భారత జట్టు (PC: BCCI X)
న్యూజిలాండ్- టీమిండియా మధ్య రెండో టెస్టుకు రంగం సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య శుక్రవారం మొదలయ్యే ఈ మ్యాచ్‌కు క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లే ఓవల్ మైదానం వేదిక. ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.
రెండు మార్పులు
ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు మార్పులు తప్పనిసరి అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. లేదంటే ఈ మ్యాచ్‌లో గెలవడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-2027 సీజన్‌లో భాగంగా భారత్ కివీస్ జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది. ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ సిరీస్‌లో తొలి టెస్టును టీమిండియా డ్రా చేసుకుంది.
విమర్శలు
ఈ మ్యాచ్‌లో సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ఆడే అవకాశం రాలేదు. అతడితో పాటు సీనియర్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా బెంచ్‌కే పరిమితమయ్యాడు. సిరాజ్ స్థానంలో... జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్‌తో కలిసి అన్షుల్ కాంబోజ్ పేస్ దళంలో చోటు దక్కించుకోగా.. జడ్డూకు బదులు వాషింగ్టన్ సుందర్ ఆడాడు.
వాషీపై భారం.. మ్యాచ్ డ్రా
అయితే, కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ ఫ్లాట్‌గా మారడంతో వాషీపై ఎక్కువ భారం పడింది. పేసర్లు సగటున 20 ఓవర్ల బౌలింగ్‌కు పరిమితం కాగా.. వాషీ ఏకంగా 35 ఓవర్ల పాటు బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ఆఖరి రోజు భారత్ విజయానికి ఐదు వికెట్ల దూరంలో నిలిచిపోగా.. కివీస్ బ్యాటర్లు పట్టుదలగా నిలబడి మ్యాచ్ డ్రా అయ్యేలా చేశారు.
ఛాన్స్ లేదన్న కెప్టెన్ గిల్
ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యంపై విమర్శలు వచ్చాయి. సిరాజ్, జడ్డూలను ఆడిస్తే బాగుండనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాత్రం.. వీరిద్దరు జట్టుతో ఉన్నా పెద్దగా తేడా ఉండకపోయేదని.. రెండో టెస్టులోనూ వీరిని ఆడించడం కష్టమేననే సంకేతాలు ఇచ్చాడు.
అతడు లేకుండా గెలవలేము
ఈ పరిణామాల క్రమంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. సిరాజ్, జడ్డూలను ఆడించాల్సిన ఆవశ్యకత గురించి వివరించాడు. ముఖ్యంగా సిరాజ్ లేకపోతే SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో టెస్టు మ్యాచ్ గెలవడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ..
‘‘న్యూజిలాండ్‌తో రెండో టెస్టు నేపథ్యంలో భారత తుదిజట్టులో రెండు మార్పులకు ఆస్కారం ఉంది. ఇరవై వికెట్లు పడగొట్టాలంటే సిరాజ్ అవసరం. గత మ్యాచ్‌లో ఏం జరిగిందో చూశాము కదా!.. సిరాజ్ ఫామ్‌లో లేడని కెప్టెన్ చెప్పినా సరే.. అతడిని ఆడించాల్సిందే.
బెంచ్ మీద కూర్చోపెట్టినంత మాత్రాన అతడు ఫామ్‌లోకి రాలేడు కదా! అందుకే సిరాజ్‌ను ఆడించాలి. గత దశాబ్ద కాలంలో SENA దేశాల్లో సిరాజ్ లేకుండా టీమిండియా మ్యాచ్‌లు గెలిచినట్లు నాకైతే గుర్తు లేదు. బుమ్రా లేకపోయినా మనం గెలిచాం. కానీ సిరాజ్ లేకుండా గెలవలేదు.
వాషీని తప్పించి జడ్డూను ఆడించండి
కాబట్టి తొలి టెస్టు ఆడిన ఫాస్ట్ బౌలర్లలో ఒకరిని బెంచ్ మీద కూర్చోబెట్టండి. అతడు మరెవరో కాదు అన్షుల్ కాంబోజ్. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేసే వాళ్ల అవసరం ప్రస్తుతానికి కనబడటం లేదు. కాబట్టి అతడిని పక్కనపెట్టేయండి.
ఇక వాషింగ్టన్ సుందర్‌ను తప్పించి రవీంద్ర జడేజాను ఆడించాలి. టెస్టు క్రికెట్‌లో వికెట్లు తీయలాంటే జడ్డూ లాంటి ఆటగాడి అవసరం ఉంటుంది. టెస్టులు లేదంటే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఒక మ్యాచ్‌లో సగటున నాలుగు వికెట్లు తీసే వారి అవసరమే జట్టుకు ఎక్కువగా ఉంటుంది’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ఆడిన భారత జట్టు
కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్, అన్షుల్ కాంబోజ్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణ.
బెంచ్: సాయి సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్.
న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న జట్టు
కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణ.
బెంచ్: సాయి సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్.
ఇవీ చదవండి: రిషభ్ పంత్ విధ్వంసం.. 21 బంతుల్లోనే..
అతడు సూపర్ బౌలర్.. అరంగేట్రానికి సిద్ధమే: టీమిండియా కోచ్


