ముగ్గురు పిల్లల పెంపకం.. భరణం కోసం బిలియనీర్ మాజీ భార్య పోరాటం! | Ex Wife Of Russian Billionaire Seeks Rs 7382 Crore In UKs Biggest Divorce Trial | Sakshi
Sakshi News home page

ముగ్గురు పిల్లల పెంపకం.. భరణం కోసం బిలియనీర్ మాజీ భార్య పోరాటం!

Nov 19 2026 7:39 AM | Updated on Nov 19 2026 8:01 AM

Ex Wife Of Russian Billionaire Seeks Rs 7382 Crore In UKs Biggest Divorce Trial

రష్యాకు చెందిన బిలియనీర్ వ్లాదిమిర్ పొటానిన్ (Vladimir Potanin), ఆయన మాజీ భార్య నటాలియా పొటానినా (Natalia Potanina) మధ్య భారీ ఆస్తి వివాదం ప్రస్తుతం బ్రిటన్‌లో చర్చనీయాంశంగా మారింది. సుమారు 29.7 బిలియన్ డాలర్ల సంపద కలిగిన పొటానిన్ నుంచి తనకు న్యాయంగా రావాల్సిన వాటాను ఇప్పించాలని నటాలియా లండన్ హైకోర్టును ఆశ్రయించారు.

వ్లాదిమిర్ పొటానిన్, నటాలియా 1983లో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాల వైవాహిక జీవితం తర్వాత ఈ జంట 2014లో రష్యాలో విడాకులు తీసుకుంది.

భార్య డిమాండ్
అయితే.. తన భర్త వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడంలో తాను కూడా పరోక్షంగా కీలక పాత్ర పోషించానని నటాలియా పేర్కొన్నారు. భర్త వ్యాపారాలపై దృష్టి పెట్టేందుకు వీలుగా.. తాను కుటుంబ బాధ్యతలు నిర్వహించానని, ముగ్గురు పిల్లలను పెంచానని చెబుతున్నారు. అందువల్ల వివాహ సమయంలో సంపాదించిన సంపదలో తనకు కూడా న్యాయమైన వాటా రావాలని కోరారు.

రష్యా కోర్టులు గతంలో కొంత ఆస్తిని కేటాయించినప్పటికీ.. నారిల్స్క్ నికెల్ కంపెనీలో వాటాలు, ట్రస్టుల ద్వారా నిర్వహిస్తున్న ఆస్తులు వంటి భారీ సంపదను అందులో పరిగణనలోకి తీసుకోలేదని నటాలియా ఆరోపిస్తున్నారు.

వాటా ఇవ్వకపోతే..
ఈ కేసులో అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, తనకు సంపదలో వాటా ఇవ్వకపోతే ప్రత్యామ్నాయంగా 600 మిలియన్ బ్రిటిష్ పౌండ్లు ఇవ్వాలని నటాలియా చెబుతున్నారు. ఇందులో 150 మిలియన్ పౌండ్లు లండన్‌లో విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేయడానికి, 441 మిలియన్ పౌండ్లు జీవితకాల నిర్వహణ ఖర్చుల కోసం, మరో 10 మిలియన్ పౌండ్లు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం కేటాయించారు.

నటాలియా 2018లో ఇంగ్లాండ్‌లో ఈ కేసును ప్రారంభించారు. విదేశాల్లో విడాకులు తీసుకున్నప్పటికీ, అక్కడ లభించిన ఆస్తి పంపకం సరిపోలేదని నిరూపిస్తే.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇంగ్లాండ్ కోర్టు అదనపు ఆర్థిక పరిహారం ఇప్పించే అవకాశం ఉంది.

అయితే.. ఇప్పటికే రష్యా కోర్టుల్లో ఆస్తి వివాదం పరిష్కారమైందని వ్లాదిమిర్ పొటానిన్ చెబుతున్నారు. అంతేకాకుండా.. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో బ్రిటన్ ఆయనపై ఆంక్షలు విధించింది. దీంతో విదేశాల్లో ఉన్న ఆయన ఆస్తుల నుంచి పరిహారం వసూలు చేయడం మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉందని సమాచారం.

ఇదీ చదవండి: బంగారం తగ్గిందోచ్.. ఒక్కరోజే రూ.2800 డౌన్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement