సంకల్పం బలంగా ఉంటే పసిచేతులు కూడా ప్రపంచ గతిని మార్చగలవని నిరూపించిన బాలలు వీరు. ఆటటలతో గడపాల్సిన వయసులో కొందరు మేధస్సుతో ఆశ్చర్యపరిస్తే, మరికొందరు సామాజిక అసమానతలు, యుద్ధాలు, పర్యావరణ విధ్వంసంపై గళమెత్తారు. తమ అసాధారణ ప్రతిభ, ధైర్యసాహసాలతో చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో నిలిచిపోయిన 10 మంది ప్రపంచ ప్రఖ్యాత బాలల స్ఫూర్తిదాయక గాథలు ఇవిగో!
బాబీ ఫిషర్: చెస్ సంచలనం
అమెరికాకు చెందిన బాబీ ఫిషర్ చదరంగంలో పెను సంచలనం. 1956లో కేవలం 13 ఏళ్ల వయసులో అప్పటి ప్రముఖ చెస్ మాస్టర్ డొనాల్డ్ బైర్న్‌ను ఓడించి, ఆ ఆటను ‘గేమ్ ఆఫ్ ది సెంచరీ’గా మార్చాడు. 15 ఏళ్ల వయసులోనే అతి పిన్న వయస్కుడైన చెస్ గ్రాండ్‌మాస్టర్‌గా చరిత్ర సృష్టించాడు. చెస్‌లో రష్యా ఆధిపత్యానికి సవాల్ విసిరి, ప్రపంచ చెస్ చరిత్రలో ఒక లెజెండ్‌గా ఎదిగాడు.
రూబీ బ్రిడ్జెస్: సమానత్వ పోరాట యోధురాలు
1960లో అమెరికాలో జాతి వివక్ష తీవ్రంగా ఉన్న ఆరేళ్ల చిన్నారి రూబీ బ్రిడ్జెస్ చరిత్ర సృష్టించింది. లూసియానాలోని శ్వేతజాతీయుల పాఠశాలలో అడుగుపెట్టిన మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ విద్యార్థినిగా ఆమె నిలిచింది. బయట నిరసనకారుల బెదిరింపులు, ద్వేషపూరిత నినాదాల మధ్య, ఆమె ప్రతిరోజూ ధైర్యంగా పాఠశాలకు వెళ్లింది. ఒక్క చిన్నారి చూపిన ఆ అచంచలమైన ధైర్యం విద్యా వ్యవస్థలో సమానత్వానికి బాటలు వేసింది.
కిమ్ ఉంగ్‌యాంగ్: అపర మేధావి
దక్షిణ కొరియాకు చెందిన కిమ్ ఉంగ్ యాంగ్ 1960లలో ప్రపంచంలోనే అత్యంత తెలివైన బాలుడిగా గుర్తింపు పొందారు. నాలుగేళ్ల వయసులోనే నాలుగు భాషలు మాట్లాడటంతో పాటు కాలిక్యులస్ సమస్యలను సులభంగా పరిష్కరించేవాడు. అతని ఐక్యూ 210గా నమోదై గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఎనిమిదేళ్ల వయసులోనే నాసా ఆహ్వానం అందుకున్నాడు.
సమంతా స్మిత్ : శాంతి దూత
ప్రచ్ఛన్న యుద్ధం (cold war) సమయంలో అమెరికా, సోవియట్‌ల మధ్య అణుయుద్ధ భయాలు నెలకొన్న వేళ పదేళ్ల అమెరికన్ బాలిక సమంతా స్మిత్ అప్పటి సోవియట్ నాయకుడు యూరి ఆండ్రోపోవ్‌కు రాసిన ఉత్తరం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ లేఖకు స్పందించిన సోవియట్ ప్రభుత్వం ఆమెను తమ దేశానికి ఆహ్వానించింది.1983లో స్మిత్ చేసిన రష్యా పర్యటన రెండు దేశాల మధ్య స్నేహ వారధిగా నిలిచి స్మిత్‌కు ‘అమెరికాస్ యంగెస్ట్ అంబాసిడర్’గా కీర్తి తెచ్చిపెట్టింది.
ఇక్బాల్ మసీహ్: బాలకార్మిక వ్యవస్థపై పోరాటం
పాకిస్థాన్‌కు చెందిన ఇక్బాల్ మసీహ్ నాలుగేళ్ల వయసులోనే తివాచీల కర్మాగారంలో బానిసగా మారాడు. పదేళ్ల వయసులో ఆ నరకం నుంచి తప్పించుకుని బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా గళమెత్తాడు. తన ప్రసంగాలతో వేలాది మంది చిన్నారులను బానిసత్వం నుంచి విముక్తులను చేశాడు. రీబాక్ హ్యూమన్ రైట్స్ అవార్డు అందుకుని ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. దురదృష్టవశాత్తు 1995లో కేవలం 12 ఏళ్ల వయసులో హత్యకు గురైనా బాలల హక్కుల పోరాటంలో శాశ్వత స్ఫూర్తిగా నిలిచిపోయాడు.
జుడిట్ పోల్గార్: చదరంగపు మహారాణి
హంగేరీకి చెందిన జుడిట్ పోల్గార్ చదరంగంలో పురుషుల ఆధిపత్యాన్ని బద్దలు కొట్టిన అసాధారణ బాలిక. తండ్రి ఇచ్చిన ప్రత్యేక శిక్షణతో 1988లో 12 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ మాస్టర్ హోదా సాధించి సంచలనం సృష్టించింది. 15 ఏళ్ల 4 నెలల వయసులో గ్రాండ్‌మాస్టర్ టైటిల్ గెలుచుకుని బాబీ ఫిషర్ పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది.
మలాలా విద్యా హక్కుల గొంతుక
పాకిస్థాన్‌లోని స్వాత్ లోయలో బాలికల విద్యపై తాలిబన్లు విధించిన నిషేధాన్ని ఎదిరించిన ధీరవనిత మలాలా. 11 ఏళ్ల వయసు నుంచే బ్లాగ్‌ల ద్వారా బాలికల చదువు కోసం పోరాడింది. 15 ఏళ్ల వయసులో తాలిబన్ల తూటాలకు గురై ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆ దాడి ఆమె సంకల్పాన్ని మరింత దృఢం చేసింది. 17 ఏళ్ల వయసులోనే నోబెల్ శాంతి బహుమతి అందుకున్న అతి చిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది.
గీతాంజలి రావు: యువ శాస్త్రవేత్త
భారతీయ మూలాలున్న అమెరికన్ బాలిక గీతాంజలి రావు 15 ఏళ్ల వయసులోనే తన ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కలుషిత నీటిలోని సీసం శాతాన్ని వేగంగా గుర్తించే ‘టెథిస్’ పరికరాన్ని, సైబర్ బుల్లీయింగ్‌ను అరికట్టే ‘కైండ్లీ’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్‌ను రూపొందించింది. 2020లో ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన మొట్టమొదటి ‘కిడ్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాన్ని గెలుచుకుంది.
గ్రెటా థన్ బర్గ్ పర్యావరణ ఉద్యమ కెరటం
స్వీడన్‌కు చెందిన గ్రెటా థన్‌బర్గ్ 2018లో 15 ఏళ్ల వయసులో స్వీడిష్ పార్లమెంట్ ఎదుట ‘స్కూల్ స్ట్రైక్ ఫర్ క్లయిమేట్’ పేరుతో ఒంటరిగా నిరసన ప్రారంభించింది. ఆమె చేసిన పోరాటం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులను ఏకం చేసింది. ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్రపంచ నాయకులను ఉద్దేశించి ఆమె చేసిన ‘హౌ డేర్ యూ’ ప్రసంగం చరిత్రాత్మకంగా నిలిచి, పర్యావరణ ఉద్యమానికి కొత్త దిశను చూపింది.
రణ్‌వీర్ సచ్‌దేవా: ఏఐ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో భారతదేశానికి చెందిన రణ్‌వీర్ సచ్‌దేవా పిన్న వయసులోనే సాంకేతిక సంచలనంగా మారాడు. ఆరేళ్ల వయసులోనే ఐక్యరాజ్యసమితి వేదికలపై ఏఐ సాంకేతికత, ఆవిష్కరణలపై ప్రసంగించి ప్రపంచ నిపుణులను ఆశ్చర్యపరిచాడు. 2026లో న్యూఢిల్లీలో జరిగిన ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో ఎనిమిదేళ్ల టెక్నాలజిస్ట్‌గా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
ఇదీ చదవండి: ఆ యువకుడి టాలెంట్‌కి కిరణ్ మజుందార్-షా ఫిదా..! నెట్ లేకుండానే..


