అయ్యప్ప భక్తులకు శుభవార్త.. ఇక నేరుగా పంబాకు బస్సు ప్రయాణం! | Sabarimala KSRTC Direct Bus To Pamba | Sakshi
Sakshi News home page

అయ్యప్ప భక్తులకు శుభవార్త.. ఇక నేరుగా పంబాకు బస్సు ప్రయాణం!

Oct 23 2026 2:07 PM | Updated on Oct 23 2026 2:48 PM

Sabarimala KSRTC Direct Bus To Pamba

శబరిమల అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యాత్రికుల ప్రయాణ ఇబ్బందులను తగ్గించేందుకు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సు చార్టరింగ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు కేరళ రవాణా శాఖ మంత్రి సి.పి. జాన్‌ ప్రకటించారు. ఈ సదుపాయం ద్వారా భక్తుల బృందాలు రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా నేరుగా పంపాకు వెళ్లవచ్చు.

రాబోయే మండల-మకరవిళక్కు యాత్రా సీజన్‌లో అయ్యప్ప భక్తులకు ప్రయాణ కష్టాలు తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. సాధారణంగా రద్దీ సమయాల్లో నీలక్కల్‌ నుంచి పంపాకు వెళ్లేందుకు భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో బస్సులు మారాల్సిన అవసరం లేకుండా నేరుగా పంపాకు చేరుకునేలా కొత్త సౌకర్యాన్ని తీసుకొస్తున్నారు.

ఈ విధానంలో భక్తులు 45 సీట్లకు టికెట్లు బుక్‌ చేసుకుని కేఎస్ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకోవచ్చు. భక్తులు సూచించిన ప్రాంతానికి బస్సు చేరుకుని, అక్కడి నుంచి వారిని నేరుగా పంపాకు తీసుకెళ్తుంది. అయితే, విమానాన్ని చార్టర్‌ చేసుకున్న తరహాలోనే ఈ సదుపాయం పనిచేస్తుందని మంత్రి వివరించారు. దీంతో మొత్తం 45 సీట్లనూ బుక్‌ చేసుకోవడం తప్పనిసరి అని, ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు.

అలాగే, సాధారణ టికెట్‌ ధరలకు అదనంగా బస్సు చార్టరింగ్‌ కోసం ఎలాంటి రుసుము వసూలు చేయబోమని మంత్రి తెలిపారు. ఈ సౌకర్యంతో కేరళలోని వివిధ జిల్లాల నుంచి సమూహాలుగా వచ్చే అయ్యప్ప భక్తులకు ప్రయోజనం కలగనుంది. అయితే, బుకింగ్‌ విధానం, టికెట్‌ ధరలు, ఇతర సేవా వివరాలను కేఎస్ఆర్టీసీ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే దీనిపై మరిన్ని వివరాలు విడుదల చేయనుంది.

ఇదీ చదవండి: స్వాతంత్య్రం వచ్చిన 79 ఏళ్లలో ఇదే తొలిసారి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement