మళ్లీ పార్లమెంట్‌ సమావేశాలు!  | Special Parliament Session for Delimitation and Womens Reservation Bills | Sakshi
Sakshi News home page

మళ్లీ పార్లమెంట్‌ సమావేశాలు! 

Aug 24 2026 5:10 AM | Updated on Aug 24 2026 5:10 AM

Special Parliament Session for Delimitation and Womens Reservation Bills

రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడతారని ప్రచారం   

వర్షాకాల సమావేశాలను ఇంకా ప్రోరోగ్‌ చేయని ప్రభుత్వం

న్యూఢిల్లీ: ప్రత్యేకంగా పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహించి, కీలకమైన బిల్లును ఆమోదింపజేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేసిన పది రోజుల తర్వాత కూడా సమావేశాలు ఇంకా అధికారికంగా ముగియలేదు. సాధారణంగా సభను నిరవధికంగా వాయిదా వేసిన తర్వాత అధికారికంగా ముగిసినట్లు(ప్రోరోగ్‌) నాలుగైదు రోజుల్లోగా ప్రకటిస్తారు. 

కానీ, ఈసారి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆదివారం ఉదయం వరకు వర్షాకాల సమావేశాల ముగింపునకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్‌ జారీ కాలేదు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఏప్రిల్‌ 18న నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఏప్రిల్‌ 20న ప్రోరోగ్‌ చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సిఫార్సు మేరకు రాష్ట్రపతి పార్లమెంట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు, ప్రోరోగ్‌ చేస్తారు. 2029 పార్లమెంటరీ ఎన్నికలకు ముందే మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని సవరించే బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకురావచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఈ బిల్లును ఆమోదింపజేయడానికి బడ్జెట్‌ సమావేశాల సమయంలోనే ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేదు. ప్రభుత్వానికి అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో బిల్లు వీగిపోయింది. స్వాతంత్య్ర దినోత్సవం తర్వాత ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం కోరవచ్చన్న సంకేతాలు కనిపించాయి. వర్షాకాల సమావేశాలు ఇంకా అధికారికంగా ముగియని నేపథ్యంలో ఉభయ సభలను ప్రత్యేకంగా కొలువుదీర్చి రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడతారన్న ప్రచారం సాగుతోంది.

డీలిమిటేషన్‌ బిల్లును ఆమోదింపజేయడానికి కుట్రలు: జైరామ్‌ రమేశ్‌
న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను అధికారికంగా ముగించడంలో జరుగుతున్న జాప్యం వెనుక కారణం ఏమిటని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ నిలదీశారు. నియోజకవర్గాల పునరి్వభజనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రత్యేక సమావేశంలో ఆమోదింపజేసుకోవడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఇప్పటికీ మూడింట రెండొంతుల మెజారిటీ కోసం ప్రయత్నిస్తున్నారా? అని ప్రశ్నించారు. 

లోక్‌సభ నిరవధిక వాయిదాకు, దాని అధికారిక ముగింపుకు మధ్య సాధారణంగా రెండు నుంచి నాలుగు రోజుల వ్యవధి ఉంటుందని గుర్తుచేశారు. అయితే వాయిదా, అధికారిక ముగింపు రెండూ ఒకే రోజున జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. గతంలో నిరవధిక వాయిదాకు, అధికారిక ముగింపుకు మధ్య చాలా వ్యవధి ఉన్నప్పటికీ అప్పటి పాలకులు ఎలాంటి కుట్రలు చేయలేదని పేర్కొన్నారు. ఈ మేరకు జైరామ్‌ రమేశ్‌ తాజాగా ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. ఈసారి లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేసి పది రోజులు గడిచినా, దాని అధికారిక ముగింపుపై ఇప్పటికీ ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. 

ఈ అసాధారణ జాప్యానికి కారణమేమిటి? అని అన్నారు. డీలిమిటేషన్‌ బిల్లును ఆమోదింపజేయడానికి అమిత్‌ షా కుట్రలు చేస్తున్నట్లు పరోక్షంగా అనుమానం వ్యక్తంచేశారు. లోక్‌సభ, రాజ్యసభ ఈనెల 13న నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. వర్షాకాల సమావేశాలు అధికారికంగా ముగిసినట్లు ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. సభను వాయిదా వేసే ప్రక్రియను తెలియజేయడానికి ఎం.ఎన్‌.కౌల్, ఎస్‌.ఎల్‌.షక్దర్‌ రచించిన ‘ప్రాక్టీస్‌ అండ్‌ ప్రొసీజర్‌ ఆఫ్‌ పార్లమెంట్‌’పుస్తకంలోని ఒక పేజీ స్క్రీన్‌షాట్‌ను జైరామ్‌ రమేశ్‌ షేర్‌ చేశారు. 

ఆర్టికల్‌ 85(2) కింద రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వు ద్వారా పార్లమెంట్‌ సమావేశాలను అధికారికంగా ముగించడాన్ని ప్రొరోగేషన్‌ అంటారు. సభను ప్రొరోగ్‌ చేసే అధికారాన్ని వినియోగించేటప్పుడు రాష్ట్రపతి.. ప్రధానమంత్రి సలహా మేరకు వ్యవహరిస్తారు. రాష్ట్రపతికి సలహా సమర్పించే ముందు ప్రధానమంత్రి తన మంత్రివర్గాన్ని సంప్రదించవచ్చు. లోక్‌సభలో ప్రస్తుత సీట్ల సంఖ్యను 25 ఏళ్లపాటు స్తంభింపజేయాలని, 2029 లోక్‌సభ ఎన్నికల నుంచి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement