అరుణాచల్‌ సరిహద్దులో టెన్షన్‌.. ఎదురెదురుగా భారత్‌-చైనా సైనికులు! | Sources Says Two sectors in Arunachal Taksing remain sensitive | Sakshi
Sakshi News home page

అరుణాచల్‌ సరిహద్దులో టెన్షన్‌.. ఎదురెదురుగా భారత్‌-చైనా సైనికులు!

Oct 24 2026 10:41 AM | Updated on Oct 24 2026 10:48 AM

Sources Says Two sectors in Arunachal Taksing remain sensitive

భారత్‌-చైనా సరిహద్దులో మరోసారి అలజడి నెలకొంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని అసఫిలా, లాంగ్జు సరిహద్దు ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) విషయంలో ఇరు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భారత, చైనా సైనికుల గస్తీ బృందాలు తరచూ ఎదురుపడుతున్నాయి. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి అదుపులోనే ఉందని రక్షణ వర్గాలు వెల్లడించినట్లు ఇండియా టుడే కథనం పేర్కొంది.

అరుణాచల్‌ప్రదేశ్‌లోని తక్సింగ్‌ సర్కిల్‌ పరిధిలో ఈ రెండు ప్రాంతాలు ఉన్నాయి. ఎల్‌ఏసీపై ఇరు దేశాలకు భిన్నమైన అవగాహనలు ఉండటంతో సాధారణ గస్తీ సమయంలో సైనికులు ఎదురుపడటం, స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం పునరావృతమవుతున్నాయని రక్షణ వర్గాలు తెలిపాయి. అయితే, ఇరు దేశాల సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగినట్లు సమాచారం లేదని పేర్కొన్నాయి. క్షేత్రస్థాయి కమాండర్లు సంయమనం పాటిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని వివరించాయి.

చర్చలతో ఉద్రిక్తతలకు కళ్లెం
సరిహద్దుల్లో ఎదురెదురుగా సైనికులు తారసపడినప్పుడు పరిస్థితి మరింత తీవ్రం కాకుండా ఇరు దేశాల సైనిక యంత్రాంగాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఫ్లాగ్‌ మీటింగ్‌లు, హాట్‌లైన్‌ ద్వారా సమాచార మార్పిడి వంటి వ్యవస్థలను వినియోగిస్తున్నాయి. ఈశాన్య ప్రాంతంలో కార్ప్స్‌ కమాండర్‌ స్థాయి చర్చలు కూడా ఉన్నతస్థాయి సంప్రదింపులను బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగమని అధికారులు పేర్కొన్నట్లు కథనం తెలిపింది. ఎల్‌ఏసీ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్న ప్రాంతాల్లో శాంతిని కొనసాగించేందుకు సైనిక, దౌత్యపరమైన చర్చలు కీలకమని రక్షణ వర్గాలు అభిప్రాయపడ్డాయి. సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు నిరంతర సంప్రదింపులు అవసరమని పేర్కొన్నాయి.

మౌలిక వసతుల అభివృద్ధి
మరోవైపు, మారుమూల సరిహద్దు ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు, టెలికమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌లు, ఇతర పౌర సదుపాయాలను మెరుగుపరిచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని రక్షణ వర్గాలు తెలిపాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు సైనికుల రాకపోకలకు మాత్రమే కాకుండా స్థానిక ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరుస్తాయని పేర్కొన్నాయి. మెరుగైన రవాణా, సమాచార వ్యవస్థలతో సరిహద్దు గ్రామాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరిగే అవకాశముందని తెలిపాయి. భద్రత, దౌత్యపరమైన పరిస్థితులు అనుకూలిస్తే భవిష్యత్తులో నియంత్రిత సరిహద్దు వాణిజ్యం, ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించే అవకాశాలు కూడా ఉండవచ్చని వివరించాయి.

బౌద్ధులకు పవిత్రమైన త్సారి యాత్రా మార్గం..
అసఫిలా, లాంగ్జు ప్రాంతాలకు భద్రతాపరంగానే కాకుండా సాంస్కృతిక, మతపరమైన ప్రాధాన్యం కూడా ఉంది. ఇరు దేశాల్లోని బౌద్ధ సమాజాలకు పవిత్రమైన చారిత్రక త్సారి యాత్రా మార్గం ఈ ప్రాంతంతో ముడిపడి ఉంది. సరిహద్దులో పరిస్థితులు స్థిరంగా ఉంటే భవిష్యత్తులో సరిహద్దు దాటి యాత్రలకు సంబంధించిన అవకాశాలను పరిశీలించవచ్చని రక్షణ వర్గాలు తెలిపాయి. అయితే, ఇందుకు ఇరు దేశాల అంగీకారం, అనుకూలమైన భద్రతా పరిస్థితులు అవసరమని స్పష్టం చేశాయి. అదేవిధంగా, మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, అత్యవసర తరలింపులు, పాఠశాలల నిర్మాణం, ఉపాధి అవకాశాల కల్పన వంటి పౌర-సైనిక సహకార కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నాయి. మొత్తంగా అసఫిలా, లాంగ్జు ప్రాంతాలు సున్నితమైనవిగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని రక్షణ వర్గాలు తెలిపాయి. సైనిక, దౌత్యపరమైన సంప్రదింపులతో పాటు సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి భారత్‌-చైనా మధ్య స్థిరత్వాన్ని కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించాయి.

ఇదీ చదవండి: చైనాకు క్లీన్‌ చిట్లు చాలు.. నిజాలు చెప్పండి! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement