తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న సీజనల్‌ ఫ్లూ జ్వరాలు | Influenza Fever Swine flu surges in Telugu States | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న సీజనల్‌ ఫ్లూ జ్వరాలు

Sep 11 2026 8:12 PM | Updated on Sep 11 2026 8:23 PM

Influenza Fever Swine flu surges in Telugu States

గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ వ్యాప్తి

వర్షాకాలం, చలికాలంలో ఎక్కువగా సోకే అవకాశం

మొదటి 48 గంటలు అప్రమత్తత చాలా ముఖ్యం

రెండువారాలపాటు శరీరంపై విపరీతమైన ప్రభావం

లక్షణాలు తగ్గినా వైరస్‌ కారణంగా కొందరికి ముప్పు

యాంటీబయాటిక్స్‌ పనిచేయవు.. యాంటీ వైరల్‌ మందులివ్వాలి

ఇటీవల తెలుగురాష్ట్రాల్లో ఇన్‌ఫ్లుయెంజా (ఫ్లూ) జ్వరం స్వైరవిహారం చేస్తోంది. పెద్దఎత్తున ప్రజలు దీని బారిన పడుతున్నారు. అయితే ఇవేమీ కొత్త జ్వరాలు కావు. దాదాపు ప్రతి ఏడాదీ వస్తూ ఉండే సీజనల్‌ జ్వరాలుగానే చెప్పవచ్చు. కాకపోతే ఇవి వైరస్‌ వల్ల వచ్చే జ్వరాలు కావడంతో ప్రతి ఏడాదీ... ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ తన జన్యుస్వరూపం మార్చుకుంటూ వచ్చిన‌... ప్రజలను బాధిస్తూ ఉంటుంది. మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఏమిటంటే... ఇన్‌ఫ్లుయెంజా అనేది వైరస్‌తో వచ్చే జ్వరం కావడం వల్ల దీనికి యాంటీబయాటిక్స్‌ పనిచేయవు. దీనికి యాంటీవైరల్‌ మెడిసిన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వైరస్‌ సోకిన 48 గంటలలోపు ఇవ్వకపోతే ఆ వైరస్‌ నశించదు. అటు తర్వాత వైరస్‌ తీవ్రత దానంతట అదే నెమ్మదిస్తుంది. కాకపోతే ఈలోపు మనిషిని తీవ్రమైన నీరసానికి, నిస్సత్తువకూ గురిచేసి బాధిస్తాయి.  

ముప్పు ఎవరెవరిలోనంటే...  
ఆస్తమా, ఎంఫసిమా, సీవోపీడీ వంటి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు.డయాబెటిస్‌ బాధితులు వృద్ధులు, చిన్నపిల్లల వంటి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారు, గర్భిణులూ, గుండెజబ్బు బాధితుల వంటి వారిలో ఫ్లూ జ్వరం ప్రమాదకరం కావచ్చు.  

లక్షణాలు ఇలా... 
హెచ్‌1ఎన్‌1లో కనిపించే తొలి లక్షణాలు సాధారణ ఫ్లూ లేదా వైరల్‌ జ్వరం లాగానే ఉంటాయి. అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం రావడం (హై ఫీవర్‌... ఇది ఒక్కోసారి 103 ఫారెన్‌హీట్‌ వరకూ పెరగవచ్చు) ,పొడి దగ్గు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, ముక్కు ఎర్రబారడం, తీవ్రమైన ఒళ్లునొప్పులు ,బాగా నీరసంగా అనిపించడం, కొందరిలో కడుపునొప్పి కూడా రావచ్చు. వ్యాధినిరోధక శక్తి బలంగా ఉన్నవారిలో రెండు మూడు రోజుల్లోనే లక్షణాలు వాటంతట అవే తగ్గిపోవచ్చు. అయితే కొంతమందిలో నీరసం, నిస్సత్తువ, ఒళ్లునొప్పుల వంటివి రెండు వారాల వరకు తగ్గకపోవచ్చు.  

జ్వరం అనంతర దుష్ప్ర‌భావాలు
చాలామందిలో లక్షణాలు తగ్గిపోయినప్పటికీ కొందరిలో మాత్రం వైరస్‌ ఊపిరితిత్తుల వరకు చేరి వైరల్‌ న్యూమోనియాకూ, ఇంకొందరిలో వైరల్‌ న్యూమనైటిస్‌కూ, ఇది మరికొందరిలో మరింత తీవ్రమైతే ఏఆర్‌డీఎస్‌ (అక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రేస్ సిండ్రోమ్‌) అనే తీవ్రమైన శ్వాస సమస్యలకూ దారితీయవచ్చు. అరుదుగా ఇంకా మరికొందరిలో గుండె కండరం కాస్తంత దెబ్బతిని గుండె కండరాల వాపు (మయోకార్డిటిస్‌) సమస్య రావచ్చు. ఇక ఈ ఫ్లూ ప్రభావం కారణంగా వ్యాధినిరోధక శక్తి కొద్దిగా తగ్గడం వల్ల మరికొందరిలో ఫ్లూ తర్వాత బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు కూడా ఉంటుంది.  

ఎప్పుడెప్పుడు కనిపిస్తుందంటే...  
మన దేశంలో హెచ్‌1ఎన్‌1 కేసులు సాధారణంగా రెండు సీజన్‌లలో ప్రధానంగా కనిపిస్తుంటాయి. మొదటిదశల్లో వర్షాకాలంలో అంటే... జూలై నుంచి అక్టోబర్‌ వరకు (ప్రస్తుతం ఈ స్పెల్‌ నడుస్తోంది) ఇక రెండో దశ చలికాలంలో అంటే... ప్రధానంగా డిసెంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు. ఆ టైమ్‌లో కూడా అప్రమత్తంగా ఉండటం అవసరం. సాధారణంగా సీజనల్‌ ఫీవర్‌లా వచ్చే ఈ ఫ్లూ పెద్దగా ప్రమాదకరం కాదుగానీ... మొదటి 48 గంటల పాటు చాలా అప్రమత్తంగా ఉండాలి. దాదాపు తేలిగ్గానే తగ్గిపోయే ఈ ఫ్లూ జ్వరం మాత్రం కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితికి దారితీయవచ్చు. అందుకే మొదటి 48 గంటల సమయం కూడా కీలకమని గుర్తించాలి.  

ఫ్లూ వ్యాప్తి ఇలా...  
ఈ ఫ్లూ జ్వరం తాలూకు వైరస్‌ గాలి ద్వారానే ఒకరి నుంచి మరో వ్యక్తికి వ్యాపిస్తుంటుంది. ప్రధానంగా వ్యాధి సోకిన బాధితుడు మాట్లాడుతున్నప్పుడు, దగ్గుతున్నప్పడు లేదా తుమ్మినప్పుడు బయటకు వచ్చే తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది.

పరోక్ష పద్ధతుల్లోనైతే... బాధితుడి తుంపర్లు డోర్‌ నాబ్స్‌ మీద లేదా వారు వాడిన ఫోన్‌ మీదగానీ లేదా వారు ముట్టుకున్న మెట్ల రెయిలింగ్స్‌ మీద పడ్డ తర్వాత, వేరొకరు వాటిని ముట్టుకున్నప్పుడు కూడా వైరస్‌ వ్యాపిస్తుంది. ఈ తరహా వ్యాప్తిని ‘ఫోమైట్‌’వ్యాప్తిగా చెబుతారు.  

వైరస్‌ సోకగానే లక్షణాలు బయటకు కనిపించకపోయినప్పటికీ... అప్పట్నుంచే వైరస్‌ అతడి నుంచి మరొకరికి వ్యాపించవచ్చు. అలాగే జ్వరం మొదలయ్యాక దాదాపు వారం రోజుల వరకు వైరస్‌ ఇతరులకు సోకే అవకాశం ఉంటుంది.

నివారణ మార్గాలు ఇలా.. 
కోవిడ్‌ సమయంలో పాటించిన జాగ్రత్తల వంటివి అంటే మాస్క్‌ పెట్టుకోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజర్స్‌ వాడటం వంటి జాగ్రత్తలు పాటించాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచడం, ఇంటి కిటికీలు తెరిచి గాలి సరిగా తిరిగేలా చేయడం ద్వారా మూసిన గదుల్లో వైరస్‌ వ్యాప్తి అవకాశాన్ని తగ్గించాలి. నీళ్లు, గోరు వెచ్చని సూప్, ఓఆర్‌ఎస్‌ వంటి ద్రవా­లు / ద్రవాహారాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. శరీరం డీహై­డ్రేట్‌ కాకుండా చూసుకోవాలి. ఊపిరితిత్తుల వ్యాధులు, గుండెజబ్బులు, డయాబెటిస్‌ బాధితుల వంటి వారు మరింత అప్రమత్తంగా ఉండటంతో పాటు ఫ్లూ నివారణ కోసం ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి.

జలుబుతో ఇవీ పోలికలు... 
ఈ ఫ్లూ జ్వరానికి సాధారణ జలుబుతోనూ కొన్ని పోలికలు కనిపిస్తుంటాయి. సాధారణ జలుబులోలాగే ఒళ్లునొప్పులూ కనిపించవచ్చు. అయితే మొదట్లో పొడి దగ్గు వస్తూ ఉన్నప్పటికీ క్రమంగా తర్వాత్తర్వాత కళ్లె పడటం, ముక్కునుంచి స్రావాలు రావడమూ కనిపిస్తుంది. దగ్గు కూడా వస్తుంటుంది. వీటితో పాటు మెడికల్‌ ఎమర్జెన్సీని సూచించే లక్షణాలు కూడా కనిపిస్తాయి. ప్రధానంగా శ్వాస వేగంగా తీసుకుంటూ ఉండడం, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, ఛాతీ లోపలికి లాగినట్లు అనిపించడం వంటి లక్షణాలుంటాయి. పెదవులు లేదా చర్మం నీలంగా మారడం, అయోమయం, తీవ్రమైన నీరసం/నిస్సత్తువ ఉంటాయి. జ్వరం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరగడం, పల్స్‌ ఆక్సిమీటర్‌లో ఆక్సిజన్‌ మోతాదులు వేగంగా తగ్గుతూ పోవడం  ఆక్సిజన్‌ తగ్గిన లక్షణాలు, రక్తపోటు (బీపీ) అకస్మాత్తుగా పడిపోవడం కళ్లె / తెమడలో రక్తపు చారిక కనిపించడం వంటివి కనిపిస్తాయి.

చికిత్స తీసుకోవడం తప్పనిసరి.. 
సాధారణంగా బాధితులు తీవ్రమైన జ్వరం, పొడి దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలుంటే డాక్టర్లను సంప్రదించాలి. ఇది వైరల్‌ ఫీవర్‌ కావడంతో దీనికి యాంటీబయాటిక్స్‌ పనిచేయవు. అందుకే ఈ సమస్యకు ‘ఒసెల్టామివిర్‌’(టామీ ఫ్లూ) అనే యాంటీ వైరల్‌ మందును ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని మొదటి 48 గంటలలోపు ఇవ్వడం వల్ల మంచి ప్రభావం ఉంటుంది. లక్షణాలు బలంగా కనిపిస్తూ సమస్యలు తీవ్రమైనప్పుడు ల్యాబ్‌ రిపోర్టు కోసం ఎదురుచూస్తూ చికిత్స ఆలస్యం చేయకూడదనే వైద్య మార్గదర్శకాలు ఉన్నందున తమ అనుభవంతో ఫ్లూను అనుమానించినప్పుడు డాక్టరు యాంటీ వైరల్‌ మందు ‘ఒసెల్టామివిర్‌’ను ఇస్తారు.

ఇదీ చ‌ద‌వండి: శానిటైజర్‌ మితిమీరి వాడడం.. చర్మానికి హానికరం

అయితే కొన్నిసార్లు అవసరాన్ని బట్టి డాక్టర్లు యాంటీబయాటిక్స్‌ను సూచిస్తారు. ఈ ఫ్లూ ప్రభావంతో వ్యాధినిరోధక శక్తి తగ్గడంతో బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌ సోకి వాటి లక్షణాలూ కనిపిస్తున్నప్పుడు యాంటీబయాటిక్స్‌ను సూచిస్తారు. జ్వరం, ఒళ్లునొప్పులు తగ్గడానికి పారాసిటమాల్‌ ఇస్తారు. దగ్గు తగ్గడానికి కాఫ్‌ సిరప్‌లను సూచిస్తారు. కొందరిలో ఫ్లూ తీవ్రంగా మారి, ఊపిరితిత్తులను ప్రభావితం చేయడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టమై, రక్తంలో ఆక్సిజన్‌ తగ్గి, ఐసీయూలో చేర్చాల్సిన పరిస్థితీ రావచ్చు. బాధితుల్లో ఆక్సిజన్‌ సాచ్యురేషన్‌ తగ్గినప్పుడు ఐసీయూలో చేర్చి ఆక్సిజన్‌ ఇవ్వాల్సిరావచ్చు. అందుకే పల్స్‌ ఆక్సిమీటర్‌లో ఆక్సిజన్‌ మోతాదు 94 శాతం కంటే తక్కువగా ఉంటే తక్షణం వైద్యులను సంప్రదించాలి.   
– సాక్షి హెల్త్‌ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement