PC: BCCI X
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ విషయంలో వస్తున్న విమర్శలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పందించింది. అతడిని అనవసరపు వివాదాల్లోకి లాగొద్దని.. ఇది సిరాజ్‌తో పాటు జట్టుకూ మంచిది కాదని పేర్కొంది.
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో సిరాజ్‌కు తుదిజట్టులో చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే. అతడిని కాదని యువ బౌలర్ అన్షుల్ కాంబోజ్‌ను ఆడించింది యాజమాన్యం. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లతో పాటు.. పలువురు రాజకీయ నాయకులు సైతం బీసీసీఐని విమర్శించారు.
రాజకీయ దుమారం
ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీలు బహిరంగంగా విమర్శలకు దిగడం రాజకీయ దుమారం రేపింది. పేరు కారణంగానే అతడిని పక్కనపెట్టారంటూ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకు బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ స్పందిస్తూ.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ డ్రామా ఆడుతోందంటూ కౌంటర్ ఇచ్చారు.
జడేజా గురించి ఎందుకు మాట్లాడటం లేదు?
సిరాజ్ ముస్లిం కాబట్టే పక్కనబెట్టారని అనే వాళ్లు.. రవీంద్ర జడేజాను కూడా ఈ మ్యాచ్‌లో ఆడించలేదన్న విషయాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రదీప్ భండారీ ప్రశ్నించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ కమటీ మెంబర్ రాజీవ్ శుక్లా తాజాగా స్పందించారు.
వివాదాల్లోకి లాగడం సరికాదు
ANIతో మాట్లాడుతూ.. ‘‘సిరాజ్ ఆడలేదు కాబట్టే న్యూజిలాండ్‌తో తొలి టెస్టు డ్రా అయినందని చెప్పలేము. అసలు సిరాజ్‌ను ఇలాంటి వివాదాల్లోకి లాగడం సరికాదు. అతడి చుట్టూ ఇంతటి వివాదం అవసరం లేదు. అతడు ఇప్పటికీ టీమిండియాలో భాగమే.
భారత జట్టుకు ఎంపిక కావడమే అన్నింటికంటే గొప్ప విషయం. తుదిజట్టులో ఓ ఆటగాడికి చోటు ఇవ్వాలా? లేదా? అనేది హెడ్‌కోచ్, కెప్టెన్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. పిచ్ పరిస్థితులతో పాటు వివిధ కారణాల దృష్ట్యా వారు తమకు అనుగుణమైన జట్టును ఎంపిక చేసుకుంటారు.
కోచ్, కెప్టెన్‌దే అంతిమ నిర్ణయం
ఈ విషయంలో రాజకీయాలు చేయడం, వివాదాలు సృష్టించడం సరికాదు. ఇది సిరాజ్‌తో పాటు జట్టుకు మంచిది కాదు. పిచ్ పరిస్థితులు, జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే కోచ్, కెప్టెన్ తుదిజట్టును ఎంపిక చేస్తారని మరోసారి స్పష్టం చేస్తున్నా’’ అని రాజీవ్ శుక్లా పేర్కొన్నారు. కాగా వెల్లింగ్‌టన్‌లో కివీస్‌తో తొలి టెస్టు డ్రా కాగా.. ఇరుజట్ల మధ్య శుక్రవారం మొదలయ్యే రెండో టెస్టుకు క్రైస్ట్‌చర్చ్ వేదిక.
ఇవీ చదవండి: Asia Cup Rising Stars: సెమీ ఫైనల్స్ షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
‘ఆర్సీబీ నన్ను కొనకపోయినా పర్లేదు.. అతడికి పోటీగానైనా ఆడతా’


