దాహం లేకున్నా నీళ్లు తాగండి.. ఎందుకంటే? | Keep Your Heart Healthy This Summer, What Doctors Suggest | Sakshi
Sakshi News home page

ఎండ పోటు.. గుండెకు చేటు

May 29 2026 2:23 PM | Updated on May 29 2026 2:40 PM

Keep Your Heart Healthy This Summer, What Doctors Suggest

జాగ్రత్తలు అవసరం అంటున్న వైద్యులు

సాక్షి, హైదరాబాద్‌: ఎండ దెబ్బకు గుండె గుభేల్‌మంటోంది. పగటి ఉష్ణోగ్రతలు సుమారు 45 డిగ్రీల దాకా నమోదవుతుండటం, తీవ్ర వడగాడ్పులు వీయడం, వాతావరణంలో మార్పులతో హృద్రోగాలు పెరుగుతున్నాయి. సమ్మర్‌ హార్ట్‌ ఎటాక్స్‌ కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లోనూ ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక రోగాలకు మందులు వాడుతున్న వారు, హృద్రోగులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

శరీర సాధారణ ఉష్ణోగ్రత 35 డిగ్రీల నుంచి 38 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ సమయంలో గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఉష్ణోగ్రత ఒక డిగ్రీ పెరిగితే గుండె 10 సార్లు ఎక్కువ కొట్టుకుంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైనే నమోదవుతుండటంతో వేసవిలో హార్ట్‌ ఎటాక్స్‌ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. చర్మం నుంచి చెమట రూపంలో సోడియం, పొటాషియం వంటివి ఎక్కువ మోతాదులో బయటకు వెళ్లిపోతాయి. లవణాలు బ్యాలెన్స్‌ తప్పితే గుండెలయ తప్పుతుంది. డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు రక్తం చిక్కగా మారి గడ్డకట్టే ప్రమాదం ఏర్పడుతుంది. దీనివల్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని వైద్యులు చెబుతున్నారు.

వాతావరణంలో మార్పులకు అనుగుణంగా గుండె పనితీరు మారుతుందని.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే సమ్మర్‌ కార్డియాక్‌ అరెస్టు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ప్రతి లక్షలో 200 మంది నుంచి 500 మందిలో గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని.. వేసవి వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలతో ఈ సమస్య 2–3 రెట్లు పెరుగుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

దాహం లేకున్నా నీళ్లు తాగండి 
డీహైడ్రేషన్‌ వల్ల రక్తం చిక్కగా మారిపోతుంది. వేసవిలో దాహం అనిపించినా లేకున్నా అరగంటకోసారి 50 మిల్లీలీటర్ల నుంచి 80 మిల్లీలీటర్ల నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటివి తాగడం మంచిది. బీపీకి మందులు (బీటా బ్లాకర్స్‌) వినియోగించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వేసవి వేడికి హార్ట్‌ రేటు పెరుగుతుంది. దీన్ని బీపీ మందులు కంట్రోల్‌ చేస్తాయి. దీంతో శరీరానికి అవసరమైన రక్త సరఫరా జరగదు. వేసవిలో రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. చర్మంలో రక్తనాళాల పరిమాణం పెరిగితేనే చెమట వస్తుంది.

ఇలాంటి సమయంలో మెదడు, ఇతర శరీర అవయవాలకు రక్త సరఫరా తగ్గిపోతుంది. దీంతో కార్డియాక్‌ అరెస్ట్‌ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రజలు ప్రత్యేకించి వృద్ధులు ఎండలో తిరగొద్దు. అలాగే సాలిడ్‌ ఫ్రూట్‌ జ్యూస్, సోడా, మద్యం, కాఫీ వంటి వాటికి దూరంగా ఉండాలి. 

– డాక్టర్‌ ఓరుగంటి సాయి సతీశ్,హెచ్‌ఓడీ కార్డియాలజీ యూనిట్‌–1, నిమ్స్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement