‘మేమేమైనా బిచ్చగాళ్లమా?’.. అఖిలేష్‌పై కాంగ్రెస్‌ ఆగ్రహం | Congress Slams Akhilesh Amid UP Seat Row | Sakshi
Sakshi News home page

‘మేమేమైనా బిచ్చగాళ్లమా?’.. అఖిలేష్‌పై కాంగ్రెస్‌ ఆగ్రహం

Nov 25 2026 12:22 PM | Updated on Nov 25 2026 12:22 PM

Congress Slams Akhilesh Amid UP Seat Row

లక్నో: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సీట్ల సర్దుబాటు చర్చల వేళ సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉద్రిక్తతలకు దారితీసింది. తొలి జాబితాలో ఐదుగురు అభ్యర్థులను ప్రకటించడంతో పాటు, కాంగ్రెస్‌కు 26 సీట్లు కేటాయిస్తున్నట్లు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించడంపై కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీట్ల విషయంలో ఎస్పీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. ‘పొత్తు ఎక్కడ ఉంది? ఇలా వ్యవహరిస్తే పొత్తు ఎక్కడున్నట్లు? మా పార్టీ అధిష్ఠానమే ఏం చేయాలో నిర్ణయిస్తుంది. నాకైతే ఇది అర్థం కావడం లేదు. ఇక్కడ ఒక మాట చెబుతారు, అక్కడ మరొకటి జరుగుతుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

తాము ఇంకా అధికారికంగా సీట్లు అడగకముందే 26 సీట్లు ప్రకటించడంపై మసూద్ నిలదీశారు.‘మేమేమైనా బిచ్చగాళ్లమా? మేము సీట్లే అడగకుండానే 26 సీట్లు ప్రకటించి మమ్మల్ని ఇలా చూస్తారా?. మేము మీ దగ్గర సీట్లు అడగనే లేదు. మీరే నిబంధనలు విధిస్తామంటే ఆత్మగౌరవం ఉన్న వ్యక్తిగా నాకు ఇవి అర్థం కావు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకంపై మంగళవారం న్యూఢిల్లీలో ఇరు పార్టీల మధ్య సుమారు 3.5 గంటల పాటు చర్చలు జరిగాయి. చర్చల్లో పురోగతి ఉందని ఇరుపక్షాలు చెప్పినా, ఎలాంటి తుది ఒప్పందం ప్రకటించలేదు.ఈ నేపథ్యంలో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన అనంతరం అఖిలేష్ యాదవ్ ఎక్స్‌వేదికగా స్పందించారు. గెలిచే అవకాశాన్ని బట్టి కాంగ్రెస్‌కు తొలుత 26 నియోజకవర్గాలను ఆఫర్ చేశామని, చర్చలు కొనసాగుతాయని పేర్కొన్నారు. మొదటి 26 సీట్లతో విజయప్రస్థానం మొదలైంది. వివేకంతో కలిసి పనిచేస్తూ ముందుకు సాగుదాం అని పేర్కొన్నారు.  

మరోవైపు యూపీలో కనీసం 120 సీట్లు కావాలని కాంగ్రెస్ పట్టుబడుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ కోరుతున్న జాబితాలో సహారన్‌పుర్‌లోని రెండు సీట్లతో పాటు రాయబరేలీ, అమేథీ నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. సహారన్‌పుర్‌లోని ఆ సీట్లకు ఎస్పీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా, జాబితాలోని మరికొన్ని సీట్లలో ఎస్పీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండటమే వివాదానికి కారణమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement