ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ‘‘బ్లూ డ్రమ్’’ కేసులో ప్రస్తుతం శిక్ష అనుభవిస్తోంది దోషి ముస్కాన్. ఆమె చిన్న కుమార్తె పుట్టినరోజును మీరట్ జిల్లా జైలులో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జైలు అధికారులు చిన్నారికి కొత్త దుస్తులు, స్వీట్లు, బొమ్మలను బహుమతులుగా అందించనున్నారు. జైలులో ఉంటున్న ఆరేళ్లలోపు పిల్లల పుట్టినరోజులను జరపడం సంప్రదాయంగా వస్తోందని జైలు సీనియర్ సూపరింటెండెంట్ వీరేశ్ రాజ్ శర్మ వెల్లడించారు. అదే సంప్రదాయం ప్రకారం ముస్కాన్ కుమార్తె పుట్టినరోజును కూడా ఇతర పిల్లల మాదిరిగానే నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం మీరట్ జిల్లా జైలులో ఐదుగురు చిన్నారులు తమ తల్లులతో కలిసి ఉంటున్నారు. వీరంతా ఆరేళ్లలోపు వారేనని జైలు అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు చేసిన నేరాలతో ఈ పిల్లలకు ఎలాంటి సంబంధం లేదని, అయినప్పటికీ వారి తల్లిదండ్రుల కారణంగా జైలులో ఉండాల్సి వస్తోందని వీరేశ్ రాజ్ శర్మ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో పిల్లలకు తమ బాల్యం ఇతర పిల్లల బాల్యం కంటే భిన్నంగా ఉందనే భావన కలగకుండా చూడటమే జైలు యంత్రాంగం లక్ష్యమని వివరించారు. వారి సంతోషాలకు ప్రాధాన్యం ఇస్తూ పుట్టినరోజులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
జైలు సిబ్బంది, మహిళా ఖైదీలు కలిసి చిన్నారుల పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా పిల్లలకు కొత్త దుస్తులు, స్వీట్లు, బొమ్మలు అందజేస్తారు. వారి అవసరాలను కూడా పర్యవేక్షిస్తారు. భవిష్యత్తులో జైలు నుంచి బయటకు వెళ్లి సమాజంలో జీవించే సమయంలో.. జైలులో ఉన్న కారణంగా తమ పుట్టినరోజులు జరుపుకోలేదనే బాధ వారికి కలగకూడదన్నదే ఈ కార్యక్రమం వెనుక ఉద్దేశమని జైలు అధికారి వివరించారు.
పెద్ద కుమార్తెను కలవాలనుంది: ముస్కాన్
ఇదిలా ఉండగా, తన పెద్ద కుమార్తె పీహూను కలుసుకోవాలని ముస్కాన్ కోరుకుంటోంది. ఇటీవల ఆమెను కలిసేందుకు ముస్కాన్ న్యాయవాది జైలుకు వెళ్లారు. ఆ సమయంలో తన కుమార్తెను కలవాలన్న కోరికను న్యాయవాది ద్వారా కుటుంబ సభ్యులకు తెలియజేసింది. ఈ విషయాన్ని జైలు సీనియర్ సూపరింటెండెంట్ వీరేశ్ రాజ్ శర్మ ధ్రువీకరించారు. ముస్కాన్ ఈ మేరకు లిఖితపూర్వకంగా లేఖ అందిస్తే, నిబంధనల ప్రకారం దానిని కుటుంబ సభ్యులకు చేరవేస్తామని తెలిపారు.
బ్లూ డ్రమ్ హత్య కేసులో ముస్కాన్, ఆమె భర్త సాహిల్‌కు మరణశిక్ష విధించిన నేపథ్యంలో ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకవైపు జైలులో చిన్న కుమార్తె పుట్టినరోజు వేడుకలకు ఏర్పాట్లు జరుగుతుండగా, మరోవైపు పెద్ద కుమార్తెను కలుసుకోవాలన్న ముస్కాన్ అభ్యర్థనపై జైలు అధికారులు నిబంధనల ప్రకారం ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.


