దలైలామాకు ప్రత్యేక బంగ్లా.. కేంద్రం కీలక నిర్ణయం! | Dalai Lama allotted bungalow in Lutyens Delhi | Sakshi
Sakshi News home page

దలైలామాకు ప్రత్యేక బంగ్లా.. కేంద్రం కీలక నిర్ణయం!

Nov 25 2026 8:26 AM | Updated on Nov 25 2026 8:26 AM

Dalai Lama allotted bungalow in Lutyens Delhi

న్యూఢిల్లీ: టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా కార్యాలయం కోసం దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత భద్రత కలిగిన ప్రాంతమైన లుటియెన్స్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బంగ్లాను కేటాయించింది. పండిట్‌ రవిశంకర్‌ శుక్లా లేన్‌లోని 20వ నంబరు బంగ్లాను ఆయన కార్యాలయమైన గాడెన్‌ ఫోడ్రాంగ్‌ వినియోగానికి కేటాయించారు. గతంలో ఈ బంగ్లా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరీ అధికారిక నివాసంగా ఉంది.

బీజేపీ ఉత్తరప్రదేశ్‌ అధ్యక్షుడిగా ఉన్న పంకజ్‌ చౌధరీ 2014 నుంచి 2024 వరకు 16వ, 17వ లోక్‌సభ సభ్యుడిగా ఉన్న సమయంలో ఈ బంగ్లాలో నివసించారు. 2024 జులైలో తిరిగి ఎన్నికైన తర్వాత 35, లోధి ఎస్టేట్‌కు మారారు. 2026 ఏప్రిల్‌ 24న ప్రచురించిన లోక్‌సభ సభ్యుల అధికారిక డైరెక్టరీలోనూ ఈ బంగ్లా ఆయన చిరునామాగానే నమోదైంది. 2025లో విదేశాంగ శాఖ (ఎంఈఏ) ఈ భవనాన్ని తన కార్యకలాపాల కోసం కేటాయించాలని గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరింది. దీంతో అదే ఏడాది అక్టోబరులో పరిపాలనా ప్రక్రియ ద్వారా బంగ్లాను విదేశాంగ శాఖకు బదిలీ చేశారు. అనంతరం దలైలామా కార్యాలయమైన గాడెన్‌ ఫోడ్రాంగ్‌ వినియోగానికి అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ బంగ్లాలో అదనపు భద్రతా ఏర్పాట్లు చేసేందుకు కేంద్ర ప్రజాపనుల శాఖ రూ.34.94 లక్షలతో టెండర్‌ కూడా జారీ చేసింది. దలైలామా ఢిల్లీ పర్యటనల సమయంలో ఆయన కార్యాలయానికి అవసరమైన వసతి, భద్రతా సదుపాయాలు కల్పించడమే ఈ కేటాయింపు ప్రధాన ఉద్దేశం. దలైలామా ఢిల్లీకి వచ్చిన ప్రతిసారీ తగిన హోటల్‌ వసతి పొందడం, అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయడం ఇబ్బందిగా మారుతున్నాయని ఆయన కార్యాలయం వెల్లడించింది. ముఖ్యంగా ఆయన వయసును దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యలను అధిగమించేందుకు విదేశాంగ శాఖ సమన్వయంతో ప్రత్యేక భవనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. దీంతో రాజధానిలో ఆయన పర్యటనల సమయంలో గాడెన్‌ ఫోడ్రాంగ్‌కు శాశ్వత కార్యాచరణ కేంద్రం అందుబాటులోకి రానుంది.

ఇదీ చదవండి: ‘నన్ను గెంటేశారు.. హసీనాను..’: తస్లీమా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement