సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన వీడియో వైరల్ అవుతోంది. ఓ ప్రత్యేకమైన బైక్ హెల్మెట్ ప్రమాదం జరిగిన వెంటనే రైడర్ శరీరం చుట్టూ ఎయిర్‌బ్యాగ్‌ను విస్తరింపజేస్తున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
వీడియోలో గమనించినట్లయితే.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తూ కింద పడగానే, అతను ధరించిన హెల్మెట్ నుంచి ఒక్కసారిగా ఎయిర్‌బ్యాగ్ తెరుచుకుని శరీరం మొత్తాన్ని కప్పేస్తుంది. దీంతో రోడ్డుపై పడినప్పుడు శరీరానికి తగిలే దెబ్బ తీవ్రత తగ్గుతుందనేది.. ఈ టెక్నాలజీ వెనుక ఉన్న ఆలోచన.
హెల్మెట్ వెనుక.. చైనా కంపెనీలు!
ఈ టెక్నాలజీని చైనాకు చెందిన లాంక్సి యెమా మోటార్‌సైకిల్ ఫిట్టింగ్స్, యాన్‌ఫెంగ్ ఆటోమోటివ్ అనే రెండు కంపెనీలు తయారు చేసినట్లు సమాచారం. ఇందులో లాంక్సి యెమా చైనాలోని జెజియాంగ్ ప్రాంతానికి చెందిన హెల్మెట్ల తయారీ సంస్థ. ఇది ఏడాదికి సుమారు 25 లక్షల హెల్మెట్లను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
యాన్‌ఫెంగ్ ఆటోమోటివ్ అనేది కార్లకు సంబంధించిన ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్‌లు, స్టీరింగ్ వీల్స్ వంటి భద్రతా పరికరాలను తయారు చేస్తుంది. అయితే.. ఈ రెండు కంపెనీలు వీడియోలో కనిపిస్తున్న ప్రత్యేక హెల్మెట్‌ను తయారు చేసినట్లు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి ఈ వీడియో నిజమైనదా? లేక ఏఐ సాయంతో సృష్టించినదా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
నెటిజన్ల స్పందన
ఈ వీడియోపై నెటిజన్లు కూడా భిన్నంగా స్పందిస్తున్నారు. చాలామంది ఇది ఏఐ ద్వారా రూపొందించిన వీడియో అని కామెంట్లు చేస్తున్నారు. అయితే.. మోటార్‌సైకిళ్ల కోసం ఎయిర్‌బ్యాగ్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్న కంపెనీలు ఇప్పటికే ఉన్నాయని మరికొందరు గుర్తుచేస్తున్నారు.
ఇదీ చదవండి: ముగ్గురు పిల్లల పెంపకం.. భరణం కోసం బిలియనీర్ మాజీ భార్య పోరాటం!
నిజానికి బైక్ రైడర్ల భద్రత కోసం ప్రస్తుతం ఎయిర్‌బ్యాగ్ జాకెట్లు, వెస్టులు అందుబాటులో ఉన్నాయి. ప్రమాదం జరిగినప్పుడు సెన్సార్ల ద్వారా ప్రమాదాన్ని గుర్తించి, వెంటనే గాలితో నిండిపోయి రైడర్ ఛాతీ, మెడ, వెన్ను వంటి భాగాలకు రక్షణ కల్పిస్తాయి. అంతేకాకుండా 2022లో ఇటలీకి చెందిన ఏఐఆర్ఓహెచ్ సంస్థ, స్వీడన్‌కు చెందిన ఆటోలివ్ (Autoliv) సంస్థ కలిసి ఎయిర్‌బ్యాగ్ టెక్నాలజీతో కూడిన హెల్మెట్ నమూనాను కూడా ఆవిష్కరించాయి. అయితే.. అది ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని హెల్మెట్‌కు సంబంధించిన ప్రాజెక్ట్ కాదు.
A Chinese company testing out helmets with built in airbags! Such a clever idea 👏 https://t.co/LEGR3UYnDV
— HOW THINGS WORK (@HowThingsWork_) November 17, 2026


