అమృత్‌సర్: పంజాబ్‌లోని గురు రామ్‌దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం రాత్రి అనుమానాస్పద డ్రోన్లు కనిపించడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. విమానాశ్రయ రన్‌వే సమీపంలో నాలుగు అనుమానాస్పద డ్రోన్లు లేదా డ్రోన్లను పోలిన ఎగిరే వస్తువులను గుర్తించినట్లు సమాచారం. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) హై అలర్ట్ ప్రకటించింది. రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం. రాజాలా గ్రామం వైపు నుంచి అనుమానాస్పద డ్రోన్లు విమానాశ్రయం వైపు వచ్చినట్లు తెలుస్తోంది. అవి రన్‌వేతోపాటు ఇతర సున్నిత ప్రాంతాలపై కొన్ని నిమిషాలపాటు సంచరించినట్లు సమాచారం.
ఏడు విమానాలు దారి మళ్లింపు
ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా అమృత్‌సర్‌కు వస్తున్న ఏడు విమానాలను ఢిల్లీ, చండీగఢ్‌కు దారి మళ్లించారు. వాటిలో కౌలాలంపూర్–అమృత్‌సర్ మలేషియా ఎయిర్‌లైన్స్ (MH-118) విమానాన్ని ఢిల్లీకి మళ్లించారు. ముంబై–అమృత్‌సర్ (6E-5028), ఢిల్లీ–అమృత్‌సర్ (6E-2045) ఇండిగో విమానాలను చండీగఢ్‌కు మళ్లించారు. ఢిల్లీ–అమృత్‌సర్ ఎయిర్ ఇండియా (AI-479) విమానాన్ని ఢిల్లీకి మళ్లించగా, మరో ఎయిర్ ఇండియా (AI-855) విమానం ఢిల్లీకి తిరిగి వెళ్లింది. షార్జా–అమృత్‌సర్ ఇండిగో (6E-1428), ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (IX-138) విమానాలను ఢిల్లీకి మళ్లించారు.
భారత్–పాక్ సరిహద్దుకు సమీపంలో..
అమృత్‌సర్ నగరానికి సుమారు 11 కిలోమీటర్ల దూరంలోని రాజా సాన్సీలో ఈ విమానాశ్రయం ఉంది. పంజాబ్‌లో ఇది అతిపెద్దదైన, రద్దీగా ఉండే విమానాశ్రయం. భారత్–పాకిస్థాన్ సరిహద్దుకు గగన మార్గంలో 30 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉండటంతో భద్రతాపరంగా దీని స్థానం కీలకంగా మారింది.
ఎల్‌ఓసీ వద్ద గతంలోనూ డ్రోన్ల కదలిక
గత ఆగస్టులో జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో పాకిస్థాన్‌కు చెందిన అనుమానిత డ్రోన్ల కదలికలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నౌషెరా సెక్టార్‌లోని రుమ్లీధారా ప్రాంతం సమీపంలో మూడు డ్రోన్లు భారత గగనతలంలోకి ప్రవేశించాయి. 22వ జమ్ముకశ్మీర్ రైఫిల్స్ దళాలు వాటిని గుర్తించడంతో కౌంటర్-డ్రోన్ వ్యవస్థలను వెంటనే మోహరించారు. దీంతో మూడు డ్రోన్లు వెనుదిరిగినట్లు సమాచారం. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లోకి బాక్సింగ్ దిగ్గజం.. వణికిపోతున్న పోటీదారులు!


