జ్ఞాపకశక్తి గల్లంతే!
గదిలోకి వెళ్లి.. అక్కడికి ఎందుకు వెళ్లారో మర్చిపోతున్నారా? స్నేహితుల స్నేహితుల పేర్లను గుర్తు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా? సరిగా గుర్తులేక ఒకే సందేశాన్ని పదేపదే చదువుతున్నారా? ఇది ఇటీవలి కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యే. అయితే, ఇందుకు అలసట, ఒత్తిడి, చాలా విషయాలు ఉండటం వల్ల ఈ గందరగోళం ఏర్పడుతుందని చాలా మంది అనుకుంటారు. అయితే, అదే నిజం.
కానీ ఈ గందరగోళం, ఏర్పడటానికి కారణం మన మెదడుకు రాత్రిపూట జరగాల్సిన నిర్వహణ లోపించడం. నిద్ర శరీరంతోపాటు, మెదడుకు విశ్రాంతి నివ్వడమే కాదు, ఆ రోజు జరిగిన విషయాలను మెదడు నిద్రలో సమీక్షిస్తుంది. అవసరమైన వాటిని గుర్తుంచుకుంటుంది. అనవసర విషయాలను తొలగిస్తుంది. సరిగ్గా నిద్రపోకపోతే ఈ ప్రక్రియలేవీ జరగవు. దీంతో, ఇప్పుడే కాదు, భవిష్యత్తులో గుర్తుంచుకోవాల్సిన విషయాలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది. అంతేకాదు, నిద్ర సరిగా లేనప్పుడు మెదడులోని ‘హిప్పోకాంపస్’చురుగ్గా పనిచేయదు.
దీనివల్ల కొత్త విషయాలపై ఏకాగ్రత పెట్టడం, వాటిని మెదడులోకి ఎక్కించుకోవడం కష్టమవుతుంది. నిద్ర లేకపోవడంతో జీవితంలో జ్ఞాపకశక్తి సమస్యలు వస్తాయి. సరిగా నిద్రపోని వ్యక్తుల్లో అల్జీమర్స్ వ్యాధితో సంబంధం ఉండే అమైలాయిడ్–బీటా, టౌ అనే రెండు ప్రోటీన్ల స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి. రాత్రంతా మేల్కొని ఉన్నప్పటితో పోలిస్తే, రాత్రి మంచి నిద్రపోయిన వారి మెదడులో అమైలాయిడ్ బీటా, టౌ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నాయి.
నిద్ర సరిగా లేకపోతే ఇవి పేరుకుపోయి దీర్ఘకాలంలో మతిమరుపు సమస్యలకు దారితీస్తాయి. మెదడు నిద్రలో ఉన్నప్పుడు ఈ ప్రోటీన్లను తొలగించి, వాటిని తీసివేయడం కోసం రక్తంలోకి పంపుతోందని పరిశోధకులు నమ్ముతున్నారు. పగలంతా పేరుకుపోయిన నగరం చెత్తను రాత్రిపూట మున్సిపల్ సిబ్బంది శుభ్రపరిచినట్టు.. మెదడులో గ్లింఫాటిక్ వ్యవస్థ పగటిపూట పేరుకుపోయే వ్యర్థాలను కడిగివేయడానికి సహాయపడుతుంది. నిద్రపోయే సమయంలోనే ఈ శుభ్రపరిచే వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. రాత్రి ఆరోగ్యకరమైన నిద్ర, జ్ఞాపకశక్తిని తగ్గించే కొన్ని పదార్థాలను మెదడు తొలగించేస్తుంది.
నిద్ర, జ్ఞాపకశక్తి ఒకదానికొకటి పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. నిద్ర మన జ్ఞాపకాలను ప్రభావితం చేస్తుంది. మన జ్ఞాపకాలు మన నిద్రను ప్రభావితం చేస్తాయి. శాస్త్రవేత్తలు ఎలుకల ద్వారా ఈ సంబంధాన్ని అన్వేíÙంచారు. ఒక సమూహంలోని ఎలుకల మంచి సానుకూల అనుభవాలకు, మరొక సమూహాన్ని ఒత్తిడితో కూడిన అనుభవాలకు పరిశోధకులు గురిచేశారు. నిద్రలో ఉన్నప్పుడు, ఆ ఎలుకలు తమ రోజులోని జ్ఞాపకాలను తిరిగి గుర్తుచేసుకున్నట్లు కనిపించాయి.
ఒత్తిడితో కూడిన సంఘటనలను ఎదుర్కొన్న ఎలుకలు సరైన నిద్ర పోలేకపోయాయి. సానుకూల అనుభవాలు పొందిన ఎలుకలు మాత్రం గాఢంగా, స్థిరంగా నిద్రపోయాయి. ఈ జ్ఞాపకాలు నిద్ర నాణ్యతను నేరుగా ప్రభావితం చేస్తున్నట్లు కనిపించాయి. జంతువులపై జరిగిన ఈ అధ్యయనాన్ని మనుషులకు సాధారణీకరించలేము. కానీ ఒత్తిడి, నిద్రలేమి సంబంధానికి ఉన్న ఆధారాన్ని తెలుపుతుంది.
జనాభాలో 9–38 శాతం మందిని ప్రభావితం చేసే ఒక రుగ్మత స్లీప్ అప్నియా. ఇది నిద్రలో శ్వాస ఆగిపోవడానికి కారణమవుతుంది. శ్వాసలో అంతరాయాల వల్ల అంతరాయాలు తరచూ మెలకువ వస్తుంది. ఇది నిద్రకు అంతరాయం కలుగుతుంది. ఈ అంతరాయాలు మెదడుకు అవసరమైన గాఢమైన, విశ్రాంతికరమైన నిద్రను కరువు చేస్తాయి. అందుకే తీవ్రమైన స్లీప్ అప్నియా ఉన్న వ్యక్తులు జ్ఞాపకశక్తి, ఆలోచనా పరీక్షల్లో తక్కువ ప్రతిభ కనబరుస్తారని పరిశోధనలు చెబుతున్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్


