టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరాయి. తమపై అమెరికా దాడి చేసిన గంటలోపే ప్రతీకారం తీర్చుకున్నామని ఇరాన్ ప్రకటించింది. బహ్రెయిన్‌లోని అమెరికా సైన్యానికి చెందిన కీలకమైన ఎర్లీ వార్నింగ్ రాడార్ వ్యవస్థను తమ ఏరోస్పేస్ దళాలు ధ్వంసం చేసినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) వెల్లడించింది.
గంటలోపే ప్రతీకారం
ఇరాన్‌లోని సిరిక్ ప్రాంతంలో ఉన్న టెలికమ్యూనికేషన్ టవర్‌పై అమెరికా వైమానిక దాడి చేసిందని ఐఆర్‌జీసీ ఆరోపించింది. దీనికి ప్రతిగా దాదాపు గంటలోపే బహ్రెయిన్ ద్వీపంలోని అమెరికా ఎర్లీ వార్నింగ్ రాడార్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. గగనతలంలో సైనిక కార్యకలాపాలను ముందుగానే గుర్తించే ఈ వ్యవస్థను ధ్వంసం చేసినట్లు పేర్కొంది.
అమెరికాకు తీవ్ర హెచ్చరిక
బహ్రెయిన్‌లో రాడార్‌ను ధ్వంసం చేయడం అమెరికాకు పంపిన తీవ్రమైన సందేశమని ఐఆర్‌జీసీ స్పష్టం చేసింది. ఇరాన్ సరిహద్దులను మరోసారి ఉల్లంఘించినా, తమపై దాడులకు దిగినా పరిమితులు లేకుండా ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది.
ఇతర దేశాలకూ వార్నింగ్
ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ ఇతర దేశాలను కూడా హెచ్చరించారు. ఇరాన్‌పై అమెరికా చేపట్టే సైనిక చర్యలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరించే దేశాలను తమపై దాడికి దిగిన భాగస్వాములుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు.
కొరియన్ సామెతతో చురకలు
ఎక్స్ వేదికగా స్పందించిన బఘాయ్ ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టాలను ప్రస్తావించారు. అమెరికా వెంట నడిచే దేశాల పరిస్థితిని వివరిస్తూ ఓ కొరియన్ సామెతను ఉటంకించారు. ‘కొంగ వెనుక ఎగరాలని ప్రయత్నించే పిచ్చుక చివరకు తన కాళ్లు విరగ్గొట్టుకుంటుందని’ పేర్కొంటూ అమెరికాకు మద్దతిచ్చే దేశాలకు పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ఇదీ చదవండి: పాక్ సంక్షోభం: 6 నెలల్లో 3.17 లక్షల మంది పలాయనం!


