న్యూఢిల్లీ: కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఢిల్లీలో జనజీవనం స్తంభించింది. ప్రతికూల వాతావరణం, లో-విజిబిలిటీ (కనిపించే సామర్థ్యం తగ్గడం) వల్ల విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఢిల్లీ విమానాశ్రయంలో దిగాల్సిన 15 విమానాలను అధికారులు అత్యవసరంగా ఇతర నగరాలకు దారి మళ్లించారు.
జైపూర్ 12, చండీగఢ్ రెండు, లక్నో ఒక విమానాన్ని దారి మళ్లిచంగా.. ట్రాఫిక్ నియంత్రణ, ప్రతికూల వాతావరణం వల్ల విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌లలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో పలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.
మరోవైపు రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే గంటల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఢిల్లీ పరిసర ప్రాంతాలకు వాతావరణ శాఖ ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. ప్రయాణికులు తమ విమాన సమయాల గురించి సంబంధిత ఎయిర్‌లైన్స్ సంస్థలను సంప్రదించి బయలుదేరాలని అధికారులు సూచించారు.


