లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన ఎన్నికలుగా గుర్తింపు పొందాయి. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం కావడం, 403 అసెంబ్లీ స్థానాలు ఉండటం, జాతీయ రాజకీయాలపై రాష్ట్ర ప్రభావం ఎక్కువగా ఉండటం ఇందుకు ప్రధాన కారణాలు. ఇక్కడి ఎన్నికల ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకే పరిమితం కావు. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల వ్యూహాలు, కూటముల సమీకరణాలు, భవిష్యత్తు రాజకీయ చర్చలపైనా ప్రభావం చూపుతాయి.
ఉత్తరప్రదేశ్‌కు పార్లమెంటులోనూ కీలక ప్రాతినిధ్యం ఉంది. దేశంలోని మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో 80 స్థానాలు ఈ రాష్ట్రం నుంచే ఉన్నాయి. అందువల్ల యూపీలో రాజకీయ పార్టీలకు లభించే ప్రజాదరణ, ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయిలో వాటి రాజకీయ బలాబలాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో 2027లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ సహా వివిధ రాజకీయ పక్షాల వ్యూహాలు, కూటముల కూర్పు, ప్రజా సమస్యలపై వాటి వైఖరి కీలకం కానున్నాయి.
ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ యూపీలోని ఏదైనా రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తుందా? అన్న సందేహాలు వస్తున్నాయి. అలాగే, సీజేపీ నేరుగా పోటీ చేస్తుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2027లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని, అలాగే ఏ రాజకీయ పార్టీకి లేదా కూటమికి మద్దతు సీజేపీ కన్వీనర్ అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. ఎన్నికల్లో కులం, మతం ఆధారంగా కాకుండా యువత ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన చర్చనీయాంశాలుగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎన్నికల బరిలోకి దిగబోం
మంగళవారం ఛత్రపతి సంభాజీనగర్‌లో మీడియాతో మాట్లాడిన అభిజీత్ దీప్కే.. తమ పార్టీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలోకి దిగబోదని తెలిపారు. అయితే ఎన్నికల ప్రచారం యువత సమస్యల చుట్టూ సాగాలని ఆకాంక్షించారు. "మేము ఎన్నికల్లోకి వెళ్లడం లేదు. కానీ ఎన్నికలు యువత సమస్యల ఆధారంగా జరగాలి. ఇంకెంతకాలం కులం, మతం ప్రాతిపదికన ఎన్నికల్లో పోటీ చేస్తాం? ప్రపంచం ఇప్పుడు కృత్రిమ మేధస్సు (ఏఐ), పునరుత్పాదక ఇంధనం గురించి చర్చిస్తోంది" అని ఆయన పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై ప్రశ్నించగా.. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలి, ఎవరు చేయకూడదు అనే అంశంపై తాము మాట్లాడబోమని దీప్కే స్పష్టం చేశారు. ఏ రాజకీయ పక్షానికీ మద్దతుగా నిలవబోమని పునరుద్ఘాటించారు. "ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఎవరు చేయకూడదు అనే విషయాల గురించి మేము మాట్లాడం. జాతీయ రాజకీయాల్లో ఉపాధి, నాణ్యమైన విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం" అని ఆయన అన్నారు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, నాణ్యమైన విద్య అందించడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై చర్చకు ప్రాధాన్యం ఇవ్వాలని సీజేపీ కోరుకుంటోంది. కుల, మత సమీకరణాల చుట్టూ ఎన్నికల ప్రచారం సాగడం కంటే యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాలని దీప్కే వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.


