న్యూఢిల్లీ: అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేసుకుని, ప్రతిష్టాత్మక సంస్థలో ఉద్యోగం సాధించినప్పటికీ వీసా అనిశ్చితి కారణంగా జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నానని భారతీయ టెక్కీ మధుర్ మెహతా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన వ్యాపార వార్తా పోర్టల్ ‘బిజినెస్ ఇన్‌సైడర్’లో రాసిన కథనాన్ని ‘హిందుస్థాన్ టైమ్స్’ నివేదిక ప్రచురించింది. మధుర్ మెహతా 2021 ఆగస్టులో మాస్టర్స్ చదివేందుకు అమెరికా వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్ నుంచి 2023లో డిగ్రీ పూర్తి చేసిన అనంతరం, 2025లో అమెజాన్‌లో ప్రోగ్రామ్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఆ సంస్థ ఆయన హెచ్-1బీ వీసా స్పాన్సర్‌షిప్ ప్రక్రియను ప్రారంభించింది. 2026 మార్చిలో నిర్వహించిన హెచ్-1బీ లాటరీలో ఆయన ఎంపిక కావడంతో మూడేళ్ల పాటు అక్కడ పనిచేసే అవకాశం లభించింది. హెచ్-1బీ లభించినా భవిష్యత్తుపై ఆందోళనలు తొలగిపోలేదని మెహతా తెలిపారు. ఆయన కాబోయే భార్యకు హెచ్-1బీ లాటరీలో చివరి అవకాశం మాత్రమే మిగిలి ఉందని, ఆమె ఎంపిక కాకపోతే ఉద్యోగ అనుమతి లేని హెచ్-4 డిపెండెంట్ వీసాపై ఆధారపడాల్సి వస్తుందని పేర్కొన్నారు.
ఇద్దరి వీసా పరిస్థితులు స్థిరపడే వరకు ఇల్లు కొనడం, వివాహం చేసుకుని కుటుంబాన్ని ప్రారంభించడం వంటి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకోలేకపోతున్నామని వివరించారు. భారత్‌లో ఉన్న తల్లిదండ్రులకు అత్యవసర పరిస్థితులు ఎదురైనా వీసా స్టాంపింగ్ నిబంధనల వల్ల ప్రయాణాలు సంక్లిష్టమవుతాయని మెహతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అనిశ్చితికి శాశ్వత పరిష్కారంగా ఈబీ-1ఏ (EB-1A) వీసా సాధించే మార్గాలను, అలాగే కెనడా, ఐరోపా దేశాల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: సంక్షేమ పథకానికి తూట్లు.. అనర్హుల ఖాతాల్లోకి రూ. 9,605 కోట్లు!


