వెల్లడించారు. డాక్టర్ అనిల్ అరిబండి, సీనియర్ కన్సల్టెంట్ హెమటో - ఆంకాలజిస్ట్ & బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్, అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్. -
బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా? నిజమేనా?
కిడ్నీలో రాళ్లు ఏర్పడే కేసులు దేశంలో రోజురోజుకు పెరుగుతున్నాయి. కిడ్నీ పనితీరు, కిడ్నీ రోగాల బారినపడితే ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి చాలా మందికి సరైన అవగాహన లేకపోవడం వల్లే ఈ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచ కిడ్నీ దినోత్సవం(మార్చి 9) సందర్భంగా ప్రిస్టిన్ హెల్త్ కేర్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయని ప్రతి ముగ్గురిలో ఒకరు నమ్ముతున్నట్లు ఈ సర్వేలో తేలింది. అయితే ఇందులో అసలు వాస్తవం లేదని, కేవలం కల్పితమేనని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అలాగే కిడ్నీలో రాళ్ల సమస్య చికిత్సను 50 శాతం మంది కావాలనే 6 నెలలు ఆలస్యం చేస్తున్నారు. దాన్ని కాస్తా రెండేళ్లకు పొడిగిస్తున్నారు. కిడ్నీ రోగాలకు సంబంధించి అధికారికంగా జాతీయ గణాంకాలు లేకపోయినప్పటికీ కేసుల్లో గణనీయ పెరుగుదల కన్పిస్తున్నట్లు లైబ్రేట్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ డేటా స్పష్టం చేసింది. దీని ప్రకారం 2021తో పోల్చితే 2022 కిడ్నీ రోగాలకు సంబంధించి డాక్టర్ అపాయింట్మెంట్లు ఏకంగా 180 శాతం పెరిగాయి. వీరిలో ఎక్కువమందికి కిడ్నీలో రాళ్ల సమస్యే ఉంది. ఈ సమస్యతో బాధపడుతున్న వారిలో మహిళలతో పోల్చితే పురుషులే మూడు రెట్లు అధికంగా ఉన్నారు. కిడ్నీలో రాళ్ల సమస్య వల్ల ప్రధానంగా ఊబకాయం, హైపర్ టెన్షన్ వంటి సమస్యల బారినపడే ముప్పు ఉంటుంది. అయితే ఈ విషయం బాధితుల్లో 14 శాతం మందికే తెలుసు. యూరిన్ కిడ్నీ నుంచే ఉత్పత్తి అవుతుందన్న విషయం సర్వేలో పాల్గొన్న 50 శాతం మందికిపైగా తెలియదు. కిడ్నీలు కూడా ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తాయని 9 శాతం మందికి మాత్రమే తెలుసు. ఎముకల ఆరోగ్యానికి కిడ్నీనే కీలకమని 7 శాతం మందికే తెలుసు. ఫిట్నెస్, బాడీ బిల్డింగ్‌కు పాపులారిటీ పెరుగుతున్న కారణంగా చాలా మంది తమ డైట్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు. అయితే ప్రోటీన్ సప్లిమెంట్ల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడుతాయని 50 శాతం మంది విశ్వసిస్తున్నారు. కానీ ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కిడ్నీ ఆరోగ్యంపై చాలా మందికి కనీస అవగాహన లేదని సర్వే స్పష్టం చేసింది. కిడ్నీలో రాళ్లను తొలగించే సర్జరీ సేఫ్ అని సర్వేలో పాల్గొన్న 68శాతం మంది నమ్ముతున్నారు. అయినా 50 శాతం మంది కావాలనే చికిత్సను 6 నెలల పాటు ఆలస్యం చేస్తున్నారు. కిడ్నీ సమస్యలను గుర్తించిన వెంటనే చికిత్స తీసుకుంటే అవి మరింత పాడవకుండా నివారించవచ్చని డాక్టర్ వైభవ్ కపూర్(ప్రిస్టిన్ కేర్ సహవ్యవస్థాపకులు) సూచిస్తున్నారు. చదవండి: ఇది ఎక్కువగా తినడం వల్లే గుండెపోట్లు, అకాల మరణాలు..! -
WHO: ఇది ఎక్కువగా తినడం వల్లే గుండెపోట్లు, అకాల మరణాలు..!
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) రూపొందించిన నివేదికలో షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. ఆహారంలో సోడియం(ఉప్పు) మోతాదును ఎక్కువగా తీసుకోవడం వల్లే ప్రపంచవ్యాప్తంగా మరణాలు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా నమోదవుతున్నట్లు తేలింది. సోడియంను తగ్గించాల్సిన అవసరంపై డబ్ల్యూహెచ్ఓ తొలిసారి ఈ నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా సోడియం వినియోగాన్ని 2025 నాటికి 30 శాతం తగ్గించాలనే లక్ష్యం దారితప్పిందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో సోడియం ఒకటి. కానీ దాన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే గుండె జబ్బులు, స్ట్రోక్స్, అకాల మరణాల ముప్పు అధికమవుతుంది. ఒక్క టేబుల్ స్పూన్ ఉప్పులో సోడియం(సోడియం క్లోరైడ్) ప్రధానంగా లభిస్తుంది. అలాగే వంటల్లో వేసే మసాల్లాలో కూడా ఈ పోషకం ఎక్కువగానే ఉంటుంది. డబ్లూహెచ్ఓ గ్లోబల్ నివేదిక ప్రకారం తక్కువ ఖర్చుతో కూడిన సోడియం తగ్గింపు విధానాలను సరిగ్గా అమలు చేస్తే 2030 నాటికి ప్రపంచంలో 70 లక్షల మంది జీవితాలను కాపాడవచ్చు. అయితే ప్రస్తుతానికి కేవలం తొమ్మిది దేశాలు - బ్రెజిల్, చిలీ, చెక్ రిపబ్లిక్, లిథువేనియా, మలేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, స్పెయిన్, ఉరుగ్వే మాత్రమే సోడియం తీసుకోవడం తగ్గించడానికి డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసిన పాలసీలను అమలు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సగటున రోజుకు 10.8 గ్రాముల ఉప్పును తీసుకుంటున్నారు. డబ్ల్యూహెచ్ఓ ప్రతిపాదించిన 5 గ్రాములతో పోల్చితే ఇది రెండింతల కంటే ఎక్కువే కావడం గమనార్హం. దీంతో ప్రపంచవ్యాప్తంగా మరణాలకు అన్‌హెల్దీ డైట్లే కారణమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. సోడియం మోతాదును ఎక్కువగా తీసుకోవడం వల్లే ఇలా జరుగుతున్నట్లు స్పష్టం చేశారు. చాలా దేశాలు సోడియం తగ్గింపు విధానాలను అనుసరించలేదని ఈ నివేదిక తేటతెల్లం చేసింది. దీని వల్ల ఆయా దేశాల ప్రజలు గుండెపోటు, పక్షవాతం, ఇతర ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. సోడియం వినియోగాన్ని తగ్గించేందుకు 'బెస్ట్ బైస్(Best Buys)'ని అమలు చేయాలని డబ్ల్యూహెచ్ఓ అన్ని దేశాలకు సూచించింది. ఆహారంలో సోడియం కంటెంట్‌పై తమ బెంచ్‌మార్క్‌లను అమలు చేయాలని తయారీదారులకు పిలుపునిచ్చింది. సోడియం వినియోగాన్ని తగ్గించేందుకు డబ్ల్యూహెచ్ఓ చేస్తున్న నాలుగు బెస్ట్ బై ప్రతిపాదనలు 1. తక్కువ ఉప్పు ఉండేలా ఆహార పదార్థాలను సంస్కరించాలి. భోజనంలో సోడియం పరిమాణానికి లక్ష్యాలను నిర్దేశించాలి. 2. ఆసుపత్రులు, పాఠశాలలు, కార్యాలయాలు, నర్సింగ్‌హోమ్‌లు వంటి ప్రభుత్వ సంస్థలలో ఉప్పు లేదా సోడియం అధికంగా ఉండే ఆహారాన్ని పరిమితం చేయడానికి ప్రభుత్వ ఆహార సేకరణ విధానాలను రూపొందించాలి. 3. సోడియం తక్కువగా ఉన్న ఉత్పత్తులను ఎంచుకోవడానికి వినియోగదారులకు సహాయపడే ఫ్రంట్-ఆఫ్-ప్యాకేజీ లేబులింగ్ తీసుకురావాలి. 4. ఉప్పు/సోడియం వినియోగాన్ని తగ్గించడానికి మీడియా ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఊబకాయం, బోలు ఎముకల వ్యాధి, కిడ్నీ వ్యాధి వంటి ఇతర అనారోగ్య సమసల్య బారినపడే ప్రమాదం ఉందని కూడా నివేదిక బహిర్గతం చేసింది. చదవండి: విమానంలో బుల్లెట్ల కలకలం.. 218 మంది ప్యాసింజర్లలో టెన్షన్ టెన్షన్.. టేకాఫ్ క్యాన్సిల్ -
కో–ఇన్ఫెక్షన్స్.. ఏకకాలంలో అనేక జ్వరాలు..!
ఇటీవలి కాలంలో ప్రతి ఇంటా ఎవరో ఒకరు జ్వరంతో బాధపడటం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈమధ్యకాలంలో వరసగా వర్షాలు అందరినీ బెంబేలెత్తించాయి. నిన్న మొన్నటి కరోనా కాలం తర్వాత... అదే సంఖ్యలో మూకుమ్మడి జ్వరాలు ఇటీవల నమోదయ్యాయి. అయితే ఇప్పటి జ్వరాల్లో ఓ ప్రత్యేకత ఉందంటున్నారు వైద్య నిపుణులు. కొందరిలో ఒకే సమయంలో రెండు రకాల జ్వరాలు నమోదవ్వడం ఇటీవల నమోదైన ధోరణి. ఇలా ఒకే సమయంలో అనేక ఇన్ఫెక్షన్లు రావడాన్ని వైద్యనిపుణులు తమ పరిభాషలో ‘కో–ఇన్ఫెక్షన్స్’గా చెబుతున్నారు. ఆ ‘కో–ఇన్ఫెక్షన్ల’పై అవగాహన కోసమే ఈ కథనం. ఓ కేస్ స్టడీ: ఇటీవల ఓ మహిళ జ్వరంతో ఆసుపత్రికి వచ్చింది. తొలుత ఆమెలో డెంగీ లక్షణాలు కనిపించాయి. పరీక్షలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం డాక్టర్లు చూశారు. ఆ తర్వాత ఆమెకు ఆయాసంగా ఉండటం, ఊపిరి అందకపోవడం గమనించారు. అప్పుడు పరీక్షిస్తే ఆమెకు కోవిడ్ కూడా ఉన్నట్లు తేలింది. ఇలా ఒకేసారి రెండు రకాల జ్వరాలు (ఇన్ఫెక్షన్లు) ఉండటాన్ని ‘కో–ఇన్ఫెక్షన్స్ అంటారు. ఇలా రెండ్రెండు ఇన్ఫెక్షన్లు కలసి రావడం కాస్తంత అరుదు. కానీ ఇటీవల ఈ తరహా కేసులు పెద్ద ఎత్తున రావడం విశేషం. ఇక ఈ కేస్ స్టడీలో కోవిడ్ కారణంగా బాధితురాలిని నాన్–ఇన్వేజివ్ వెంటిలేషన్ మీద పెట్టి, ఆక్సిజన్ ఇస్తూ... రెండు రకాల ఇన్ఫెక్షన్లనూ తగ్గించడానికి మందులు వాడాల్సి వచ్చింది. వైరల్, బ్యాక్టీరియల్ జ్వరాలు కలగలసి... సాధారణంగా జ్వరాలతో బయటపడే ఇన్ఫెక్షన్లు రెండు రకాలుగా ఉంటాయి. వాటిల్లో మొదటివి బ్యాక్టీరియల్ జ్వరాలు. రెండోవి వైరల్ జ్వరాలు. అయితే ఇటీవల బ్యాక్టీరియల్ జ్వరాల్లోనే రెండు రకాలుగానీ లేదా ఒకేసారి రెండు రకాల వైరల్ ఇన్ఫెక్షన్లుగానీ... లేదంటే ఒకేసారి వైరల్‌తో పాటు బ్యాక్టీరియల్ జ్వరాలుగానీ కనిపిస్తున్నాయి. అంతేకాదు... ఒకే సమయంలో అనేక ఇన్ఫెక్షన్లతో పాటు ఒకే సమయంలో కుటుంబసభ్యుల్లో అనేక మంది జ్వరాల బారినపడటం అనేకమందికి ఆందోళన కలిగిస్తోంది. బ్యాక్టీరియల్ జ్వరాలతో కలగలసి... బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల విషయానికి వస్తే కొందరిలో వైరల్ జ్వరాలతో పాటు టైఫాయిడ్ ఎక్కువగా కనిపిస్తోంది. మరికొందరిలో ఎలుకలతో వ్యాపించే బ్యాక్టీరియల్ జ్వరం ‘లెప్టోస్పైరోసిస్’ కనిపిస్తున్న దాఖలాలూ ఉన్నాయి. ఇటీవల రోజుల తరబడి వర్షాలు కురుస్తుండటంతో బొరియలు వాననీటిలో నిండిపోగా ఎలుకలు ఇళ్లలోకి రావడం పరిపాటిగా మారింది. లెప్టోస్పైరోసిస్ కనిపించడానికి ఇదే కారణం. ఇంకొందరిలో తొలుత జ్వరం రావడం... ఆ తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తాలూకు రెండో పరిణామంగా (సెకండరీ ఇన్ఫెక్షన్ వల్ల) నిమోనియా కేసులూ కనిపిస్తు న్నాయి. ఇక లక్షణాల తీవ్రత ఎక్కువగా లేని కోవిడ్ రకాలతో (ఒమిక్రాన్ వంటి వాటితో) కలిసి ఇతరత్రా జ్వరాలు రావడం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. యాంటీబయాటిక్స్ వద్దు... జ్వరం వచ్చిన వెంటనే కొందరు పారాసిటమాల్‌తో పాటు యాంటీబయాటిక్స్ మొదలుపెడతారు. యాంటీవైరల్ జ్వరాలకు యాంటీబయాటిక్స్ పనిచేయకపోగా... అవసరం లేకపోయినా వాటిని తీసుకోవడం వల్ల కొన్ని కౌంట్లు మారుతాయి. విరేచనాల వంటివి అయ్యే ప్రమాదం ఉంటుంది. గ్యాస్ట్రైటిస్ వంటి అనర్థాలు వచ్చే ముప్పు ఉంటుంది. అందుకే జ్వరం వచ్చిన మొదటి రోజు నుంచే కాకుండా... మూడోనాడు కూడా జ్వరం తగ్గకపోతే... అప్పుడు మాత్రమే డాక్టర్‌ను సంప్రదించి, తగిన మోతాదులోనే యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. ఇన్ఫెక్షన్లు కలగలసి రావడం ఇదే మొదటిసారి కాదు... గతంలోనూ కొన్ని సందర్భాల్లో డెంగీ, స్వైన్ ఫ్లూ, టైఫాయిడ్ లాంటివి కలసి వచ్చిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అయితే ఇటీవల వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా కురిశాయి. దాంతో దోమల కారణంగా మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటివి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నివారణ... వర్షాకాలంలో పరిసరాల్లో నీళ్లు పేరుకుపోవడంతో దోమలు వృద్ధి చెంది... ఈ జ్వరాలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇంటి పరిసరాల పారిశుద్ధ్య జాగ్రత్తలూ, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తగినంత అప్రమత్తంగా ఉండాలి. దోమలను ఇంట్లోకి రానివ్వకుండా మెష్ / మస్కిటో రెపల్లెంట్స్ వంటి ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాలి. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇక పెద్దవయసు వారు అప్పటికే మధుమేహం, అధిక రక్తపోటు వంటి వాటితో బాధపడే అవకాశాలున్నందున వాటి పట్ల మరింత అప్రమత్తత వహించాలి. మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారిలో ఇన్ఫెక్షన్లు చాలా తేలిగ్గా సోకే అవకాశాలు ఎక్కువ. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. వెరసి అందరూ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. వైరల్ జ్వరాలివే.. వైరల్ జ్వరాల్లో ముఖ్యంగా డెంగీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తోంది. సాధారణంగా అది కోవిడ్‌తో పాటు కలిసి రావడం చాలామందిలో కనిపిస్తోంది. మరికొందరిలో వైరల్ ఇన్ఫెక్షన్లయిన కోవిడ్, ఫ్లూ... ఈ రెండూ కలగలసి వచ్చాయి. ఇంకొందరిలో కోవిడ్, ఫ్లూ, స్వైన్–ఫ్లూ... ఈ మూడింటిలో ఏ రెండైనా కలసి రావడమూ కనిపించింది. లక్షణాలు... వైరల్ జ్వరాల విషయానికి వస్తే... వీటిల్లో జ్వరం తీవ్రత... బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల కంటే ఎక్కువగా ఉంటుంది. కోవిడ్ వంటివి సోకినప్పుడు జ్వరం, దగ్గు కనిపిస్తుంటాయి. తీవ్రత కొంత తగ్గినప్పటికీ ఇటీవల కోవిడ్‌తో కలసి మరో ఇన్ఫెక్షన్ ఉంటే... ఆయాసం, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలూ ఉండవచ్చు. వెరసి... జ్వరం, స్వల్పంగా జలుబు/ఫ్లూ లక్షణాలు, కొందరిలో ఆయాసం, ఊపిరి సరిగా అందకపోవడం, నీరసం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు ఎక్కువ. డెంగీ కేసుల్లో కొందరిలో ఒంటిపై ర్యాష్ వంటి లక్షణాలతో పాటు రక్తపరీక్షలు చేయించినప్పుడు... ప్లేట్లెట్స్ తగ్గడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. నిర్ధారణ పరీక్షలు... కోవిడ్ నిర్ధారణ కోసం ఆర్టీ–పీసీఆర్ అందరికీ తెలిసిన వైద్య పరీక్షే. డెంగీ నిర్ధారణ కోసం చేసే కొన్ని పరీక్షల్లో ఫలితాలు కొంత ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ఎలాగూ డెంగీలో లక్షణాలకే చికిత్స చేయాల్సి ఉన్నందున... ప్లేట్లెట్ కౌంట్తోనే దీన్ని అనుమానించి... తగిన చికిత్సలు అందించాలి. ఇక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయిన టైఫాయిడ్ నిర్ధారణ కోసం వైడాల్ టెస్ట్ అనే వైద్య పరీక్ష చేయించాలి. అవసరాన్ని బట్టి కొన్ని ఇతర పరీక్షలూ చేయించాలి. చికిత్స వైరల్ జ్వరాలకు నిర్దిష్ట చికిత్స లేనందున జ్వరానికి పారాసిటమాల్ ఇస్తూ... లక్షణాలను బట్టి సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అందించాలి. ద్రవాహారాలు ఎక్కువగా ఇవ్వాలి. ఏవైనా దుష్ప్రభావాలు కనిపిస్తే... వాటిని బట్టి చికిత్సను మార్చాలి. (ఉదా. డెంగీలాంటి కేసుల్లో ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు, వాటిని ఎక్కించడం). ఇక టైఫాయిడ్ వంటి బ్యాక్టీరియల్ జ్వరాలకు యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. అయితే జ్వరం వచ్చిన రెండు, మూడు రోజుల వరకు అది వైరలా, బ్యాక్టీరియలా తెలియదు కాబట్టి కేవలం పారాసిటమాల్ తీసుకుంటూ... ఆ పైన కూడా జ్వరం వస్తూనే ఉంటే వైద్యుల వద్దకు వెళ్లి, పరీక్షలు చేయించి, తగిన చికిత్సలు తీసుకోవాలి. ఇక లెప్టోస్పైరోసిస్ వంటివి కాలేయం, కిడ్నీ వంటి వాటిపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది. సెకండరీ నిమోనియా మరింత ప్రమాదకారి. అందుకే ఈ కేసుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. -డాక్టర్ ఆరతి బెల్లారి, కన్సల్టెంట్ ఫిజీషియన్ -
ఆలూ తింటే వెయిట్ పెరుగుతామా?
-
భర్త సిగరెట్ అలవాటు ప్రభావం భార్య గర్భధారణపై ఉంటుందా..?
Husband Smoking Habit Affect Wife Pregnancy: భర్త సిగరెట్ తాగితే ప్యాసివ్ స్మోకింగ్ ప్రభావాల కారణంగా దాని దుష్ప్రభావాలు దంపతులిద్దరిపైనా ఉంటాయన్న విషయం అనేక పరిశోధనల్లో తేలిన విషయమే. అయితే అతడు ఇంటి బయట సిగరెట్ తాగి వచ్చినా ఆ అలవాటు దంపతులిద్దరితో పాటు భార్య తాలూకు గర్భధారణపై కూడా పడుతుంది. అతడి సిగరెట్ అలవాటు వల్ల సంతాన సాఫల్య అవకాశాలూ తగ్గుతాయి. అతడు తాగే సిగరెట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆ దుష్ప్రభావాలూ పెరుగుతాయి. భర్తకి స్మోకింగ్ అలవాటు ఉన్నప్పుడు అతడి పార్ట్నర్కు గర్భధారణ కూడా ఆలస్యం కావచ్చు. దీనికి అనేక కారణాలున్నప్పటికీ... ముఖ్యంగా అతడి స్మోకింగ్ కారణంగా భార్యలోని హార్మోన్ సైకిళ్లలో పాలు పంచుకునే జీవరసాయనాల్లో మార్పు రావచ్చు. దాంతో ఆమెలోని అండాల సంఖ్య గణనీయంగా తగ్గవచ్చు. ఒకసారి అండాల సంఖ్య తగ్గితే వాటిని తిరిగి పొందడం సాధ్యం కాదు. మహిళకు సంతాన సాఫల్య చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చి... ఆమె భర్తకు సిగరెట్ అలవాటు ఉన్నప్పుడు... ఐవీఎఫ్ లాంటి ప్రక్రియలో ఆమె ఓవరీ స్టిమ్యూలేషన్కు మరిన్ని మందులు అవసరమవుతాయి. అందుకే సాధారణ దంపతులతో పోలిస్తే భర్తకు ఈ దురలవాటు ఉన్న మహిళలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. గర్భస్రావాలు అయ్యే అవకాశాలూ పెరుగుతాయి. గర్భధారణ జరిగాక కూడా నెలలు నిండకముందే బిడ్డపుట్టే (ప్రీమెచ్యుర్ డెలివరీకి) అవకాశాలూ పెరుగుతాయి. అలా పుట్టే చిన్నారుల బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి పిల్లలకు భవిష్యత్తులో డయాబెటిస్, గుండెజబ్బులు, స్థూలకాయం వచ్చే అవకాశాలూ ఎక్కువే. ఇక పొగతాగే పురుషుల విషయానికే నేరుగా వస్తే... తమ అలవాటు కారణంగా వాళ్ల వీర్యంలో శుక్రకణాల సంఖ్య, కదలిక, చురుకుదనం, వాటి ఆరోగ్యం తగ్గుతాయి. అది నేరుగా సంతాన సాఫల్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే సమయానికి గర్భధారణ, మంచి ఆరోగ్యకరమైన శిశువును కోరుకునేవారు ఈ దురలవాటును వదులుకోవడమే మేలు. అంతేకాదు... కేవలం సంతానం విషయంలోనే కాకుండా వారి ఆరోగ్యంతో పాటు, భవిష్యత్తులో వారి పిల్లల ఆరోగ్యానికీ ఇది మేలు చేస్తుంది. చదవండి: Overhydration: నీరు ఎక్కువ తాగుతున్నారా? ఈ సమస్యలు తప్పవు మరి! -
జుట్టు రాలకుండా కాపాడుకోండిలా...
జుట్టు రాలడానికి అనేక కారణాలు దోహదపడుతుంటాయి. అందులో కొన్ని మందులతోనూ, వైద్యసహాయంతో తప్ప నివారించలేని సమస్యలు ఉండవచ్చు. అయితే మనం మామూలుగాఎలాంటి వైద్యసహాయం లేకుండా నివారించగల సమస్యల్లో ప్రోటీన్లలోపం, శారీరక ఒత్తిడి ముఖ్యమైనవి. ఇలాంటి సమస్యలను పెద్దగా వైద్యసహాయమేమీ లేకుండానే మనకు మనంగా కొన్ని జాగ్రత్తలతో అరికట్టవచ్చు. అలాంటి సమస్యలూ... వాటిని అరికట్టగలిగే తేలిక మార్గాలేమిటో చూద్దాం. ప్రోటీన్ లోపాల వల్ల: చాలామందిలో జుట్టు రాలిపోవడానికి గల ప్రధాన కారణం... వారు తగినంతగా ప్రోటీన్‌తో కూడిన ఆహారం తీసుకోకపోవడమే. ఈ ప్రోటీన్లే ప్రధానంగా జుట్టు పెరుగుదలకూ, దెబ్బతిన్న జుట్టు తాలూకు రిపేర్లకూ దోహదపడతాయి. అరికట్టడం ఇలా: ఇలా జుట్టు ఎక్కువగా రాలుతున్నవారు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. చేపలు, గుడ్లు, మాంసాహారం పుష్కలంగా ప్రోటీన్లు ఉంటాయి. శాకాహారులైతే ఆకుకూరలు, గ్రీన్‌పీస్, నట్స్, శనగలు, పప్పుధాన్యాలు, సోయా తీసుకోవాలి. వీటిలో ప్రోటీన్లు చాలా ఎక్కువ. శారీరక ఒత్తిడి: మనం నిత్యం ఎదుర్కొనే శారీరక ఒత్తిడులు మనలో భౌతికంగా మార్పులు తెచ్చి జుట్టు రాలిపోయేలా చేస్తాయి. ఇలా జుట్టు రాలడాన్ని ‘టిలోజెన్ ఎఫ్లూవియమ్’ అంటారు. అంటే ఈ దశలో జుట్టు ఊడిపోయే దశ అయిన టిలోజెన్ దశలోకి జుట్టు వెళ్లిపోతుంది. పైగా ఈ దశ చాలాకాలం పాటు కొనసాగుతుంది. ఫలితంగా మాడుపైన జుట్టు పలచబడినట్లుగా కనిపిస్తుంది. ఈ దశలో రాలిన జుట్టు చివరి భాగంలోని తెల్లని పదార్థం పచ్చి పచ్చిగా కాకుండా, బాగా ఎండిపోయినట్లుగా ఉండటాన్ని మనం గమనించవచ్చు. అరికట్టడం ఇలా: ఇలా రాలిపోయిన జుట్టు సాధారణంగా ఒత్తిడి తొలిగాక మళ్లీ మొలుస్తుంది. అందుకే ఒత్తిడి తొలగించుకోడానికి రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయడం, యోగా వంటివి ఉపకరిస్తాయి. -
ఒక్క టాబ్లెట్‌తో గుండె జబ్బులు మాయం!
సాక్షి, న్యూఢిల్లీ : రోజుకు నాలుగు మందుల మిశ్రమం కలిగిన ఒక చిన్న టాబ్లెట్ వేసుకోవడం ద్వారా దేశంలో లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడవచ్చని ఓ తాజా వైద్య అధ్యయనం వెల్లడించింది. తద్వారా ‘జాతీయ ఆరోగ్య స్కీమ్’ కింద ప్రభుత్వానికి ఖర్చవుతున్న కోట్లాది రూపాయలను ఆదా చేయవచ్చని కూడా ఆ అధ్యయనం సూచించింది. ఆస్ప్రిన్, స్టాటిన్ మందులతోపాటు రక్తపోటును నియంత్రించే ఏవైనా రెండు మందులతో కూడిన ‘పోలి పిల్’ వేసుకుంటే గుండెపోటు రాకుండా చేయవచ్చని అధ్యయనం జరిపిన వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బులు ఉన్నవారే కాకుండా ఎలాంటి గుండె జబ్బులు లేని వారు కూడా ఈ ‘పోలి పిల్’ వేసుకుంటే వారిలో 40 శాతం వరకు గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని వారు చెప్పారు. పలు మందుల మిశ్రమ‘ పోలి పిల్స్’ గురించి గత కొన్నేళ్లుగా బ్రిటన్‌లో అధ్యయనాలు కొనసాగుతున్నా తాజా అధ్యయనమే సత్ఫలితాలిచ్చాయని వైద్యులు తెలిపారు. పైగా ఒక్క ట్యాబ్లెట్‌కు భారతీయ కరెన్సీలో కేవలం రెండు రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని వారు చెప్పారు. 50 ఏళ్ల నుంచి 75 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన ఏడువేల మందిపై ఐదేళ్లపాటు అధ్యయనం జరపడం వల్ల ఈ ‘ పోలి పిల్’ ప్రభావాన్ని అధ్యయనం చేయగలిగామని వైద్యులు ‘ది లాన్సెట్’ పత్రికలో వివరించారు. దేశంలోని లక్షలాది మంది ప్రజలు ఇప్పటికే ‘స్టాటిన్ ట్యాబ్లెట్ల’తోపాటు బీపీ మందులు వాడుతున్నారని, వారు అనేక మందులు తీసుకునే బదులు రోజుకో ట్యాబ్లెట్ తీసుకుంటే సరిపోతుందని అధ్యయనంలో పాల్గొన్న బర్మింగమ్ యూనివర్శిటీ చెందిన ప్రొఫెసర్ టామ్ మార్శల్ తెలిపారు. ఎలాంటి గుండె జబ్బులు లేకుండా 50 ఏళ్ల వయస్సు దాటిని వారంతా ఈ ‘పోలి పిల్’ వాడడం వల్ల గుండె జబ్బులను అరికట్టవచ్చని ఆయన చెప్పారు. -
పురుషులలో సంతాన లేమి సాఫల్యానికి మార్గాలు
ఫాదర్స్‌డేకి కాస్త ముందు వెనకలుగా కొన్ని దేశాలలో మెన్స్ హెల్త్ వీక్ జరుపుకుంటాయి. ఈ సంవత్సరం మెన్స్ హెల్త్ వీక్ ఈ నెల 10న ఆరంభం అయింది. నేటితో ముగుస్తోంది. పురుషులు తమ ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టి, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగిన సరైన సమయమిది. బిడ్డకు తల్లి లేదా తండ్రి కావడమనేది ఎంతో ఆనందించదగ్గ విషయం. దురదృష్టవశాత్తూ ప్రస్తుత జీవనశైలిని బట్టి ఇటీవలి కాలంలో చాలా దేశాలలో అదొక పెద్ద సవాలుగా మారింది భారతీయ జనాభాలో వంధ్యత్వం దాదాపు 10 నుంచి 14 శాతం మందిపై ప్రభావం చూపుతోంది. ఎటువంటి గర్భనిరోధక సాధనాలు వాడకుండా ఏడాది పాటు సంసార జీవితం గడుపుతున్నా సంతానం కలగకపోవడాన్ని వంధ్యత్వం అనవచ్చు. ఇంచుమించు అన్ని వంధ్యత్వ కేసులలోనూ, 40 నుంచి 50 శాతం వరకు పురుషులలో వంధ్యత్వానికి సంబంధించినవే. సంతాన లేమితో బాధపడుతున్న చాలామంది పురుషులు దాంపత్య జీవనంలో తమకు ఎదురవుతున్న సవాళ్లను, సమస్యలను ఎవరికీ చెప్పుకోకపోవడం దురదృష్టకరం.. లైంగికపరమైన స్తబ్ధత, తక్కువస్థాయిలో వీర్యం ఉత్పత్తి కావడం. వీర్య ఉత్పత్తిలో అసాధారణ పరిణామాలు, లేదా వీర్యనాళాలలో బ్లాకేజీలు వంటివి వంధ్యత్వానికి ప్రధాన కారణాలు. జబ్బు పడటం, తీవ్ర గాయాల పాలుకావడం, అసాధారణమైన ఆరోగ్య సమస్యలు, జీవనశైలి లక్షణాలు, తదితరమైనవి పురుష వంధ్యత్వానికి దారితీసే మౌలికాంశాలు. సంతానలేమికి ఇతర కారణాలు తక్కువ వీర్యకణాలు ఉండటం: వీర్యంలో మిల్లీలీటరుకు 15 మిలియన్ల కణాలకన్నా తక్కువ ఉండటాన్ని తగినన్ని వీర్యకణాలు లేకపోవడంగా పరిగణింపవచ్చు. సంతానం లేని దంపతులలో దాదాపు మూడవ వంతుమంది జంటలకు తక్కువ వీర్యకణాల వల్లనే సంతానం కలగడం లేదు. వీర్యకణాల కదలిక తక్కువగా ఉండడం: వీర్యంలోనుంచి వీర్యకణాలు అండాన్ని చేరి, ఫలదీకరణ చెందాలంటే కణాలు చురుకుగా కదలాలి. కణాలు ఈదలేకపోతే ఫలదీకరణ జరగదు. అసాధారణమైన వీర్యం: వీర్యకణాలకు సరైన ఆకారం లేకపోవడం వల్ల అండంలోనికి చొచ్చుకుపోలేకపోవడాన్ని అసాధారణమైన వీర్యంగా చెప్పవచ్చు. పురుషులలో వంధ్యత్వానికి దారితీసే ఇటువంటి పరిణామాలకు వృషణాలకు ఇన్ఫెక్షన్ సోకడం లేదా విపరీతమైన వేడిమికి గురవడం, వెరికోసిల్, హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన కారణాలు, క్యాన్సర్, శస్త్రచికిత్సలు మొదలైన కారణాలు ఉండవచ్చు. వంధ్యత్వానికి దారితీసే కారకాలు ధూమపానం, మద్యపానం, యాంటిబయొటిక్ స్టెరాయిడ్ల వాడకం, అధికంగా చక్కెర కలిపిన శీతల పానీయాలు సేవించడం, రసాయనాల ప్రభావానికి గురికావడం, అధికబరువు లేదా స్థూలకాయం, మానసిక ఒత్తిడి, అధికంగా వ్యాయామం చేయడం. రోజుకు మూడుగంటల కన్నా ఎక్కువసేపు టీవీ చూడటం, రెండుగంటల కన్నా ఎక్కువగా మొబైల్ ఫోన్లను వాడటం, టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ఉన్న ప్రదేశానికి కి.మీ. పరిధిలో నివసించడం వల్ల కూడా వీర్యం తగిన పరిణామంలో ఉత్పత్తి కాదు. వీర్యకణాలలో డి.ఎన్.ఎ. విచ్ఛిత్తి చెందడం ఒక్కోసారి వీర్యకణాలలో డిఎన్ఎ విచ్ఛిత్తి చెందడం వల్ల కూడా పురుషులలో వంధ్యత్వానికి దారితీసే అవకాశం ఉంది. పరిసరాల ప్రభావం, కొని ్నరకాల జీవనశైలి అలవాట్ల వల్ల డిఎన్ఎ విచ్ఛిత్తి చెందుతుంది. రసాయనాల ప్రభావానికి గురికావడం, తీవ్రమైన వేడిమి ఉన్న ప్రదేశాలలో పని చేయడం, ధూమపానం డిఎన్ఎ విచ్ఛిత్తికి దారితీస్తాయి. సాఫల్యానికి సలహాలు తగినంత నీటిని తాగడం, పిల్లలకోసం ప్రయత్నించడానికి కనీసం రెండు మూడు నెలల ముందు నుంచి ధూమపానాన్ని మానివేయడం, పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే టొమాటో, చిలకడ దుంపలు, పుచ్చ, గుమ్మడి, క్యారట్లు, చేపలు, వాల్నట్స్, బ్లూ బెర్రీస్, దానిమ్మ, డార్క్ చాకొలేట్స్ వంటి వాటిని తినడం మంచిది. డాక్టర్ స్వప్నాశ్రీనాథ్ ఎఫ్ఎన్బి రిప్రొడక్టివ్ మెడిసిన్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ కోమలి ఫెర్టిలిటీ సెంటర్ (ఎ యూనిట్ ఆఫ్ రమేష్ హాస్పిటల్స్) గుంటూరు – విజయవాడ; ఈమెయిల్: drswapnasrinath@gmail.com -
జయ చికిత్స కోసం మళ్లీ ఎయిమ్స్ వైద్యులు!
-
జయ చికిత్స కోసం మళ్లీ ఎయిమ్స్ వైద్యులు!
ఇక చెన్నై రానన్న డాక్టర్ రిచర్డ్ సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యపరిస్థితిని సమీక్షించేందుకు ఎయిమ్స్ వైద్యులు మరోసారి చెన్నైకి వస్తున్నట్లు సమాచారం. జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరి బుధవారానికి 35 రోజులైంది. అపోలో వైద్యులు, ప్రఖ్యాత ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు డాక్టర్ రిచర్డ్, ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యులంతా ఒక బృందంగా ఏర్పడి ఇప్పటివరకు చికిత్స చేస్తూ వస్తున్నారు. నెలరోజులుగా పడకపైనే ఉన్నందున కాళ్లు, చేతులు కొద్దిగా స్వాధీనం తప్పాయి. దీంతో సింగపూర్ నుంచి మహిళా ఫిజియోథెరపిస్టులను పిలిపించా రు. అందరి సమష్టి కృషి ఫలితంగా సీఎం దాదాపుగా కోలుకున్నారు. పక్కపై కూర్చోవడంతోపాటు ఆహారాన్ని తానే తినగలుగుతున్నారు. దీపావళి పండుగకు ముందుగానే ఆమెను డిశ్చార్జ్ చేయాలని భావిస్తున్నారు. ఈ దశలో ఆమె ఆరోగ్యాన్ని సమీక్షించేందుకు ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యులు గురు లేదా శుక్రవారాల్లో మరోసారి చెన్నైకి వస్తున్నారు. కాగా, సుమారు 20 రోజులుగా లండన్-చెన్నై మధ్య చక్కర్లు కొడుతూ సీఎంకు చికిత్స అందిస్తున్న డాక్టర్ రిచర్డ్ వచ్చే నెల 7 తర్వాత చెన్నైకి రావడం కుదరదని చెప్పినట్లు సమాచారం. ఇదిలాఉండగా ఉప ఎన్నికలు జరిగే తంజావూరు, తిరుప్పరగున్రం, అరవకురిచ్చి నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి జయలలిత ఆదేశాల మేరకు ఇన్చార్జులను నియమిస్తున్నట్లు అన్నాడీఎంకే కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జయలలిత కోలుకోవాలని ప్రార్థిస్తూ సేలంలోని మారియమ్మన్ ఆలయంలో నిర్వహించిన ఊరేగింపులో పాల్గొని 55 ఏళ్ల గుర్తుతెలియని కార్యకర్త మృతి చెందాడు. -
'జయమ్మ చాలా బాగున్నారు.. త్వరలో ఇంటికి'
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై ఆమె పార్టీ ఏఐఏడీఎంకే బుధవారం తాజా ప్రకటన చేసింది. ప్రస్తుతం జయలలిత చాలా బాగా కోలుకున్నారని, త్వరలోనే ఆమె ఇంటికి వస్తారని తెలిపింది. గత సెప్టెంబర్ 22న డిహైడ్రేషన్ సమస్యతో జయ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వదంతులు వ్యాపించాయి. వీటన్నింటికి తెరదించుతూ అపోలో ఆస్పత్రి వైద్యులతోపాటు, రాజభవన్ కూడా జయలలిత ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఆమె ఆరోగ్యంలో వేగంగా పురోగతి వస్తోందని, త్వరలోనే ఆమె పూర్తి స్థాయిలో కోలుకుంటారని ప్రకటన చేశారు. కాగా, తాజాగా పార్టీ కూడా జయ ఆరోగ్యంపై బుధవారం మరోసారి ప్రకటన చేసింది.


