ఢిల్లీ: దేశ రాజకీయాల్లో మరోసారి డీలిమిటేషన్ అంశం ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి చివరి ప్రయత్నాలకు సిద్ధమవుతోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సమీపిస్తున్న వేళ విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను తమ వైపు తిప్పుకునేందుకు ఇండియా కూటమి నేతలు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
బిల్లుకు మద్దతు విషయంలో డీఎంకే వైఖరి కీలకంగా మారడంతో స్టాలిన్‌కు బహిరంగ విజ్ఞప్తి చేయాలని కూడా విపక్షాలు ఆలోచిస్తున్నట్లు ఇద్దరు సీనియర్ ప్రతిపక్ష నేతలు వెల్లడించినట్లు హిందుస్తాన్ టైమ్స్ కథనం పేర్కొంది. ఈ రాజకీయ పోరులో డీఎంకే వైఖరి అత్యంత కీలకంగా మారింది. గతంలో డీలిమిటేషన్ బిల్లును ఓడించడంలో డీఎంకే కీలక పాత్ర పోషించిందని వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ గుర్తుచేశారు. ఈసారి కూడా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బిల్లుకు మద్దతు ఇవ్వకూడదని డీఎంకేను కోరారు.
సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ మాట్లాడుతూ.. స్టాలిన్‌ను ఒప్పించేందుకు తమ రాష్ట్ర నాయకులకు సూచించినట్లు వెల్లడించారు. తిరుప్పరంకుండ్రం వివాదాన్ని రాజకీయ అంశంగా మార్చకుండా, డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వకూడదని ఆయనను కోరనున్నట్లు తెలిపారు. మరోవైపు, డీఎంకే అధినేత్రి ఎంకే స్టాలిన్‌తో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడారన్న వార్తలను ఆ పార్టీ రాజ్యసభ నేత డెరెక్ ఓబ్రెయిన్ ఖండించారు. అయితే ఇండియా కూటమి తరఫున స్టాలిన్‌కు బహిరంగ విజ్ఞప్తి చేసే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు.
230 ఓట్ల నుంచి 57 మంది తగ్గే పరిస్థితి?
ఈ బిల్లును అడ్డుకోవడంలో సంఖ్యాబలమే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ఓడించేందుకు ఇండియా కూటమికి 230 మంది ఎంపీల మద్దతు లభించింది. అయితే ఇప్పుడు రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. విపక్ష కూటమి సంఖ్యాబలం కనీసం 57 మంది ఎంపీల మేర తగ్గిపోయే పరిస్థితి ఉందని తాజా రాజకీయ అంచనాలు సూచిస్తున్నాయి. డీఎంకేకు చెందిన 22 మంది ఎంపీలు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి 20 మంది ఎంపీలు బిల్లుకు మద్దతు ఇవ్వనున్నట్లు కథనంలో పేర్కొన్నారు. అలాగే, శివసేన (యూబీటీ)లోని కొందరు ఎంపీలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరడం, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) వైఖరిలో వచ్చిన మార్పులు కూడా విపక్షాల లెక్కలను ప్రభావితం చేస్తున్నాయి. ఇదే సమయంలో తమ పార్టీల్లోని కొందరు ఎంపీలు బిల్లును వ్యతిరేకించే అవకాశం ఉందని విపక్ష నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మోదీ సర్కారుపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
డీలిమిటేషన్ బిల్లుపై కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ విభాగం ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మాట్లాడుతూ.. లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీని సృష్టించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు, లోక్‌సభ స్థానాల పెంపునకు ముడిపెట్టి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ చట్టం ఇప్పటికే 2023లో ఆమోదం పొందిందని, ఇప్పుడు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల అసలు ఉద్దేశం డీలిమిటేషన్ అని ఆయన ఆరోపించారు. ఎన్నికల సంఘం పనితీరుపైనా కాంగ్రెస్ నేతలు ప్రశ్నలు లేవనెత్తారు. డీలిమిటేషన్ ప్రక్రియలో ఎన్నికల సంఘం పాత్రపై తమకు అభ్యంతరాలున్నాయని గౌరవ్ గొగోయ్ పేర్కొన్నారు.
తేజస్వీ కీలక వ్యాఖ్యలు
డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ దుమారం కొనసాగుతుండగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చెప్పేదొకటి.. చేసేదొకటి అన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల అమలుపై తమ పార్టీకి మొదటి నుంచీ స్పష్టమైన వైఖరి ఉందని తెలిపారు. బీజేపీ అనేక ప్రాంతాల్లో సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పటికీ మహిళా రిజర్వేషన్ల అమలులో ఆశించిన పురోగతి కనిపించలేదని వ్యాఖ్యానించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు కలిసి చర్చించి, ఏకాభిప్రాయానికి రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: టీఎంసీ రెబెల్స్‌కు కలకత్తా హైకోర్టులో ఎదురుదెబ్బ


