ఢిల్లీ : హిందూ మతం మారితే దళిత రిజర్వేషన్ ఉండదని గురువారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన దళితులకు రిజర్వేషన్ వర్తించదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హిందూ మతం నుంచి ఇస్లాం లేదా ఇతర మతాల్లోకి మారిన వ్యక్తులు ఈ మత మార్పిడికి ముందున్న కులం లేదా సామాజిక హోదాను ప్రాతిపదికగా చూపి వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్లు పొందలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడులో 2015లో హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన సమీర్ అహ్మద్ అనే వ్యక్తి ‘ముస్లిం లెబ్బై’ కేటగిరీ కింద కమ్యూనిటీ సర్టిఫికెట్ కోరగా తహశీల్దార్ తిరస్కరించడంతో ఈ వివాదం మొదలైంది.
హైకోర్టును ఆశ్రయించిన అనంతరం, మతం మారినవారికి బీసీ కోటా కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం 2024లో జారీ చేసిన జీవోను మద్రాస్ హైకోర్టు రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ చంద్రశేఖర్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొన్న ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఒక వ్యక్తి ఇస్లాంలోకి మారినంత మాత్రాన ఆ మతంలో ప్రభుత్వం గుర్తించిన ఏడు వెనుకబడిన వర్గాలలో ఒక సభ్యుడిగా మారిపోలేడు. పూర్వపు కుల స్థితిని మతం మారిన తర్వాత వర్తించే ముస్లిం వెనుకబడిన తరగతి కేటగిరీకి బదిలీ చేయడం చట్టపరంగా చెల్లదు. అలాగే ఏ ప్రైవేట్ మత సంస్థ కూడా ఈ హోదాను నిర్ణయించలేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆర్టికల్ 16(4) కింద కల్పించే రిజర్వేషన్ ప్రయోజనాలను, మునుపటి సామాజిక వెనుకబాటుతనాన్ని కారణంగా చూపి కొత్త మతంలో డిమాండ్ చేయడానికి వీల్లేదని ధర్మాసనం తీర్పునిచ్చింది.
రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఉత్తర్వుల ప్రకారం కేవలం హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను అనుసరించే వ్యక్తులే షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కేటగిరీకి అర్హులని న్యాయస్థానం గుర్తుచేసింది. కాబట్టి ఆ మతాలు కాకుండా ఇస్లాం, క్రైస్తవం వంటి ఇతర మతాల్లోకి మారిన వెంటనే వారు ఎస్సీ హోదాను కోల్పోతారని, ఆ హోదా ఆధారంగా లభించే ఎలాంటి ప్రభుత్వ రిజర్వేషన్ ప్రయోజనాలనూ పొందలేరని వెల్లడించింది. ఒక మత క్రమం నుంచి మరో మత క్రమంలోకి మారినప్పుడు మునుపటి కుల హక్కులు ముగిసిపోతాయని ధర్మాసనం స్పష్టమైన వివరణ ఇచ్చింది.
అదే సమయంలో, ఎవరైనా ఇతర మతం నుంచి తిరిగి హిందూ మతంలోకి మారిన సందర్భంలో కూడా రిజర్వేషన్లు వాటంతట అవే పునరుద్ధరించబడవని ధర్మాసనం తేల్చిచెప్పింది. అలాంటి వ్యక్తులకు మునుపటి సామాజిక హోదా వాస్తవంగా పునరుద్ధరించబడిందా లేదా అనేది క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగా స్వతంత్రంగా నిర్ధారించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. ఇతర మతాల్లోకి వెళ్లిన తర్వాత పూర్వపు గుర్తింపు ఆధారం రద్దవుతుంది కాబట్టి, తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.


