అజారుద్దీన్, సంజూ (PC: KCA X)
దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2026 సీజన్‌లో కేరళ జట్టు ఐదో విజయం సాధించింది. ఎలైట్ గ్రూప్-‘సి’లో భాగంగా గురువారం హిమాచల్ ప్రదేశ్ జట్టుపై 67 పరుగుల తేడాతో గెలుపొందింది. న్యూ చండీగఢ్ వేదికగా కేరళ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
శతక్కొట్టిన ఓపెనర్.. సంజూ మెరుపులు
ఓపెనర్లలో మహ్మద్ అజారుద్దీన్ శతక్కొట్టగా (57 బంతుల్లో 101), రోహన్ కణ్ణుమ్మల్ 16 బంతుల్లోనే 35 పరుగులతో ఆకట్టుకున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ కేవలం 21 బంతుల్లోనే ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 44 పరుగులు సాధించాడు.
మిగిలిన వారిలో విష్ణు వినోద్ (11 బంతుల్లో 22), సల్మాన్ నిజార్ (15 బంతుల్లో 26 నాటౌట్) రాణించగా.. అబ్దుల్ బసిత్ సునామీ ఇన్నింగ్స్ (5 బంతుల్లో 24 నాటౌట్)తో అరదగొట్టారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయిన కేరళ ఏకంగా 268 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.
201 పరుగులకే పరిమితం
హిమాచల్ ప్రదేశ్ బౌలర్లలో మృదుల్ సురోచ్ రెండు వికెట్లు తీయగా.. ఆర్యమన్ సింగ్ ధలీవాల్, అర్పిత్ గులేరియా చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన హిమాచల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమైంది.
మెరుపులు సరిపోలేదు
ఏకంత్ సేన్ (27 బంతుల్లో 39), కెప్టెన్ ఫక్రాజ్ మన్ (16 బంతుల్లో 29), మృదుల్ సురోచ్ (15 బంతుల్లో 29) రాణించగా.. వైభవ్ కల్తా మెరుపు అర్ధ శతకం (28 బంతుల్లో 57 నాటౌట్) సాధించాడు. అతడికి తోడుగా ఆర్యమన్ సింగ్ వేగంగా (21 బంతుల్లో 30 నాటౌట్) ఆడే ప్రయత్నం చేశాడు.
కానీ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 201 పరుగులకే పరిమితమై జట్టు ఓటమిని మూటగట్టుకుంది. కేరళ బౌలర్లలో వైశాఖ్ చంద్రన్ రెండు వికెట్లు తీయగా.. ఎండీ నిధీశ్, కేఎమ్ ఆసిఫ్, కార్తిక్ నాయర్, అబ్దుల్ బసిత్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
కాగా కేరళ ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఐదో విజయం నమోదు చేసింది. మరోవైపు.. హిమాచల్ ప్రదేశ్ జట్టు సైతం ఇప్పటికి ఏడింట ఐదు గెలిచింది.
ఇదీ చదవండి: రిషభ్ పంత్ విధ్వంసం.. 21 బంతుల్లోనే..


