లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందే సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలపై చర్చలు ఊపందుకున్నాయి. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు 26 అసెంబ్లీ స్థానాలు కేటాయించే అవకాశం ఉందని ఎస్పీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ప్రతిపాదనను అధికారికంగా కాంగ్రెస్‌కు ఇంకా తెలియజేయలేదు.
ఎస్పీ ప్రతిపాదించిన 26 స్థానాల్లో 2022 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన రాంపూర్ ఖాస్, ఫరెండా నియోజకవర్గాలతో పాటు రెండో స్థానంలో నిలిచిన మథుర, ఖేరాగఢ్, జగదీష్‌పూర్, కిద్వాయ్ నగర్ ఉన్నాయి.
మిగిలిన 20 స్థానాల్లో బాగ్‌పట్, మోదీనగర్, హాపూర్, జేవర్, సియానా, ఖుర్జా, ఖైర్, ఇగ్లాస్, మంత్, ఆగ్రా నార్త్, ఫతేపూర్ సిక్రీ, బిల్గ్రామ్-మల్లావన్, గోవింద్ నగర్, నాన్పారా, గోరఖ్‌పూర్ అర్బన్, ఖజనీ, పడ్రౌనా, ఫాజిల్‌నగర్, పింద్రా, వారణాసి కంటోన్మెంట్ ఉన్నాయి. చర్చలు ముందుకు సాగేకొద్దీ ఈ సంఖ్య పెరిగే అవకాశముందని సమాచారం.
మరోవైపు కాంగ్రెస్ 120 స్థానాలతో కూడిన జాబితాను ఎస్పీకి అందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందులో 55 స్థానాలను ఏ కేటగిరీగా, గతంలో మంచి ఫలితాలు సాధించిన స్థానాలను బీ కేటగిరీగా, గెలిచే అవకాశాలున్న స్థానాలను సీ కేటగిరీగా విభజించింది. అంతకుముందు 181 స్థానాలతో కూడిన జాబితాను కాంగ్రెస్ సిద్ధం చేసినట్లు వార్తలు వచ్చాయి.
కాంగ్రెస్‌కు 26 స్థానాలు ఇచ్చినట్లు ఎస్పీ రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ వెల్లడించారు. నవంబర్ 23న ఇరు పార్టీల నేతల మధ్య సుమారు 20 నిమిషాల పాటు తొలి సమావేశం జరిగింది. మళ్లీ చర్చలు జరగనున్నాయి. కాంగ్రెస్ ఎక్కువ స్థానాలను ఆశిస్తున్నప్పటికీ, 60 నుంచి 70 స్థానాలతో సరిపెట్టుకోవాలని పలువురు ఎస్పీ నేతలు సూచించినట్లు సమాచారం.
వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాలపై ఇరు పార్టీల మధ్య కుదిరే ఒప్పందం ఆసక్తి రేపుతోంది.
ఇదీ చదవండి: పంజాబ్‌లో మళ్లీ బీజేపీ-అకాలీదళ్ పొత్తు


