హ్యాండ్‌ శానిటైజర్లు వాడుతున్నారా.. ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్పనిస‌రి | Alcohol Hand Sanitizer Causes Irritant Contact Dermatitis | Sakshi
Sakshi News home page

శానిటైజర్‌ మితిమీరి వాడడం.. చర్మానికి హానికరం

Sep 9 2026 9:07 PM | Updated on Sep 9 2026 9:07 PM

Alcohol Hand Sanitizer Causes Irritant Contact Dermatitis

హ్యాండ్‌ శానిటైజర్లు ముఖ్యంగా ఆల్కహాల్‌ (ఎథనాల్‌ లేదా ఐసోప్రొపనాల్‌) ఆధారంగా పనిచేస్తాయి. కరోనా మహమ్మారి తర్వాత వీటి వాడకం విపరీతంగా పెరిగింది. అయితే, వీటిని రోజూ పదే పదే వాడటం వల్ల ఆరోగ్యానికి కొన్ని నష్టాలు ఉన్నాయని చర్మవ్యాధి నిపుణులు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

చర్మం దెబ్బతినడం: 
శానిటైజర్లలో ఉండే ఆల్కహాల్‌ చర్మంలోని సహజమైన నూనెలను (నాచురల్‌ ఆయిల్స్‌), తేమను తొలగిస్తుంది. దీనివల్ల చర్మం పొడిబారడం, పగలడం, మంట పుట్టడంతోపాటు ’కాంటాక్ట్‌ డెర్మటైటిస్‌’చర్మ సమస్యకు దారి తీస్తుంది. చర్మంలో పగుళ్లు ఏర్పడితే దేహంలోకి బ్యాక్టీరియా సులభంగా ప్రవేశిస్తుంది. ఇతర అనారోగ్యాలకు మార్గం చూపించినట్లవుతుంది. 
    
మంచి బ్యాక్టీరియా నశించడాన్ని డిస్‌రప్షన్‌ ఆఫ్‌ స్కిన్‌ మైక్రోబియోమ్‌ అంటారు. చర్మం మీద సహజంగా దేహానికి రక్షణనిచ్చే మంచి బ్యాక్టీరియా (మైక్రోబియోమ్‌) ఉంటుంది. శానిటైజర్ల వల్ల ఈ సూక్ష్మజీవులు నశిస్తాయి. రోగనిరోధక శక్తి తగ్గి, చర్మానికి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం పెరుగుతుంది. 
    
యాంటీబయోటిక్‌ రెసిస్టెన్స్‌: 
కొన్ని రకాల శానిటైజర్లలో ‘ట్రిక్లోసన్‌’ వంటి రసాయనాలను వాడతారు. వీటిని నిరంతరం వాడటం వల్ల సూక్ష్మజీవులు ఆ రసాయనాలకు అలవాటు పడిపోయి, భవిష్యత్తులో ఏ మందుకూ లొంగని శక్తిని (సూపర్‌బగ్స్‌) సంతరించుకుంటాయని కొన్ని పరిశోధనలు తేల్చాయి. 
    
హార్మోన్ల అసమతుల్యత: 
శానిటైజర్లలో వాడే కృత్రిమ సువాసనలు, కొన్ని రసాయనాలు ఎండోక్రైన్‌ వ్యవస్థను దెబ్బతీస్తాయి. హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసే ప్రమాదాన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. 
    
చర్మం మీది రసాయనాలు కడుపులోకి: 
పిల్లలు శానిటైజర్లు వాడిన వెంటనే చేతులు నోట్లో పెట్టుకోవడం వల్ల రసాయనాలు కడుపులోకి చేరతాయి. చర్మానికి పీల్చుకునే గుణం ఉండడం ద్వారా ఆల్కహాల్‌ ఇతర రసాయనాలు చర్మం ద్వారా దేహంలోకి ప్రవేశించి రక్తంలో కలుస్తాయి.

పొంచి ఉన్న ప్రమాదాలు! 
వంట చేసేటప్పుడు, మంటకు దగ్గరగా ఉన్నప్పుడు శానిటైజర్‌ వాడడం ప్రమాదకరం. శానిటైజర్లలో ఆల్కహాల్‌ అధికంగా ఉంటుంది కాబట్టి, ఇది అత్యంత వేగంగా మంటను అంటుకుంటుంది. వంటగదిలో స్టవ్‌ వెలిగించే ముందు, అగ్గిపెట్టె వాడే ముందు చేతులకు శానిటైజర్‌ రాసు కుని ఉంటే అది పూర్తిగా ఆరిపోయే వరకు వేచి ఉండాలి. 

ఇదీ చ‌ద‌వండి: రేడియేష‌న్ థెర‌ఫీ అంటే ఏమిటి?
    
శానిటైజర్‌ కళ్ళకు, ముక్కుకు, నోటికి తగలరాదు. శానిటైజర్‌ రాసుకున్న వెంటనే ఆ చేతులతో ముఖాన్ని, కళ్లను తాకకూడదు. కళ్లలోకి, నోటిలోకి శానిటైజర్‌ వెళితే తీవ్రమైన మంట, చికాకుతోపాటు అలెర్జీ సమస్యలు తలెత్తుతాయి.

సబ్బు ఎల్లప్పుడూ శుభ్రం! 
చేతులను శుభ్రం చేసుకోవడానికి ఎల్లప్పుడూ శానిటైజర్లపైనే ఆధారపడకుండా, వీలైనప్పుడల్లా సబ్బు, నీటితో కనీసం 20 సెకండ్ల పాటు చేతులు కడుక్కోవడం ఉత్తమం. చేతులు మరీ మురికిగా ఉన్నప్పుడు లేదా సబ్బునీటితో కడుక్కోవడానికి వీల్లేనప్పుడు మాత్రమే శానిటైజర్‌ వాడాలి. శానిటైజర్‌ వాడిన తర్వాత చర్మం పొడిబారకుండా మంచి మాయిశ్చరైజర్‌ లేదా కొబ్బరినూనె, నువ్వుల నూనె వంటివి రాసుకోవడం మంచిది. 
– సాక్షి, స్పెషల్ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement