భారత్‌లో ఎన్నికలట!.. సోయి లేకుండా ట్రంప్‌ పోస్ట్‌ | Trumps India Election Blunder Sparks Massive Trolls Online | Sakshi
Sakshi News home page

భారత్‌లో ఎన్నికలట!.. సోయి లేకుండా ట్రంప్‌ పోస్ట్‌

Oct 5 2026 11:22 AM | Updated on Oct 5 2026 11:30 AM

Trumps India Election Blunder Sparks Massive Trolls Online

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోషల్‌ మీడియా సందేశాలను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పరిశీలిస్తుంటారు. అయితే తాజాగా ఆయన చేసిన ఓ పోస్ట్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమెరికా ఎన్నికల వ్యవస్థను విమర్శించే క్రమంలో.. భారత్‌ను ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తితో పాటు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. దీంతో సోషల్‌ మీడియాలో నెటిజన్లు ట్రంప్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్నారు.

ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ ఖాతాలో.. 125 మిలియన్ల మంది ఈరోజు భారత్‌ అధ్యక్ష ఎన్నికల తొలి దశలో ఓటేశారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే అదే రోజు ఫలితాలు వచ్చాయి అని రాశారు. అయితే ఆ రోజు మన దేశంలో ఎలాంటి ఎన్నికలు జరగలేదు కదా!. పైగా మన దేశంలో అధ్యక్షుడు(రాష్ట్రపతి)ని జనాలు కాదు కదా ఎన్నుకునేది. అయితే ఆయన పేర్కొన్న 125 మిలియన్ల ఓట్ల సంఖ్య కూడా మరో దేశంలో జరిగిన ఎన్నికల గణాంకాలకు దగ్గరగా ఉండటం ఇప్పుడు అసలు ట్విస్ట్‌గా మారింది.

ట్రంప్‌ పేర్కొన్న 125 మిలియన్ల సంఖ్య ఎక్కడి నుంచి వచ్చిందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే తాజాగా జరిగిన బ్రెజిల్‌ అధ్యక్ష ఎన్నికల్లో(తొలి దశ) మొత్తం 125,272,513 చెల్లుబాటు అయ్యే ఓట్లు నమోదయ్యాయి. సో.. ఈ సంఖ్య ట్రంప్‌ తన పోస్ట్‌లో పేర్కొన్న 125 మిలియన్లకు అత్యంత దగ్గరగా ఉంది. దీంతో బ్రెజిల్‌ ఎన్నికల గణాంకాలను భారత్‌కు ఆపాదిస్తూ ట్రంప్‌ పోస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉండటంతో సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ మొదలైంది. ముఖ్యంగా భారత్‌లో రాష్ట్రపతి ఎన్నిక ప్రత్యక్ష ప్రజా ఓటుతో జరగదన్న విషయాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తూ ట్రంప్‌ పోస్ట్‌పై సెటైర్లు వేస్తున్నారు.

బ్రెజిల్‌లో ఏం జరిగింది?
అక్టోబర్‌ 4న బ్రెజిల్‌లో అధ్యక్ష ఎన్నికల తొలి దశ పోలింగ్‌ జరిగింది. ఇందులో ప్రస్తుత అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లులా డా సిల్వా, సెనేటర్‌ ఫ్లావియో బొల్సొనారో(మాజీ అధ్యక్షుడు జైర్‌ బొల్సోనారో కొడుకు) రెండో దశకు చేరుకున్నారు. దాదాపు పూర్తి ఫలితాల ప్రకారం ఫ్లావియో బొల్సొనారోకు 47.03 శాతం, లులాకు 45.16 శాతం ఓట్లు వచ్చాయి. ఎవరికీ 50 శాతానికి పైగా ఓట్లు రాకపోవడంతో అక్టోబర్‌ 25న రెండో దశ పోలింగ్‌ జరగనుంది.

భారత అధ్యక్షుడి ఎన్నిక ఎలాగంటే.. 
భారత్‌లో రాష్ట్రపతిని ప్రజలు నేరుగా ఓటు వేసి ఎన్నుకోరు. ఎన్నికైన ఎంపీలు, రాష్ట్రాలు, ఢిల్లీ, పుదుచ్చేరి శాసనసభల్లోని ఎన్నికైన సభ్యులతో కూడిన ఎలక్టోరల్‌ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియలో సింగిల్‌ ట్రాన్స్‌ఫరబుల్‌ ఓటు విధానాన్ని, రహస్య బ్యాలెట్‌ను ఉపయోగిస్తారు.

అంటే బ్రెజిల్‌, అమెరికా వంటి దేశాల్లో జరిగే ప్రత్యక్ష ప్రజా ఓటుతో అధ్యక్షుడిని ఎన్నుకునే విధానానికి భారత్‌ రాష్ట్రపతి ఎన్నిక పూర్తిగా భిన్నం. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ప్రస్తావించిన ‘‘భారత్‌ అధ్యక్ష ఎన్నికల తొలి దశ’’ అన్న విషయమే వాస్తవ పరిస్థితికి సరిపోలడం లేదు.

అమెరికా ఎన్నికలపైనా ట్రంప్‌ విమర్శలు
భారత్‌ ఎన్నికలను ప్రస్తావించిన ట్రంప్‌.. ఇదే పోస్టులో అమెరికా ఎన్నికల వ్యవస్థపైనా విమర్శలు చేశారు. డెట్రాయిట్‌, ఫిలడెల్ఫియా, కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపునకు వారాలు పడుతున్నాయని పేర్కొన్నారు. ‘‘వోటింగ్‌ ఇన్‌ అమెరికా ఈజ్‌ కరప్ట్‌’’ అంటూ ఆరోపించారు. 

గతంలో భారత్‌ ఎన్నికలపై ప్రశంసలు
ఇదిలా ఉండగా.. ట్రంప్‌ గతంలో మాత్రం భారత్‌ ఎన్నికల విధానాన్ని ప్రస్తావించారు. ఆగస్టులో అమెరికాలో ఓటర్‌ గుర్తింపు నిబంధనలను కఠినతరం చేయాలన్న వాదనకు మద్దతుగా భారత్‌లోని ఓటర్‌ కార్డు వ్యవస్థను ఉదాహరణగా పేర్కొన్నారు. భారత్‌లో భారీ సంఖ్యలో ప్రజలు ఓటు వేసినా పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగం చాలా తక్కువగా ఉందని అప్పట్లో వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: అమెరికాకు ఆ రెండు దేశాల నుంచి బిగ్‌ చాలెంజ్‌!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement