కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై మల్లికార్జున ఖర్గే ఆగ్రహం
మోదీ ప్రభుత్వం, బీజేపీ విభజన రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజం
కలబురిగి: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, బీజేపీ విభజన రాజకీయాలు చేస్తున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి జాతీయ నేతలు నిర్ణయించిన వందేమాతరం వెర్షన్‌నే కాంగ్రెస్ అనుసరిస్తోందని చెప్పారు. వందేమాతరం సంక్షిప్త రూపంపై నిర్ణయం తీసుకున్న జాతీయ నేతలు కూడా దేశద్రోహులేనా? అని ప్రశ్నించారు.
వందేమాతరం గీతాన్ని కేవలం రెండు చరణాలు మాత్రమే పాడాలన్న నిర్ణయం దేశ వ్యతిరేకమైనదని, చట్టాన్ని ధిక్కరించి ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకోవడమే కాంగ్రెస్ లక్ష్యమంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన విమర్శలను ఖర్గే తిప్పికొట్టారు. శనివారం కర్ణాటకలోని కలబురిగిలో మీడియాతో మాట్లాడారు. చరిత్ర చదవాలని అమిత్ షాకు సూచించారు.
పండిట్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్ తదితరులు కలిసి వందేమాతరం గీతాన్ని ఆరు చరణాల నుండి రెండు చరణాలకు తగ్గించాలని 1937లో నిర్ణయించారని తెలిపారు. మనమంతా గత 90 ఏళ్లుగా రెండు చరణాలు ఆలపిస్తున్నామని చెప్పారు. 90 ఏళ్లుగా లేని సమస్యను ఇప్పుడు ఎందుకు లేవనెత్తుతున్నారని మండిపడ్డారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం ఆరు చరణాలు ఎందుకు ఆలపించలేదని నిలదీశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇన్నాళ్లూ ఈ విషయం ఎందుకు పట్టించుకోలేదని అన్నారు. అవసరమైనప్పుడల్లా కొత్త సమస్యలను తెరపైకి తేవడమే బీజేపీ విధానమని ధ్వజమెత్తారు.
దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి
వందేమాతరం గీతాన్ని ఆలపించడానికి కాంగ్రెస్ ఎన్నడూ వ్యతిరేకం కాదని మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. జనగణమన గేయాన్ని ఆలపించినట్లే తమ పార్టీ, సేవాదళ్ ఎన్నో ఏళ్లుగా వందేమాతరం గీతాన్ని ఆలపిస్తున్నాయని గుర్తుచేశారు. జనగణమన కూడా ఐదు చరణాలతో దీర్ఘంగా ఉండేదని, నేడు ఒక చరణాన్ని మాత్రమే పాడుతున్నారని తెలియజేశారు. దీనిని గేయ రచయిత రవీంద్రనాథ్ టాగోర్ కూడా ఆమోదించారని చెప్పారు. వందేమాతరంలో రెండు చరణాలు, జన గణ మనలో ఒక చరణం ఉన్నాయని, రెండింటికీ ఒకే సమయం పడుతుందని స్పష్టంచేశారు. జాతీయ నేతలు నిర్ణయించిన దానినే మనం ఈరోజు పాడుతున్నామని, వారు చెప్పినట్లు మనం పాడితే మనం దేశద్రోహులమా? అని ప్రశ్నించారు.


