భారతీయ రైల్వే చరిత్రలో మరో మైలురాయి నమోదైంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచిన తర్వాత ఛత్తీస్‌గఢ్‌లోని మారుమూల ప్రాంతమైన ‘రోఘాట్’ (Rowghat)ను జాతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో దశాబ్దాలుగా నెలకొన్న రవాణా ఇబ్బందులకు తెరదించుతూ రూ.1,628 కోట్ల వ్యయంతో చేపట్టిన 95 కిలోమీటర్ల దల్లీ-రాజహారా-రోఘాట్ రైల్వే ప్రాజెక్ట్ పూర్తయింది. ఇందులో భాగంగా తడకి-రోఘాట్ మధ్య ఉన్న చివరి 17.5 కిలోమీటర్ల సెక్షన్‌ను ప్రారంభించడంతో ఈ కల సాకారమైంది.
ఈ ప్రారంభోత్సవ వేడుకలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి పాల్గొనగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్య అతిథిగా రెండు కొత్త ప్యాసింజర్ రైళ్లను (రోఘాట్-రాయ్‌పూర్, రాయ్‌పూర్-కురుద్) జెండా ఊపి ప్రారంభించారు. ఇదే వేదికపై రాయ్‌పూర్‌లో అత్యాధునిక ఎలక్ట్రిక్ లోకోమోటివ్ మెయింటెనెన్స్ ఫెసిలిటీకి శంకుస్థాపన జరిపారు.
ఆర్థిక, పారిశ్రామిక రంగానికి పెద్దపీఠ
ఈ నూతన రైలు మార్గం కేవలం ప్రయాణ సౌకర్యాలకే పరిమితం కాకుండా దేశీయ ఉక్కు పరిశ్రమకు కీలకమైన ముడిసరుకు రవాణాను సులభతరం చేయనుంది. భిలాయ్ స్టీల్ ప్లాంట్‌తో సహా ప్రధాన పరిశ్రమలకు అవసరమైన ఇనుప ఖనిజాన్ని రోఘాట్ ప్రాంతం నుంచి మరింత సమర్థవంతంగా రవాణా చేయడానికి ఈ లైన్ దోహదపడుతుంది. దీనివల్ల స్థానిక ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధి వేగవంతమై కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుత రైల్వే బడ్జెట్‌లో ఛత్తీస్‌గఢ్‌కు రూ.7,000 కోట్లకు పైగా నిధులు కేటాయించడం ద్వారా మారుమూల ప్రాంతాల్లోనూ మౌలిక వసతులు వేగంగా విస్తరిస్తున్నాయని సీఎం విష్ణుదేవ్ సాయి పేర్కొన్నారు. ఈ రైల్వే కనెక్టివిటీ ద్వారా రోఘాట్ ప్రాంత ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి, మార్కెట్ సదుపాయాలు మెరుగవుతాయని తెలిపారు.
ఇదీ చదవండి: డివైజ్‌లో సిమ్ లేకపోతే వాట్సాప్ సేవలు బంద్!


