రెండు విమానాలు ఢీ.. రెక్కలు విరిగి నేలపై.. | Two American Airlines jets collide clip wings at Reagan airport | Sakshi
Sakshi News home page

రెండు విమానాలు ఢీ.. రెక్కలు విరిగి నేలపై..

Nov 28 2026 10:22 AM | Updated on Nov 28 2026 10:22 AM

Two American Airlines jets collide clip wings at Reagan airport

వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో గల రోనాల్డ్‌ రీగన్‌ జాతీయ విమానాశ్రయంలో రెండు అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాలు పరస్పరం ఢీకొన్నాయి. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. టేకాఫ్‌ కోసం రన్‌వేపైకి వెళ్లేందుకు కదులుతున్న సమయంలో రెండు బోయింగ్‌ 737-800 విమానాల రెక్కలు ఒకదానికొకటి తగిలాయి. ఈ ఘటనపై అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ) దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు.

టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా..
ఎఫ్‌ఏఏ తెలిపిన వివరాల ప్రకారం.. డల్లాస్‌-ఫోర్ట్‌వర్త్‌కు వెళ్లాల్సిన అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం 638, చికాగోకు బయలుదేరాల్సిన విమానం 2152 రెక్కను తాకింది. శుక్రవారం సాయంత్రం స్థానిక కాలమానం ప్రకారం 5.10 గంటల సమయంలో విమానాలు బయలుదేరేందుకు క్యూలో వేచి ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. దీంతో రెండు విమానాలను తిరిగి గేట్ల వద్దకు తీసుకెళ్లారు.

ఒక్కసారిగా కుదుపు.. ప్రయాణికుల్లో ఆందోళన
విమానం 2152లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి బీబీసీతో మాట్లాడుతూ.. విమానం బయలుదేరడానికి కొద్దిసేపటి ముందు కుడివైపు నుంచి పెద్ద కుదుపు వచ్చినట్లు అనిపించిందని తెలిపాడు. విమానం ఒక్కసారిగా బలంగా కంపించడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారని చెప్పాడు. కిటికీలోంచి చూడగా ఓ విమానం రెక్క చివరి భాగం విరిగినట్లు కనిపించిందని, మరో విమానం రెక్క తమ విమానానికి తగిలి ఉన్నట్లు గుర్తించానని వివరించాడు.

రెండు విమానాలు సర్వీసుల నుంచి తొలగింపు
ఘటన అనంతరం విమానాశ్రయ అగ్నిమాపక, సహాయక సిబ్బంది రెండు విమానాలను తనిఖీ చేశారు. రెండు విమానాల రెక్కల చివరి భాగాలు ఒకదానికొకటి తగిలినట్లు అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ ధ్రువీకరించింది. ముందు జాగ్రత్త చర్యగా రెండు విమానాలనూ నిర్వహణ తనిఖీల కోసం సర్వీసుల నుంచి తొలగించింది. ప్రభావిత ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన సంస్థ.. వారిని వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

గతంలోనూ ఇదే విమానాశ్రయంలో ప్రమాదం
రీగన్‌ జాతీయ విమానాశ్రయంలో గతంలో జరిగిన ఘోర ప్రమాదం మరోసారి చర్చనీయాంశమైంది. 2025 జనవరిలో అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రయాణికుల విమానం, అమెరికా సైన్యానికి చెందిన బ్లాక్‌హాక్‌ హెలికాప్టర్‌ను ఢీకొన్న ఘటనలో 67 మంది ప్రాణాలు కోల్పోయారు. విచితా నుంచి వస్తున్న ప్రయాణికుల విమానం పొటోమాక్‌ నదిలో కూలిపోయింది. హెలికాప్టర్‌ ఎత్తుకు సంబంధించిన సమాచారంలో లోపాలు ప్రమాదానికి కారణమైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. అలాగే 2025 ఏప్రిల్‌లోనూ టేకాఫ్‌ కోసం వేచి ఉన్న రెండు అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాలు పరస్పరం తాకాయి. ఆ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌, పెంటగాన్‌కు సమీపంలో ఉన్న రీగన్‌ విమానాశ్రయం దేశ రాజధానికి సేవలందించే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటి.

ఇదీ చదవండి: Puerto Rico: పెరిగిన విద్యుత్ ఛార్జీలు.. జనం తిరుగుబాటు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement