ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గోసంపల్లి గ్రామంలో తల్లిని కోల్పోయిన ముగ్గురు ఆడబిడ్డలకు ఊరే కుటుంబమైంది. భవిష్యత్తుకు అండగా నిలిచిన గ్రామస్తులు మానవత్వం చాటుకున్నారు. గ్రామంలోని ప్రతీ ఇంటి నుంచి చందాలు సేకరించి సుమారు రూ.10 లక్షలు సమకూర్చి ఆడబిడ్డలకు ఆదివారం అందజేశారు.
అకస్మిక మరణంతో దయనీయ పరిస్థితి..
సంపల్లి గ్రామానికి చెందిన ఈబిది గంగారం–లక్ష్మికి ముగ్గురు కూతుళ్లు సంతానం. పెద్ద కూతురు జ్యోతి డిగ్రీ పూర్తి చేసింది. రెండో కుమార్తె నాగమణి ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుండగా, చిన్న కూతురు సరస్వతి పదో తరగతి పూర్తి చేసింది. నాలుగు రోజుల క్రితం లక్ష్మికి ఫిట్స్ రావడంతో తీవ్ర అస్వస్థతకుగురై మృతి చెందింది. దీంతో కూతుళ్లు తల్లిలేనివారయ్యారు. బాధిత కుటుంబానికి సొంత ఇల్లు, భూమి, స్థిరమైన ఉపాధి లేకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది.
గ్రామమే కుటుంబంగా..
తల్లి మృతితో తీవ్ర విషాదంలో ఉన్న తమ కుటుంబానికి గ్రామమంతా ఒక్కటై అండగా నిలవడం ఎప్పటికీ మరిచిపోలేమని లక్ష్మి కుమార్తెలు, కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నారుల భవిష్యత్తుకు తోడుగా నిలిచిన సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, బేడ బుడగ జంగం కుల పెద్దలు, నాయకులు, దాతలు, గ్రామంలోని ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు.
ఇంటింటా చందాలు..
లక్ష్మి మృతి, ఎదిగిన కూతుళ్లు దిక్కులేనివారుకావడంతో గ్రామమే వారికి కుటుంబంగా అండగా నిలిచింది. సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, బేడ బుడగ జంగం కుల పెద్దలు, వివిధ పార్టీల నాయకులతోపాటు గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించారు. ఇంటింటికీ వెళ్లి చందాలు సేకరించగా పలువురు రూ.10 వేలు, రూ.20 వేలు, రూ.30 వేల చొప్పున విరాళాలు అందించారు. దీంతో సుమారు రూ.10 లక్షలు సమకూరాయి. ఈ మొత్తాన్ని ముగ్గురు కుమార్తెల చదువు, భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకోవాలని కుటుంబ సభ్యులకు సూ చించారు.
మరో రూ.10 లక్షల సాయం లక్ష్యం
కుటుంబానికి సొంత ఇల్లు, స్థలం కూడా లేకపోవడంతో మరో రూ.10 లక్షలు సమకూర్చి మరింత భరోసా కల్పించాలని గ్రామస్తులు సంకల్పించారు. దాతలు ముందుకు వచ్చి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. తల్లిని కోల్పోయిన ముగ్గురు ఆడబిడ్డల పరిస్థితిని ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిశీలించి ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కోరారు. ప్రభుత్వ పథకాల ద్వారా ఇంటి స్థలం, గృహం కల్పించడంతోపాటు పిల్లల చదువు, భవిష్యత్తుకు ఆర్థిక చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు.
చదవండి: రూ. 3 లక్షల బ్యాగును అప్పగించిన మహిళా కండక్టర్ : నెటిజన్లు ఫిదా


