అది తన శాఖ పరిధిలోని అంశం కాదన్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
జూన్‌లో ఇదే అంశంపై వైష్ణవ్‌తో రేవంత్, కిషన్‌రెడ్డి చర్చలు
అయినా నేడు ‘తెలియదని’ వ్యాఖ్య
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు ఆర్థిక సాయం అందించే విషయంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేతులెత్తేశారు. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ) ద్వారా రుణం ఇచ్చే వ్యవహారంపై తనకు ఎలాంటి సమాచారం లేదని ఆయన స్పష్టం చేశారు. అసలు ఆ అంశం తన శాఖ పరిధిలోకి రాదని తేల్చిచెప్పారు.
సోమవారం న్యూఢిల్లీలోని రైల్‌భవన్‌లో మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో కేంద్ర మంత్రి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మెట్రో ఫేజ్–2 రుణ వ్యవహారాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ చూసుకుంటారు. ఇందులో నా పాత్ర ఏమీ లేదు’అని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.
గతంలో చర్చలు జరిగినా.. తాజాగా యూటర్న్!
వాస్తవానికి మెట్రో ఫేజ్–2 విస్తరణకు అనుమతులు, నిధులు మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఏడాది జూన్ 22న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి అశ్వినీ వైష్ణవ్‌ను కలిశారు. ఆ మరుసటి రోజే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తోనూ భేటీ అయ్యారు. ఆ సమావేశాల్లో మెట్రో విస్తరణతో పాటు ఐఆర్‌ఎఫ్‌సీ రుణ సమీకరణపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఇంత జరిగినప్పటికీ, తాజాగా అశ్వినీ వైష్ణవ్ ఈ అంశం గురించి తనకేమీ తెలియదనడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మే నెలలో బుల్లెట్ రైలు ట్రయల్ రన్
దేశంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అహ్మదాబాద్– ముంబై బుల్లెట్ రైలు కారిడార్ పనులు శరవేగంగా సాగుతున్నాయని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. వచ్చే ఏడాదిలో బుల్లెట్ రైలు కోచ్‌లు అందుబాటులోకి వస్తాయని, మే నెలలో ట్రయల్ రన్ చేస్తామని తెలిపారు. ఇప్పటికే సూరత్–బిల్‌మోరా సెక్షన్‌లో దాదాపు 50 కిలోమీటర్ల మేర ట్రాక్, విద్యుదీకరణ పనులు పూర్తయినట్లు వివరించారు. గంటకు 250 కి.మీ. వేగంతో ఈ బుల్లెట్ రైలు సేవలు 2029 నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు.
ఇదీ చదవండి: సమ్మిట్‌కు 1,000 కంపెనీలు


