బీజింగ్: చైనాలో మరో భారీ బంగారు నిక్షేపం వెలుగుచూసింది. లియోనింగ్ ప్రావిన్స్‌లోని దాడోంగ్‌గౌ ప్రాంతంలో 1,400 టన్నులకు పైగా బంగారం ఉన్నట్లు ఆ దేశ సహజ వనరుల మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఈ బంగారం విలువ సుమారు 165 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో దాదాపు రూ.15.28 లక్షల కోట్లు. 1949 తర్వాత చైనాలో ఒకే ప్రాంతంలో గుర్తించిన అతిపెద్ద బంగారు నిక్షేపంగా ఇది నిలిచింది.
రెండు ప్రాంతాల్లో భారీ నిధులు
చైనాలోని రెండు ప్రావిన్సుల్లో భారీ బంగారు నిక్షేపాలు బయటపడ్డాయి. లియోనింగ్ ప్రావిన్స్‌లోని దాడోంగ్‌గౌలో 1,400 టన్నులకు పైగా బంగారం ఉన్నట్లు అంచనా వేయగా.. హునాన్ ప్రావిన్స్‌లోని వాంగు ప్రాంతంలో 1,000 టన్నులకు పైగా బంగారం ఉండవచ్చని భావిస్తున్నారు. వాంగులో ఈ నిక్షేపాలను 2024లో గుర్తించారు. అప్పట్లో వాటి విలువ 83 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ప్రస్తుత ధరల ప్రకారం ఈ విలువ సుమారు 114 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా.
మొత్తం విలువ 300 బిలియన్ డాలర్లు
ఈ రెండు ప్రాంతాల్లోని బంగారు నిక్షేపాల విలువ కలిపి సుమారు 300 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. అయితే ఇది భూమిలో ఉన్న మొత్తం బంగారం విలువ మాత్రమే. వెలికితీత ఖర్చులు, వాస్తవంగా ఎంత బంగారాన్ని తవ్వి తీసుకోగలరనే అంశాలు ఇందులో లేవు.
భారీగా వెలుగుచూసిన బంగారు నిల్వలు
వాంగు ప్రాంతంలో తొలుత 2,000 మీటర్ల లోతులో పరిశోధనలు చేయగా 300 టన్నుల బంగారం ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత మరో 1,000 మీటర్ల లోతులో పరిశోధనలు కొనసాగించగా ఈ అంచనా 1,000 టన్నులకు పెరిగింది. ఈ ఆవిష్కరణను చైనా అధికారిక వార్తా సంస్థ ‘సూపర్‌జెయింట్’ బంగారు నిక్షేపంగా అభివర్ణించింది.
200కు పైగా బోర్‌హోల్స్‌తో పరిశోధన
దాడోంగ్‌గౌలోని బంగారు నిక్షేపాలపై బీజింగ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు. 200కు పైగా డ్రిల్లింగ్ రంధ్రాల నుంచి సేకరించిన సమాచారం, క్షేత్రస్థాయి పరిశీలనలు, రాళ్లలోని క్వార్ట్జ్ స్ఫటికాల విశ్లేషణ ఆధారంగా ఈ అంచనాలకు వచ్చారు. తవ్విన ప్రతి బోర్‌హోల్‌లోనూ బంగారం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
తక్కువ శాతం బంగారం.. వెలికితీతపై అంచనాలు
ఈ నిక్షేపాల్లో బంగారం శాతం తక్కువగా ఉన్నప్పటికీ వెలికితీతకు అనుకూలంగా ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రతి టన్ను రాతిలో సగటున 0.56 గ్రాముల బంగారం ఉన్నట్లు అధికారిక అంచనా. బంగారం వెలికితీతలో 65 నుంచి 91 శాతం వరకు రికవరీ సాధ్యమవుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
ఎలా ఏర్పడ్డాయంటే?
ఈ బంగారు నిక్షేపాలు ఒకేసారి ఏర్పడలేదని పరిశోధకులు చెబుతున్నారు. భూమి పైపొరలో చోటుచేసుకున్న మార్పులు, కుదింపు, విస్తరణ ప్రక్రియలు వీటి ఏర్పాటులో కీలక పాత్ర పోషించి ఉండవచ్చని పేర్కొన్నారు. టాన్-లు ఫాల్ట్ ప్రాంతంలో జరిగిన కదలికలు కూడా ఈ నిక్షేపాల ఏర్పాటుకు దోహదపడి ఉండవచ్చని వివరించారు.


