సాక్షి,హైదరాబాద్: యూకే వీసా స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి పరారీలో ఉన్న ప్రముఖ యూట్యూబర్ నందనను శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన నందన దంపతులపై గతంలోనే కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమెపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆమె కదలికలను గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు, పోలీసులు అప్రమత్తమై ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
లండన్‌లో పర్మినెంట్ ఉద్యోగాలు, భారీ వేతనాలు ఇప్పిస్తామని నందన దంపతులు పలువురికి ఆశ చూపారు. ఈ నకిలీ ఉద్యోగాల ఆశతో నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. లుకౌట్ నోటీసులు జారీ కావడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న అనంతరం, ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ నిమిత్తం పోలీసులు ఆమెను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. ఈ మోసంలో ఆమె భర్త మధుకర్ పాత్రపై కూడా పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. నందనపై ఉన్న కేసులు, లుక్‌అవుట్ నోటీసుల ఆధారంగా పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు.
👉ఇదీ చదవండి : నందూస్ వరల్డ్‌లో ఏం జరుగుతోంది?


