దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని ప్రీత్ విహార్‌లో ఓ కేఫ్‌లో తనతో కలిసి పనిచేసే సహోద్యోగులు 22 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. నిన్న సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బాధితురాలు, నిందితులు ఒకే కేఫ్‌లో పనిచేస్తున్నారు. బాధితురాలు తన సహోద్యోగులతో కలిసి ప్రీత్ విహార్‌లోని ‘సాల్టనేట్ కేఫ్’లో జరిగిన పార్టీకి హాజరైంది.
రాత్రి 11.30 గంటలకు కేఫ్ మూసివేసినప్పటికీ.. వారిలో ఒకరి వద్ద కేఫ్ తాళం చెవి ఉండటంతో పార్టీ కొనసాగించారు. మద్యం సేవిస్తూ, డ్యాన్స్ చేస్తూ గడిపారు. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అక్కడి నుంచి బయలుదేరారు. పార్టీ సమయంలో ఇద్దరు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని.. మిగిలిన వారు వారికి సహకరించారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఘటనపై నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా.. మిగిలిన వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: బీజేపీ మహిళా ఎమ్మెల్యేపై విషప్రయోగం!


