న్యూఢిల్లీ: ఢిల్లీలో హఠాత్తుగా పెద్ద సంఖ్యలో హెచ్1ఎన్1( స్వైన్‌ఫ్లూ) కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2,300 ఇన్‌ఫ్లుయెంజా–ఏ కేసులు నమోదయ్యాయి. వీటిలో హెచ్1ఎన్1 కేసులు 1,777 ఉన్నాయి. గురువారం ఒక్కరోజే ఏకంగా 114 హెచ్1ఎన్1 కేసులు బయటపడటం ఆందోళన రేకెత్తిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దంతో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మాస్‌్కలను ధరించాలని, జనసమ్మర్థం ఉండే చోట్లకు వెళ్లవద్దని, పరిశుభ్రత పాటించాలని, వైద్యుల సలహా తీసుకోవాలని ప్రజలకు సూచించింది.
ఈ విషయమై కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా తాజా పరిస్థితిపై సమీక్ష జరిపారు. హెచ్1ఎన్1 వైరస్ వ్యాప్తి, ఔషధాల లభ్యత వంటి వాటిపై వివరాలను ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను అడిగి తెల్సుకున్నారు. నిఘా, సన్నద్దతపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో పెరుగుతున్న హెచ్1ఎన్1 కేసులపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) స్పందించింది. ఈ కేసుల్లో కొత్త వేరియెంట్ ఏదీ బయటపడలేదని తెలిపింది. అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదని భరోసా ఇచ్చింది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న ఇన్‌ఫ్లుయెంజా రకాలకు సిఫార్సు చేసిన వ్యాక్సిన్ రకాలు సరిగ్గా పనిచేస్తాయని పేర్కొంది.


