ఎనిమిదేళ్ల తర్వాత ఎన్టీఆర్‌.. సీక్వెల్స్‌తో ప్రభాస్‌ | Jr NTR, Trivikram To Teja Sajja, Karthik Gattamneni, Hit Combination Repeat In TFI | Sakshi
Sakshi News home page

ఎనిమిదేళ్ల తర్వాత ఎన్టీఆర్‌.. సీక్వెల్స్‌తో ప్రభాస్‌

Nov 29 2026 9:47 AM | Updated on Nov 29 2026 10:07 AM

Jr NTR, Trivikram To Teja Sajja, Karthik Gattamneni, Hit Combination Repeat In TFI

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓ హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ అవుతోందంటే ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో ఉండే క్రేజే వేరు. ఇప్పటికే తమ కలయికలో విజయం అందుకున్న వాళ్లు మరోసారి కలిసి పని చేస్తున్నారంటే బాక్సాఫీస్‌ వద్ద ఆ మూవీకి చక్కని మార్కెట్‌తో టు ప్రీ బిజినెస్‌ కూడా బాగుంటుంది. అందుకేనేమో ఓసారి హిట్‌ అందుకున్న హీరోలు, డైరెక్టర్లు మరోసారి కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. వీరి కాంబినేషన్‌లో సినిమా నిర్మించేందుకు నిర్మాతలు సైతం ఎప్పటికప్పుడు తమ వంతు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ జాబితాలో కొందరు రెండోసారి కలిసి పని చేస్తుంటే మరికొందరు సీక్వెల్స్, ఫ్రాంచైజీలతోనూ తమ కాంబినేషన్‌ని రిపీట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జాబితాలో చిరంజీవి–కేఎస్‌ రవీంద్ర(బాబి), బాలకృష్ణ–గోపీచంద్‌ మలినేని, వెంకటేశ్‌–అనిల్‌ రావిపూడి, కల్యాణ్‌ రామ్‌–అనిల్‌ రావిపూడి, ప్రభాస్‌–నాగ్‌ అశ్విన్, ప్రభాస్‌–ప్రశాంత్‌ నీల్, ఎన్టీఆర్‌– త్రివిక్రమ్‌ రామ్‌చరణ్‌–సుకుమార్, తేజ సజ్జా–కార్తీక్‌ ఘట్టమనేని, శ్రీవిష్ణు–రామ్‌ అబ్బరాజు వంటి కాంబినేషన్లు ఉన్నాయి. ఆ వివరాలేంటో ఓ సారి చూద్దాం.   

కాకాతో మరోసారి 
చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాకా. ఈ సినిమాకి కేఎస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. నివేదా పేతురాజ్, అనస్వర రాజన్, అనురాగ్‌ కశ్యప్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కెవీఎన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వెంకట్‌ కె. నారాయణ నిర్మిస్తున్నారు. చిరంజీవి–బాబీ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలై, హిట్‌గా నిలిచింది. ఇక వీరి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘కాకా’ ప్రధాన కథాంశం తండ్రీకూతురు సెంటిమెంట్‌ నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. 

ఈ మూవీలో చిరంజీవి కుమార్తెగా అనస్వర రాజన్‌ నటిస్తుండగా, ఆయన భార్య పాత్రలో నివేదా కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. చిరంజీవి–బాబీ కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమాపై ఇండస్ట్రీలో, ట్రేడ్‌ మార్కెట్‌లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న విడుదలైన ఈ చిత్రం టైటిల్‌ గ్లింప్స్‌ తర్వాత సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. ఇటీవల దీపావళి కానుకగా రిలీజ్‌ చేసిన చిరంజీవి సరికొత్త పోస్టర్‌కి కూడా మంచి స్పందన వచ్చింది. 

‘హార్ట్‌ ఆఫ్‌ కాకా’గా అనస్వర రాజన్‌ పోషిస్తున్న అమ్ములు పాత్రని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ‘కాకా’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. కాగా చిరంజీవి–బాబీ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ కూడా 2023 సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రిలీజైన సంగతి తెలిసిందే. అదే హిట్‌ సెంటిమెంట్‌ని కొనసాగిస్తూ ‘కాకా’ని జనవరి 13న రిలీజ్‌ చేస్తుండటం విశేషం. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: విజయ్‌ కార్తీక్‌ కన్నన్, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: శరణ్య కోట్ల. 

జనవరి... తో ఐదోసారి... 
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకుల్లో ఒకరైన వెంకటేశ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘జనవరి 12 విడుదల’. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనేది ట్యాగ్‌లైన్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. క్రేజీ మల్టీస్టారర్‌ మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో కల్యాణ్‌ రామ్‌ మరో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేశ్‌ సరసన కీర్తీ సురేష్, కల్యాణ్‌ రామ్‌ సరసన కృతీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

సురేష్‌ ప్రొడక్షన్స్‌, జీ స్టూడియోస్, అర్చన సమర్పణలో షైన్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ సినిమా నిర్మిస్తున్నారు. వెంకటేశ్‌–అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘ఎఫ్‌ 2’ (2019). ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ మరో హీరోగా నటించారు. ‘ఎఫ్‌ 2’ వంటి హిట్‌ మూవీ తర్వాత వెంకటేశ్‌–వరుణ్‌ తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ‘ఎఫ్‌ 3’ (2022) సినిమా కూడా విజయం అందుకుంది. ఆ తర్వాత వెంకటేశ్‌ సోలో హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ అందుకోవడంతో పాటు బాక్సాఫీస్‌ వద్ద రూ. 300కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. 

‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ తర్వాత అనిల్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాలో వెంకటేశ్‌ కూడా కీలక పాత్ర పోషించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన ఈ మూవీ హిట్‌గా నిలిచింది. తాజాగా వెంకటేశ్‌–అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘జనవరి 12 విడుదల’. ఈ సినిమా కోసం ఐదోసారి వీరిద్దరూ కలిసి పని చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్‌ కంటెంట్, సాంగ్స్‌ మూవీపై క్రేజ్‌ని పెంచాయి. తనకు బాగా కలిసొచ్చిన సంక్రాంతి పండగ సందర్భంగా  ఈ చిత్రాన్ని జనవరి 12 విడుదల చేస్తున్నారు అనిల్‌ రావిపూడి. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: సమీర్‌ రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌. కృష్ణ.  
 
దాదాతో రెండోసారి... 
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దాదా’. గోపీచంద్‌ మలినేని రచన, దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో మంచు మనోజ్, కాజల్‌ అగర్వాల్, నర్గీస్‌ ఫక్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. ఇక బాలకృష్ణ–గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘వీరసింహారెడ్డి’. 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన ఈ మూవీ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న రెండో చిత్రం ‘దాదా’.  ‘వీరసింహారెడ్డి’ వంటి హిట్‌ మూవీ తర్వాత బాలకృష్ణ–గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న ‘దాదా’ సినిమాపై ఆడియన్స్‌లో క్రేజ్‌ నెలకొంది. క్రిస్మస్‌ కానుకగా డిసెంబరు 24న ‘దాదా’ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: అరవింద్‌ ఎస్‌. కశ్యప్‌.  

సీక్వెల్‌తో మళ్లీ... 
హీరో ప్రభాస్‌ వరుస పాన్‌ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ ఒకటి. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్, కమల్‌ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై సి. అశ్వినీదత్‌ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ప్రభాస్‌– నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. 2024 జూన్‌ 27న రిలీజైన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. 

ఈ మూవీకి సీక్వెల్‌గా  ‘కల్కి 2898 ఏడీ 2’ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ జరుగుతోంది. ఫ్యూచర్, పురాణాల కలయికతో రూపొందిన ‘కల్కి’ సినిమాటిక్‌ యూనివర్స్‌ను మరింత భారీ స్థాయికి తీసుకెళ్లేలా సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు నాగ్‌ అశ్విన్‌. అక్టోబరు 23న ప్రభాస్‌ బర్త్‌ డే సందర్భంగా భైరవ పాత్రలో ఆయన సెట్స్‌లోకి అడుగుపెట్టిన స్పెషల్‌ గ్లింప్స్‌ను రిలీజ్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన మొదటి భాగంలో ప్రేక్షకుల ఆదరణ  పొందిన భైరవ పాత్రను మరోసారి వెండితెరపై చూసేందుకు ఈ గ్లింప్స్‌ అంచనాలు పెంచింది. ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు రెండు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ‘కల్కి 2898 ఏడీ’ అద్భుతమైన విజయాన్ని సాధించడంతో సీక్వెల్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాటిక్‌ యూనివర్స్‌ స్కేల్, స్థాయిని మరింత విస్తరించేందుకు నాగ్‌ అశ్విన్‌ సిద్ధమవుతుండటంతో ‘కల్కి 2898 ఏడీ 2’ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. 

సీక్వెల్‌తోనే కుదిరింది 
ప్రభాస్‌ కథానాయకుడిగా నటించనున్న మరో పాన్‌ ఇండియన్‌ మూవీ ‘సలార్‌ పార్ట్‌ 2: శౌర్యాంగ పర్వం’. ఆయన హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘సలార్‌ పార్ట్‌ 1: సీజ్‌ఫైర్‌’. శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో పృథ్వీరాజ్‌ సుకుమారన్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహా కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మŠస్‌పై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన ఈ చిత్రం 2023 డిసెంబరు 22న రిలీజై, సూపర్‌ హిట్‌గా నిలిచింది. ‘సలార్‌ పార్ట్‌ 1: సీజ్‌ఫైర్‌’కి సీక్వెల్‌గా రూపొందనున్న చిత్రం ‘సలార్‌ పార్ట్‌ 2: శౌర్యాంగ పర్వం’. ప్రస్తుతం ఎన్టీఆర్‌ హీరోగా ‘డ్రాగన్‌’ సినిమా తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్‌ నీల్‌. ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం 2027 జూన్‌ 11న రిలీజ్‌ కానుంది. ‘డ్రాగన్‌’ షూటింగ్‌ పూర్తి చేసిన తర్వాత ‘సలార్‌ పార్ట్‌ 2: శౌర్యాంగ పర్వం’ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళతారు ప్రశాంత్‌ నీల్‌. ఇలా ప్రభాస్‌–ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌ రెండోసారి రిపీట్‌ కానుంది. ‘సలార్‌ ΄ార్ట్‌ 1: సీజ్‌ఫైర్‌’ వంటి హిట్‌ మూవీకి సీక్వెల్‌గా రానున్న ‘సలార్‌ పార్ట్‌ 2: శౌర్యాంగ పర్వం’ పైనా అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి.  

ఎనిమిదేళ్లకు మరో సినిమా 
ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, సునీల్, నవీన్‌ చంద్ర, ఈషా రెబ్బా ఇతర పాత్రలు పోషించారు. హారిక హాసినీ క్రియేషన్స్‌పై రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమా 2018 అక్టోబరు 11న రిలీజై, సూపర్‌హిట్‌గా నిలిచింది. వీరి కాంబినేషన్‌లో రానున్న ద్వితీయ చిత్రానికి ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’ అనే టైటిల్‌ వినిపిస్తున్నప్పటికీ, అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. లార్డ్‌ కుమారస్వామి నేపథ్యంలో మైథాలజీ జానర్‌లో ఈ చిత్రం తెరకెక్కనుంది. హారిక హాసినీ క్రియేషన్స్‌పై రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమా నిర్మించనున్నారు. 

కాగా ఎన్టీఆర్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి కూడా తెలిసిందే. ప్రస్తుతం ‘డ్రాగన్‌’ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్‌. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే కొత్త సినిమాని సెట్స్‌పైకి తీసుకెళతారు ఎన్టీఆర్‌. అయితే ముందుగా త్రివిక్రమ్‌ సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్‌ జాయిన్‌ అవుతారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ‘అరవింద సమేత వీరరాఘవ’ వంటి హిట్‌ మూవీ తర్వాత ఎన్టీఆర్‌–త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రానున్న ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’ చిత్రంపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు, క్రేజ్‌ నెలకొన్నాయి.  

ఎనిమిదేళ్లకు సెట్‌  
రామ్‌చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘రంగస్థలం’. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్, అనసూయ, ఆది పినిశెట్టి కీలక ΄ాత్రలు ΄ోషించారు. హీరోయిన్‌ పూజా హెగ్డే ఓ స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్‌ చెరుకూరి నిర్మించిన ఈ మూవీ 2018 మార్చి 30న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 

‘రంగస్థలం’ సినిమా తర్వాత రామ్‌చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రెండో సినిమా ‘ఆర్‌సీ 17’కి (వర్కింగ్‌ టైటిల్‌) శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్, టీ–సిరీస్‌ బ్యానర్లపై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్, విజయ ప్రసాద్‌ బండ్రెడ్డి, భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ప్రారంభోత్సవం ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ‘‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత ‘ఆర్‌సీ 17’ వంటి మరో ప్రాజెక్ట్‌ కోసం రామ్‌చరణ్‌–సుకుమార్‌ చేతులు కలిపారు. 

ఈ సినిమాలో తన పాత్ర కోసం రామ్‌చరణ్‌ పూర్తిగా కొత్తగా మారబోతున్నారు. ఆయన్ను మునుపెన్నడూ చూడని విభిన్నమైన లుక్‌లో చూపించనున్నారు సుకుమార్‌. నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్, విజయ ప్రసాద్‌ బండ్రెడ్డి, భూషణ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని ΄ాన్‌ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునేలా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రామ్‌ చరణ్, సుకుమార్‌ మరోసారి కలిసి పని చేస్తుండటంతో ఈ ్ర΄ాజెక్ట్‌పై ఇప్పటికే మ్యాసీవ్‌ బజ్‌ ఏర్పడింది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.  
 
పదేళ్లకు కుదిరింది 
కల్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన ‘పటాస్‌’ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు అనిల్‌ రావిపూడి. కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటించడంతో పాటు ఈ సినిమాని నిర్మించారు. డైరెక్టర్‌గా అనిల్‌ రావిపూడికి తొలి అవకాశం ఇచ్చారు కల్యాణ్‌ రామ్‌. శ్రుతి సోధి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో సాయికుమార్, శ్రీనివాస్‌ రెడ్డి, అశుతోష్‌ రాణా వంటి వారు ఇతర పాత్రల్లో నటించారు. 2015  జనవరి 23న రిలీజైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. తొలి చిత్రంతోనే భారీ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు అనిల్‌ రావిపూడి. ‘పటాస్‌’ మూవీ తర్వాత దర్శకుడిగా వరుస అవకాశాలు అందుకంటూ హిట్‌ మెషీన్‌గా దూసుకెళుతున్నారు అనిల్‌ రావిపూడి. 

‘పటాస్‌’ విడుదలైన పదేళ్ల తర్వాత కల్యాణ్‌ రామ్‌–అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూ΄÷ందుతోన్న ద్వితీయ చిత్రం ‘జనవరి 12 విడుదల’. మల్టీస్టారర్‌ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాలో వెంకటేశ్‌  మరో హీరోగా నటిస్తున్నారు. కీర్తీ సురేష్, కృతీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, అర్చన సమర్పణలో షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.  
 
మూడేళ్లకు మళ్లీ... 
వైవిధ్యమైన కథలు, సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ ప్యాక్‌’.  రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. సాక్షి మధోల్కర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నరేష్‌ వీకే, అభిరామి, మురళీ శర్మ, అన్నపూర్ణమ్మ, వెన్నెల కిషోర్, సుదర్శన్, సత్య, రోహిణి, గెటప్‌ శ్రీను, మురళీధర్‌ గౌడ్, గోపరాజు విజయ్, బుల్లి రాజు (రేవంత్‌), శ్రీ ముక్త, రఘుబాబు, మాణిక్‌ రెడ్డి, హరి ప్రసాద్, ఇమ్మాన్యుయేల్, జి. మధుర ప్రసాద్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. హీరో శ్రీవిష్ణు, దర్శకుడు రామ్‌ అబ్బరాజు కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘సామజవరగమన’. రెబా మోనికా జాన్‌ హీరోయిన్‌గా నటించారు. అనిల్‌ సుంకర సమర్పణలో రాజేష్‌ దండా నిర్మించిన ఈ చిత్రం 2023 జూన్‌ 29న విడుదలై, మంచి హిట్‌గా నిలిచింది. 

‘సామజవరగమన’ వంటి హిట్‌ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రామ్‌ అబ్బరాజు కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ద్వితీయ చిత్రం ‘ఫ్యామిలీ ప్యాక్‌’. వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన ఈ చిత్రం టైటిల్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్, మోషన్‌ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్‌. ఈ చిత్రానికి సహ నిర్మాత: అనిల్‌ యెర్నేని, సీఈఓ: చెర్రీ, కెమెరా: జె. యువరాజ్, సంగీతం: చేతన్‌ భరద్వాజ్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: చెంబోలు సాయి ఆదిత్య. 

సీక్వెల్‌తో షురూ 
తేజ సజ్జా హీరోగా కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘మిరాయ్‌’. రితికా నాయక్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మంచు మనోజ్, శ్రియ, జగపతి బాబు, జయరాం ప్రధాన ΄ాత్రలు ΄ోషించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్‌ నిర్మించిన ఈ మూవీ 2025 సెప్టెంబరు 12న విడుదలై, ఘన విజయం సాధించింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘మిరాయ్‌ 2: జైత్రయ’ ఉంటుందని చిత్రయూనిట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ‘మిరాయ్‌ 2: జైత్రయ’ షూటింగ్‌ ఎలాంటి హడావిడి లేకుండా వైజాగ్‌లో ఆరంభించారు మేకర్స్‌. అక్కడి ఆర్‌కే బీచ్‌లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే ఇది సినిమాకు సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ కాదట. కేవలం సినిమాలోని అత్యంత కీలకమైన, భారీ వీఎఫ్‌ఎక్స్‌ బ్లాక్స్‌ కోసం అవసరమైన సన్నివేశాలను మాత్రమే చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది.‘మిరాయ్‌’ సినిమాలో మంచు మనోజ్‌ విలన్‌గా ΄ాత్రలో కనిపించగా ‘మిరాయ్‌ 2: జైత్రయ’లో నటుడు రానా కూడా నెగెటివ్‌ రోల్‌ చేయనున్నారు. తేజ సజ్జా–కార్తీక్‌ ఘట్టమనేని కాంబినేషన్‌లో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై రూ΄÷ందుతోన్న ‘మిరాయ్‌ 2: జైత్రయ’ పై మంచి క్రేజ్‌ నెలకొంది.  

పైన పేర్కొన్న హీరోలు, దర్శకుల కాంబినేషన్స్‌ మాత్రమే కాదు.. మరికొన్ని హిట్‌ కాంబినేషన్స్‌ కూడా చర్చల దశల్లో ఉన్నాయి.
– డేరంగుల జగన్‌ మోహన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement