చంద్రుడిపై శాశ్వత స్థావరాలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో అగ్రరాజ్యాలు కీలక అడుగు వేస్తున్నాయి. భవిష్యత్తులో చంద్రుడిపై పరిశోధనలు, వనరుల అన్వేషణతో పాటు మరింత దూరంలోని అంతరిక్ష మిషన్లకు అక్కడి నుంచి మద్దతు అందించేందుకు అణు విద్యుత్ కీలకంగా మారుతుందని అమెరికా, చైనా, రష్యా భావిస్తున్నాయి. దీంతో చంద్రుడిపై అణు రియాక్టర్లను ఏర్పాటు చేసేందుకు ఈ మూడు దేశాల మధ్య పోటీ మొదలైంది. భవిష్యత్ అంతరిక్ష ఆధిపత్యంలో ఈ అణు రేసు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.
అణు రియాక్టర్ ఎందుకు?
చంద్రుడిపై శాశ్వత స్థావరం ఏర్పాటు చేయాలంటే నిరంతర విద్యుత్ అవసరం. ప్రస్తుతం సౌర విద్యుత్ ఒక ప్రధాన మార్గమైనప్పటికీ.. చంద్రుడిపై దాదాపు రెండు వారాలకు పైగా రాత్రి కొనసాగుతుంది. దీంతో కేవలం సౌరశక్తిపైనే ఆధారపడటం కష్టమవుతుంది. అణు రియాక్టర్లు సూర్యకాంతి అవసరం లేకుండా ఎక్కువ కాలం విద్యుత్‌ను అందించగలవు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఆగస్టులో కాంట్రాక్టర్లను సంప్రదించి.. అంతరిక్ష ప్రయాణాన్ని తట్టుకుని, చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో మానవ జోక్యం లేకుండా పనిచేయగల అణు రియాక్టర్‌ను సిద్ధం చేయాలని కోరినట్లు ది న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. దీనిని 2030 డిసెంబర్ నాటి ప్రయోగానికి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నాసా ప్రతిపాదించిన Lunar Reactor-1 సుమారు 20 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ.. దాదాపు ఐదేళ్లపాటు మానవ జోక్యం లేకుండా పనిచేసేలా రూపొందించనున్నారు.
ఇక, రష్యా కూడా చైనాతో కలిసి Selena పేరుతో చంద్రుడిపై అణు రియాక్టర్‌ను అభివృద్ధి చేయాలని చూస్తోంది. 2036 నాటికి దీనిని సిద్ధం చేయాలని రష్యా లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. చైనా నేతృత్వంలోని చంద్ర స్థావరాలకు విద్యుత్ అందించడమే దీని ఉద్దేశం. ఈ రియాక్టర్ 10 కిలోవాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దాదాపు పదేళ్లపాటు స్వయంచాలకంగా పనిచేసేలా రూపొందించనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
అణు విద్యుత్‌తో ప్రయోజనాలు..
ప్రారంభ దశలో అమెరికా, చైనా సౌర విద్యుత్, రేడియోఐసోటోప్ వ్యవస్థలను ఉపయోగించి పరికరాలను పనిచేయించడం, చంద్ర వాహనాలకు శక్తిని అందించడం వంటి పనులు చేయాలని భావిస్తున్నాయి. అయితే భవిష్యత్తులో పెద్ద స్థావరాలు ఏర్పడితే మరింత ఎక్కువ విద్యుత్ అవసరం కానుంది. ఆ అవసరాన్ని అణు రియాక్టర్లు తీర్చగలవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే చంద్రుడిపై అణు రియాక్టర్ల ఏర్పాటుపై భద్రతా ఆందోళనలు కూడా ఉన్నాయి. రియాక్టర్‌ను తీసుకెళ్లే రాకెట్ ప్రయోగంలో ప్రమాదం జరిగితే రేడియోధార్మిక పదార్థాలు వ్యాపించే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చంద్రుడిపై రియాక్టర్‌ను ఏర్పాటు చేయడం, నిర్వహించడం కూడా అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా మారనుంది. భూమిపై ఉన్న అణు రియాక్టర్ల మాదిరిగా చంద్రుడిపై భారీ రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయడం కష్టం. రేడియేషన్ ముప్పును తగ్గించేందుకు రియాక్టర్ల చుట్టుపక్కల ప్రాంతాలను పరిమితం చేయాల్సి రావచ్చని నిపుణులు చెబుతున్నారు.
చంద్రుడిపై హక్కు ఎవరిది?
అణు రియాక్టర్ల పోటీ మరో కీలక ప్రశ్నను కూడా తెరపైకి తెస్తోంది. 1967లో కుదిరిన Outer Space Treaty ప్రకారం ఏ దేశమూ చంద్రుడిని తన భూభాగంగా ప్రకటించుకోలేదు. అయితే చంద్రుడిపై స్థావరాలు ఏర్పాటు చేసిన తర్వాత వాటి చుట్టూ ఇతర దేశాల ప్రవేశాన్ని పరిమితం చేయవచ్చా? అక్కడి నుంచి వెలికితీసే వనరులపై ఎవరి హక్కు ఉంటుంది? అనే ప్రశ్నలు ఇంకా పూర్తిగా తేలలేదు. చైనా, రష్యా నిర్మించే అణు రియాక్టర్ల చుట్టూ భద్రత పేరుతో పరిమిత ప్రాంతాలు ఏర్పడితే.. అమెరికా వ్యోమగాములు, రోవర్లు చంద్రుడిపై కొన్ని ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి రావచ్చన్న ఆందోళనలు ఉన్నాయి. అలాంటి పరిమిత ప్రాంతాలు అంతరిక్షంలో స్వేచ్ఛాయుత ప్రవేశం అనే సూత్రానికి విరుద్ధమా? అనే అంశంపై అంతరిక్ష చట్ట నిపుణుల్లో చర్చ మొదలైంది.
ఒప్పందం ఇలా..
1967లో అమెరికా, సోవియట్ యూనియన్ సహా పలు దేశాలు కుదుర్చుకున్న Outer Space Treaty (అంతరిక్ష ఒప్పందం) ప్రకారం.. చంద్రుడు, ఇతర గ్రహాలు, అంతరిక్ష ప్రాంతాలను ఏ ఒక్క దేశం తన సొంత భూభాగంగా ప్రకటించుకోకూడదు. అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం వినియోగించాలి, అక్కడ అణ్వాయుధాలు లేదా ఇతర సామూహిక విధ్వంసక ఆయుధాలను మోహరించకూడదు. అలాగే చంద్రుడి సహజ వనరులపై దేశాలు సార్వభౌమ హక్కులు ప్రకటించకుండా ఈ ఒప్పందం నిర్దేశిస్తుంది. అయితే భవిష్యత్తులో చంద్రుడిపై శాశ్వత స్థావరాలు, అణు రియాక్టర్లు ఏర్పడితే.. వాటి చుట్టూ భద్రతా ప్రాంతాలను ఏర్పాటు చేయడం, ఇతర దేశాల ప్రవేశాన్ని పరిమితం చేయడం వంటి అంశాలపై కొత్త న్యాయపరమైన ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది.
రియాక్టర్లతో ముప్పులూ తప్పవు!
చంద్రుడిపై అణు రియాక్టర్లు ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించినా.. ప్రమాదాలు, సవాళ్లు కూడా తక్కువేమీ కావు. రియాక్టర్‌ను చంద్రుడికి తీసుకెళ్లే రాకెట్ ప్రయోగం విఫలమైతే అణు పదార్థాలకు సంబంధించిన ప్రమాదం తలెత్తొచ్చు. రియాక్టర్ నుంచి వెలువడే రేడియేషన్ వ్యోమగాములు, పరికరాలకు ముప్పుగా మారే అవకాశం ఉంది. చంద్రుడి దుమ్ము, తీవ్రమైన ఉష్ణోగ్రతలు రియాక్టర్ పరికరాల పనితీరును దెబ్బతీయొచ్చు. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే భూమి నుంచి నిపుణులు వెళ్లి మరమ్మతులు చేయడం కూడా అత్యంత క్లిష్టం. అంతేకాదు.. రియాక్టర్ చుట్టూ భద్రత పేరుతో ఇతర దేశాల ప్రవేశాన్ని పరిమితం చేసే పరిస్థితి వస్తే చంద్రుడి వనరులపై ఆధిపత్య పోటీ, అంతరిక్ష రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా.. చంద్రుడిపై అణు విద్యుత్ కోసం మొదలైన ఈ పోటీ భవిష్యత్ అంతరిక్ష అన్వేషణలో కీలక మలుపుగా మారే అవకాశం కనిపిస్తోంది.
ఇదీ చదవండి: ఇరాన్‌లో హై అలర్ట్.. గన్స్ పట్టిన మహిళలు!


