2027 యూపీ ఎన్నికలు: మాయావతివైపు కాంగ్రెస్ చూపు? | Mayawati would have to step forward Congress MP | Sakshi
Sakshi News home page

2027 యూపీ ఎన్నికలు: మాయావతివైపు కాంగ్రెస్ చూపు?

Nov 26 2026 8:36 AM | Updated on Nov 26 2026 8:36 AM

Mayawati would have to step forward Congress MP

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాల విషయంలో విభేదాలు తలెత్తుతున్న నేపథ్యంలో.. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో పొత్తు పెట్టుకునే అవకాశాలను కాంగ్రెస్ పరిశీలిస్తోంది. అయితే ఈ పొత్తు ప్రతిపాదనపై బీఎస్పీ అధినేత్రి మాయావతే ముందడుగు వేయాలని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్, ఎస్పీ మధ్య పొత్తుపై చర్చలు జరుగుతున్నప్పటికీ.. ఇటీవల ఎస్పీ ప్రకటించిన ఐదుగురు అభ్యర్థుల జాబితా వివాదానికి కారణమైంది. ఇందులో కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ప్రాతినిధ్యం వహిస్తున్న సహారన్‌పుర్ నియోజకవర్గం కూడా ఉండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీఎస్పీతో పొత్తు అంశం తెరపైకి వచ్చింది.

మాయావతితో పొత్తుపై స్పందించిన ఇమ్రాన్ మసూద్.. ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. లౌకికవాదాన్ని కాపాడాలని కోరుకునే భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాలని తాను ఎప్పటినుంచో చెబుతున్నట్లు తెలిపారు. అయితే మాయావతి స్వయంగా ముందుకు రావాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.

మరోవైపు సీట్ల పంపకాల విషయంలో ఎస్పీ తీరుపై కాంగ్రెస్ అసంతృప్తిగా ఉంది. ఢిల్లీలో రెండు పార్టీల మధ్య సమావేశాలు జరిగిన తర్వాత 26 స్థానాల నుంచే చర్చలు ప్రారంభించాలని చెప్పడంపై ఇమ్రాన్ మసూద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము 26 సీట్లు అడగలేదని, సీట్ల కోసం తాము ఎవరినీ బతిమాలుకోవడం లేదని స్పష్టం చేశారు. అయితే రెండు పార్టీల నేతలు మాత్రం చర్చలు సానుకూల వాతావరణంలోనే జరుగుతున్నాయని తెలిపారు. సీట్ల పంపకాలపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని, మరో రెండు మూడు రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుందని ఎస్పీ రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ తెలిపారు. కాంగ్రెస్ నేత రాజేంద్ర పాల్ గౌతమ్ సైతం పరస్పర విశ్వాసంతో సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పారు.

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తోంది. మరోవైపు అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఎంఐఎం, చంద్రశేఖర్ ఆజాద్‌కు చెందిన ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) కూడా పొత్తు కుదుర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్-ఎస్పీ బంధం కొనసాగుతుందా? బీఎస్పీ కొత్త కూటమిలోకి వస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: కర్తార్‌పూర్‌ తెరవాలా? కేంద్రం నిర్ణయానికే హైకోర్టు మొగ్గు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement