మతి మరపు @ అతి బరువు | Alzheimer disease tends to develop slowly and gradually worsen over several years | Sakshi
Sakshi News home page

మతి మరపు @ అతి బరువు

Jun 2 2026 6:28 AM | Updated on Jun 2 2026 6:29 AM

Alzheimer disease tends to develop slowly and gradually worsen over several years

వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు వస్తుండటం సహజం. ఇప్పడు పెరిగే వయసుతో పాటూ పెరిగే బరువు కూడా మతిమరపును ప్రేరేపిస్తోందంటూ కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇందులో అత్యంత సాధారణం అల్జీమర్స్‌ అనే మతిమరపు. దీనికి పెరిగే వయసుతో పాటు బరువు పెరుగుతుండట కూడా అల్జీమర్స్‌కూ అంతే కారణమవుతోందనేందుకు పరిశోధనల రూపంలో తార్కాణాలు లభ్యమవుతున్నాయి. ఇలా బరువు పెరుగుతుండటంతో పాటు అల్జీమర్స్‌కు కారణమవుతున్న ఇతర అంశాలేమిటన్నది తెలుసుకుంటూ బరువు తగ్గించుకోవడం ద్వారా మెదడు ఆరోగ్యం ఎలా మెరుగవుతుందో చూద్దాం...

మతిమరపును ఇంగ్లిష్‌లో ‘డిమెన్షియా’ అంటారు. డిమెన్షియాకు కారణాల్లో అత్యంత సాధారణమైనది ‘అల్జీమర్స్‌’. డిమెన్షియా కొత్త అంశాల్ని నేర్చుకునేందుకు సహాయపడే (కాగ్నిటివ్‌) నైపుణ్యాల్లోని జ్ఞాపకశక్తి (మెమరీ)పైనా, తార్కికంగా ఆలోచించే సామర్థ్యం (రీజనింగ్‌)పైనా ప్రతికూలంగా ప్రభావం చూపుతుంది.  

ఇటీవలి కాలంలో అల్జీమర్స్‌ బాగా పెరుగుతోంది. ఇది అకస్మాత్తుగా కాకుండా క్రమంగా... అంటే కొన్ని నెలలు మొదలుకొని ఏళ్ల వ్యవధిలోమరచిపోయే అంశాలను పెంచుతూ పోతుంటుంది. ఉదాహరణకు మొదట్లో పేర్లు, కొద్దిసేపటి కిందట జరిగిన సంఘటనలూ, ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోవడం, కుటుంబ సభ్యుల్ని  అడిగిన ప్రశ్నల్నే మళ్లీ మళ్లీ అడగడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, అటు  తర్వాత తెలిసిన దారులనూ, అటు తర్వాత సమీప వ్యక్తులనూ, కుటుంబ సభ్యులను మరచిపోవడం జరుగుతుంది. చివరగా... భయభ్రాంతులకు లోనవ్వడం, మలమూత్ర విసర్జనలపై నియంత్రణ కోల్పోవడం వరకు జరగవచ్చు.  ఒక్కమాటలో చె΄్పాలంటే నేర్చుకున్న అనేక అంశాలు రాతిమీది రాతల్లా ఉండిపోవాల్సినవి కాస్తా... పలక మీద రాతలా చెరిపివేతకు గురవ్వడాన్ని అల్జీమర్స్‌గా చెప్పవచ్చు. ఒకసారి అల్జీమర్స్‌ మొదలయ్యాక బాధితుల్ని మునపటిలా పూర్తిగా నార్మల్‌ అయ్యేలా చేయడం ఇప్పటికి సాధ్యం కాదు.

చికిత్స...
అల్జీమర్స్‌ను పూర్తిగా తగ్గించే మందులు లేకపోయినప్పటికీ... వాటి పురోగతిని ఆలస్యం చేయడానికి మందులు అందుబాటులో ఉన్నాయి. లక్షణాల తీవ్రత ఆధారంగా డోనెపెజిల్, రివాస్టిగ్మిన్, మెమాంటిన్, గ్యాలంటమైన్‌ వంటి మందులు ఇవ్వాల్సి ఉంటుంది.  మెదడులోని అన్నిరకాల కార్యకలాపాలను నిర్వహించే ఎసిటైల్‌ కోలిన్‌ అనే రసాయనం సరైన మోతాదుల్లో ఉంచడానికి ఇవి ఉపయోగపడతాయి. 

గత కొద్దికాలం కిందట ‘లెకనిమ్యాబ్‌’, ‘డొనానిమ్యాబ్‌’ అనే సరికొత్త మందుల్ని  ఎఫ్‌డీఏ ఆమోదించింది. పైవన్నీ నోటిద్వారా తీసుకునే మందులు కాగా... లెకానిమ్యాబ్‌ను రెండోవారాలకు ఒకసారి  సూది మందు రూపంలో ఇస్తారు. ఈనెలలోనే (మే, 2026లో) ‘డొనానిమ్యాబ్‌’ అనే సరికొత్త మందు మనకు అంటే రెండు తెలుగు రాష్ట్రాలకూ  అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఈ మందు అల్జీమర్స్‌ తొలిదశలో ఇది అత్యంత ప్రభావవంతమైనది. దీన్ని నెలకొక ఇంజెక్షన్‌ చొప్పున తీసుకోవాలి.

పెరిగే బీఎమ్‌ఐతో జ్ఞాపకశక్తి తగ్గు తున్నా... అది నివారించగలిగే అంశమే... 
యూనివర్జిటీ ఆఫ్‌ జార్జియాలో నిర్వహించిన ఇటీవలి తాజా పరిశోధన ఫలితాలేమిటంటే... వయసు పెరుగుతున్న కొద్దీ వారి జ్ఞాపకశక్తి గతంలో వారు యువకులుగా ఉన్నంతగా ఉండకపోవచ్చు. దీనికి తోడు పెరుగుతున్న బరువు (బాడీ మాస్‌ ఇండెక్స్‌–బీఎమ్‌ఐ) పెరుగుతున్న కొద్దీ వారిలోనూ అభ్యాసనం ద్వారా నేర్చుకునే (కాగ్నిటివ్‌) నైపుణ్యాలూ, గుర్తుంచుకునే సామర్థ్యాలు (మెమరీ), భావోద్వేగాల అదుపు (మేనేజింగ్‌ ఎమోషన్స్‌), ప్లానింగ్‌ అలాగే నిర్వహణ సామర్థ్యాలూ, ఏకాగ్రత (కాన్సంట్రేషన్‌) తగ్గుతాయని తేలింది. 24 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారిలో దాదాపు 8,200 మందిపై నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అయితే ఇదేమీ చెడు వార్త కాదనీ... ఒకవేళ మనం మన బరువును అదుపులో పెట్టుకుంటే ఆ దుష్పరిణామాలు నివారించవచ్చని ఈ అధ్యయనంలో పాల్గొన్న యూనివర్సిటీ ఆఫ్‌ జార్జియాలో కాలేజ్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు చెందిన లీడ్‌ ్రపొఫెసర్‌ డాక్టర్‌ సుహాంగ్‌ 
సాంగ్‌ పేర్కొన్నారు.

నివారణ... 
పై అంశాలలో పెరిగే వయసు, జన్యుపరమైన అంశాలు నిరోధించలేనివి. ఇవి మినహా మిగతా రిస్క్‌ ఫ్యాక్టర్స్‌ను చాలావరకు ప్రయత్నపూర్వకంగా అదుపులో ఉంచడం ద్వారా వీటిని చాలావరకు నివారించవచ్చు. ఈ కింది అంశాలు నివారణకు చాలావరకు తోడ్పడతాయి.

ఆహారం... 
పోషకాలన్నీ ఉండే సమతులాహారం తీసుకోవడం మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా భారతీయ వంటల్లో వాడే పసుపుతో పాటు పాశ్చాత్య ఆహారాల్లో మెడిటేరియన్‌ డైట్‌ (ఆల్మండ్స్, వాల్‌నట్, డార్క్‌ చాక్లెట్స్, ఆలివ్‌ ఆయిల్, క్రాన్‌బెర్రీ) వంటివి మతిమరపు నివారణకు బాగా తోడ్పడతాయి.

మెదడుకు మేత 
కొత్త భాషలు నేర్చుకోవడం, పుస్తక పఠనం, పజిల్స్‌ వంటి  సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం వంటి మెదడుకు మేత కల్పించే పొడుపుకథలు, ఉల్లాసంగా ఉంచే హాబీలు, మానసిక వ్యాయామాలు మెదడును చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంచి మతిమరపు నివారణకు తోడ్పడతాయి.

వ్యాయామం...
దేహాన్ని చురుగ్గా ఉంచే వ్యాయామాలు చేయాలి. దాంతో మెదడుకు రక్తప్రసరణ బాగాజరిగి, న్యూరాన్లూ వాటి న్యూరల్‌ కనెక్షన్లు, వివిధ జీవక్రియల కోసం మెదడు స్రవించే రసాయనాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. ఫలితంగాజ్ఞాపకశక్తి మెరుగవుతుంది.

నిర్ధారణ 
అల్జీమర్స్‌ నిర్ధారణ కోసం ఇప్పడు కొన్ని రకాల పరీక్షలు కూడా అందుబాటులోకి వచ్చాయి. గతంలోని ఎమ్మారై బ్రెయిన్‌తో పాటు కొన్ని రక్తపరీక్షలూ ఇప్పుడ అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి టీఏయూ (టావు) అండ్‌ అమైలాయిడ్‌ శాతాన్ని నిర్ధారణ చేయడం; అమైలాయిడ్‌ పెట్‌ స్కాన్‌ ద్వారా అల్జీమర్స్‌ను నిర్ధారణ చేయవచ్చు. ఇవి చాలా తాజాగా అందుబాటులోకి వచ్చిన వైద్యపరీక్షలు.

సమాజంలో నలుగురితో పాటు ఒకరిగా మెలగడం...
వేడుకలు, పుట్టినరోజులూ, పెళ్లిళ్ల వంటి ఫంక్షన్లలో పదిమందినీ కలవడం వంటివి మతిమరపును దూరం చేస్తుంది. అలాంటి ఉల్లాస జీవితం వల్ల భవిష్యత్తులో అల్జీమర్స్‌ వచ్చే ముప్పూ తగ్గుతుంది.

దీర్ఘకాలిక వ్యాధుల అదుపు...
డయాబెటిస్, హైబీపీ, క్రానిక్‌ ఇన్‌ఫ్లమేషన్స్‌ వంటి వాటిని అదుపులో పెట్టుకోవాలి.

మతి మరుపు, అల్జీమర్స్‌ కారణమయ్యే అంశాల్లో కొన్ని...
మతిమరుపునకూ, అల్జీమర్స్‌కూ అనేక అంశాలు కారణమవుతుంటాయి. వాటిల్లోని అతి ముఖ్యమైన ఓ అరడజను కారణాలేమిటో చూద్దాం...
1. జన్యుపరమైనవి : అల్జీమర్స్‌తో వచ్చే మతిమరుపునకు జన్యుపరమైన అంశాలు అతి ముఖ్య కారణాలు. కొందరి కుటుంబాల్లో అల్జీమర్స్‌ వంశాపారంపర్యంగా కనిపిస్తుంటుంది. ఏపీఓఈ 4 ఎల్లీల్‌ జన్యువు వంటి కొన్ని నిర్దిష్టమైన జన్యువులు ఈ అల్జీమర్స్‌ ముప్పును పెంచుతాయి.

2. వయసు : పెరుగుతున్న వయసు పై సమస్యలకు ప్రధానమైన ముప్పు (రిస్క్‌ ఫ్యాక్టర్‌). పైగా ఇది నిరోధించలేని అంశం.

3. పెరుగుతుండే బరువు : అధిక బరువు / ఊబకాయం (ఒబేసిటీ) వల్ల దేహంలో కొవ్వుల మోతాదు పెరగడమనే అంశం అల్జీమర్స్‌ వ్యాధి వచ్చే ముప్పును పెంచుతుందని ఇటీవల కొన్ని తాజా అధ్యయనాల్లో తేలింది. దేహంలోనూ, అందునా మరీ ముఖ్యంగా నడుము చుట్టూ కొవ్వు పెరగడంతో పాటు ఫిట్‌నెస్‌ తగ్గడమనే అంశం మెదడును మందకొడిగా మార్చడంతో పాటు మతిమరపును తెచ్చిపెట్టే ప్రమాదమైన సిగ్నల్స్‌ కారణంగా అల్జీమర్స్‌ వస్తుందనేది కొన్ని పరిశోధనల్లో తేలిన అంశం.

4. జీవనశైలి (లైఫ్‌ స్టైల్‌) : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించినవారిలో... అంటే... ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, కొవ్వులు, చక్కెరలు ఎక్కువగా తీసుకోవడం, చురుకైన జీవితానికి దూరంగా ఒకేచోట మందకొడిగా ఉండటం, వ్యాయామం లేకుండా బద్ధకంగా ఉండటం, పొగతాగడం, ఆల్కహాల్‌ తీసుకోవడం వంటì  అనారోగ్యకరమైన జీవనశైలి ఉన్నవాళ్లలో అల్జీమర్స్‌ ముప్పు  ఎక్కువ.

5. దేహంలో దాగి ఉన్న ఇతర సమస్యలు : దీర్ఘకాలికంగా ఉండే డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు (కార్డియో వాస్క్యులార్‌ సమస్యలు)లతో పాటు దీర్ఘకాలికంగా దేహంలో ఉండే ఇన్‌ఫ్లమేషన్‌ (క్రానిక్‌ ఇన్‌ఫ్లమేషన్‌) మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతూ అల్జీమర్స్‌కు కారణమయ్యే అవకాశాలెక్కువ.


6.వాతావరణ అంశాలు : వాతావరణంలోని కాలుష్యాలు, విషపూరిత (టాక్సిక్‌)  పదార్థాలు కూడా అల్సైమర్స్‌ మతిమరపునకు కారణమవుతాయి. దీనికి విరుధ్ధంగా వీలైనంతవరకు పరిశుభ్రమైన ప్రదేశాలూ, కాలుష్యాలు లేని వాతావరణాలూ వీటి నివారణకు చాలావరకు తోడ్పడతాయి.

డాక్టర్‌ బి. చంద్రశేఖర్‌ రెడ్డి
సీనియర్‌ న్యూరో ఫిజీషియన్‌ 

నిర్వహణ యాసీన్‌ 

Advertisement
 
Advertisement
Advertisement