కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్‌కు అధికార పార్టీ ఎమ్మెల్యే అశ్లీల సందేశం పంపారన్న ఆరోపణల కేసులో టీవీకే ప్రభుత్వంపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. బాధితురాలికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం.. ఎవరినైనా కాపాడేందుకు ప్రయత్నిస్తోందా? అంటూ ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్.. కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపడంతో పాటు, అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ లక్ష్మీనారాయణన్ విచారించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘మీరు ఎవరినైనా కాపాడుతున్నారనే చిన్న అనుమానం వచ్చినా ఊరుకోను. మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టాలని నాకు లేదంటూ ప్రభుత్వాన్ని న్యాయమూర్తి హెచ్చరించారు. ఈ ఆరోపణల గురించి జూలై 31నే ప్రభుత్వానికి సమాచారం అందినప్పటికీ ఇప్పటివరకు ఎందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
విచారణ సందర్భంగా రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్. జాన్ సత్యన్ ఈ వ్యవహారంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు లిఖితపూర్వకంగా కోర్టుకు తెలిపారు. అయితే, ప్రభుత్వం ఇప్పటివరకు వ్యవహరించిన తీరుపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ఈ సందేశాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పటివరకు మీరేం చేశారు? చర్యలు తీసుకోవాలని నేనే మీకు సూచించాలా? మీ అంతట మీరే ఎందుకు స్పందించలేకపోయారు?’’ అంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు.
మహిళా కలెక్టర్‌తో ప్రభుత్వం మాట్లాడిందా? ఆమెకు తగిన రక్షణ కల్పించిందా? అని కూడా హైకోర్టు ప్రశ్నించింది. మహిళలపై లైంగిక వేధింపుల విషయంలో వారి హోదాతో సంబంధం లేకుండా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది. ఆమె చీఫ్ సెక్రటరీ అయినా.. పారిశుద్ధ్య కార్మికురాలయినా.. లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించాల్సిందేనని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది.


