ఎమ్మెల్యే నయన మోటమ్మ రాజీనామా? | Nayana Motamma Resigns Over Forest Department Decision To Shift Wild Elephants From Hassan To Chikkamagaluru | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే నయన మోటమ్మ రాజీనామా?

Nov 24 2026 9:56 AM | Updated on Nov 24 2026 10:07 AM

Nayana Motamma Resigns

అత్యధికంగా ఏనుగులు ఉన్న రాష్ట్రంగా కర్ణాటక ఖ్యాతి    పొందడం నాణేనికి ఒకవైపు అయితే, ఏనుగుల దాడుల వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలు మరోవైపు ముఖచిత్రం. ఇది చాలదన్నట్లు రాజకీయ   గలాటాలకు కూడా ఈ గజరాజులు ఆజ్యం పోస్తున్నాయి. హాసన్, చిక్కమగళూరు జిల్లాల మధ్య ఏనుగులను తోలడంపై గొడవ మొదలైంది.  

కర్ణాటక: హాసన్‌ జిల్లాలో అధికంగా ఉన్న అడవి ఏనుగులను చిక్కమగళూరు జిల్లాకు తరలించాలన్న అటవీ శాఖ నిర్ణయాన్ని ఖండిస్తూ, ఆ జిల్లాలోని మూడిగెరె నియోజకవర్గం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నయన మోటమ్మ రాజీనామా ప్రకటించారు. సోమవారం రాజీనామా లేఖను విధానసౌధలోని స్పీకర్‌ ఆఫీసులో అందజేశారు.  అటవీ శాఖ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆమె చెప్పారు.  

మాకు ఒక్క మాటైనా చెప్పలేదు: నయన  
ఒక ఎమ్మెల్యేగా, నేను స్వచ్ఛందంగా, ఎంత బాధతో పదవికి రాజీనామా చేస్తున్నాను. నా ఈ నిర్ణయానికి దారితీసిన తీవ్రమైన పరిస్థితిని మీ దృష్టికి తీసుకువస్తున్నా అని నయన ఆ లేఖలో తెలిపారు. చిక్కమగళూరు జిల్లా ఎమ్మెల్యేలతో చర్చించకుండా, తనకూ సమాచారం ఇవ్వకుండా హాసన్‌ జిల్లా బేలూరు తాలూకా అడవుల్లో ఉండే సుమారు 50– 60 ఏనుగుల గుంపును, తన నియోజకవర్గం పరిధిలోకి వచ్చే భద్రా రిజర్వు తక్కోల ఫారెస్ట్‌కు అటవీ శాఖ హఠాత్తుగా తోలేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. 

గతంలో బేలూరులో అడవి ఏనుగుల దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించిన సంఘటన తరువాత, హాసన్‌ జిల్లా మంత్రి శివలింగేగౌడ అభ్యర్థన మేరకు, ఈ ఏనుగులను పొరుగు జిల్లాకు తరమడానికి ఏర్పాట్లు జరిగాయి,  ప్రజల నుంచి భయాందోళనలు వ్యక్తం కావడంతో భద్రా అభయారణ్యంలోకి ఏనుగుల విడుదలను తాత్కాలికంగా నిలిపివేశారని చెప్పారు. ఇప్పటికే వన్యప్రాణుల దాడితో నా నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. 

అడవి ఏనుగులు, దున్నపోతుల దాడుల వల్ల ఎన్నో ప్రాణాలు పోయినట్లు  నయన చెప్పారు. ఇవి చాలవన్నట్లు బయటి నుంచి ఏనుగులను ఈ ప్రాంతంలో వదిలివేయడం గాయాన్ని మరింత రేపినట్లు అవుతుందని మండిపడ్డారు. సోమవారం ఉదయం 36 ఏనుగులను మూడిగెరె వైపు తరలిస్తున్నట్లు తెలిసిందన్నారు. దీనివల్ల పంట పొలాలు, కాఫీ తోటలు నాశనమవుతాయని అన్నారు. రాజీనామాను  ఆమోదించాలని సభాపతిని డిమాండ్‌ చేసినట్లు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement