కరీంనగర్‌లో జరిగిన మహా పాదయాత్రలో పాల్గొన్న బీజేపీ శ్రేణులు, (ఇన్‌సెట్‌లో) పార్టీ జెండాలు ఊపుతూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్న నితిన్ నబీన్, బండి సంజయ్
కరీంనగర్ మహా పాదయాత్రలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్
వచ్చే ఎన్నికల్లో వారికి ప్రజలే బుద్ధి చెబుతారు
ప్రతిపక్షాలు ఎస్‌ఐఆర్ పేరిట నానాయాగీ చేస్తున్నాయి.. కాంగ్రెస్ దు్రష్పచారాన్ని తిప్పికొట్టాలని నబీన్ పిలుపు
మృతుల ఓట్లు తీసేస్తే రాహుల్‌కు నష్టమేంటి: కేంద్ర మంత్రి బండి సంజయ్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ ఏటీఎంలా మారాడు. యువత, రైతులు, మహిళలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైంది. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ సర్కారే. ఎస్‌ఐఆర్ పేరిట ప్రతిపక్షాలు నానాయాగీ చేస్తున్నాయి. 2002లో ఓటరు లిస్టులో లేని 3 కోట్ల మందికి మద్దతుగా రాహుల్, ప్రతిపక్షాలు పోరాడుతున్నాయి. ఈ లెక్కన ఓట్ల చోరీ ఎవరు చేస్తున్నారు? అధికారం కోసం దేశంలో ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరం’అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు.
ఎస్‌ఐఆర్‌పై ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు సోమవారం కరీంనగర్‌లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాపాదయాత్రకు ముఖ్యఅతిథిగా నితిన్‌నబీన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి సునీల్‌భన్సల్, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎమ్మెల్సీలు కొమురయ్య, అంజిరెడ్డి, మేయర్ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ పాల్గొన్నారు. వైశ్యాభవన్ నుంచి మొదలైన పాదయాత్ర కరీంనగర్ కమాన్ చౌరస్తా వద్ద ముగిసింది.
వైశ్యభవన్ వద్ద నితిన్ నబీన్ ప్రసంగించారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే....మహాపాదయాత్రలో కంటికి కనిపించినంత దూరం ప్రజలే కనిపిస్తున్నారు. ఓట్ చోరీ అంటూ ఇటీవల విపక్షాలు తమ సర్వశక్తులూ ఒడ్డినా ఒక్క రామ్‌లీలా మైదానాన్ని కూడా నింపలేకపోయాయి. కానీ బీజేపీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా 200కు పైగా ప్రాంతాల్లో రామ్‌లీలా మైదానానికి పదిరెట్ల జనాన్ని సమీకరించి సత్తా చాటారు. 3 కోట్ల మంది మృతుల ఓట్లు ఉంచాలా? 6 కోట్లకు పైగా ఓటర్లు వలస వెళ్లారు.
వారికి రెండు చోట్ల ఓటు ఇవ్వాలా..? మరో 3 కోట్ల మంది.. 2002 ఓటరు లిస్టులో వారు ఎక్కడున్నారో చెప్పలేకపోతున్నారు.. వారి ఓట్లే తొలగించారు. ’రాహుల్ బాబా’అసలు నిజస్వరూపాన్ని బయటపెట్టడానికే నేను కరీంనగర్‌కు వచ్చాను. కుర్చీ కాపాడుకునేందుకు దేశంలో ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ పార్టీ..ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరం.
తెలంగాణలో 36 నెలల పాలన పూర్తికాకముందే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 82 సార్లకు పైగా ఢిల్లీ దర్బార్‌కు వెళ్లి అధిష్టానానికి మోకరిల్లారు. తెలంగాణ ప్రజలు రేవంత్‌రెడ్డికి బుద్ది చెప్పడం ఖాయం. ఆ పార్టీని కూకటివేళ్లతో పెకిలిచి.. బీజేపీని ఎన్నుకుంటారన్న పూర్తి విశ్వాసం నాకుంది. మోదీ నేతృత్వంలో దేశం మరో సంకల్పం తీసుకుంది.. అది నషా ముక్త్ భారత్.. దీనిని మనమంతా సాకారం చేద్దాం’అని నితిన్‌నబీన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
విదేశీ ఓట్లతో గెలవాలనుకుంటున్నారా: బండి సంజయ్
‘కరీంనగర్‌లో కాషాయ దళ ప్రభంజనాన్ని చూసి నన్ను కన్న ఈ కరీంనగర్ గడ్డ ఉరకలేస్తోంది. తెలంగాణలో బీజేపీ ఉనికి ప్రశ్నించిన కాంగ్రెస్, ఎంఐఎం నేతల్లారా...ఇక్కడి ప్రభంజనాన్ని చూడండి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను బొంద పెట్టడానికి కాషాయ దళం ఎట్లా ఉరకలేస్తోంది. నితిన్ అంటే నిజాయతీ, నైతికత.. నబీన్ అంటే నూతనత్వం.45 ఏళ్లకే ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ
పార్టీకి అధ్యక్షుడైన ఘనత నితిన్ సొంతం. ఆర్‌ఎస్‌ఎస్ నేరి్పన క్రమశిక్షణ, అంకిత భావమే ఆయన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. రాహుల్ గాంధీ ‘‘సర్’’తో మీకొచ్చిన నష్టమేంది? చచ్చిపోయిన 3 కోట్ల మంది ఓట్లను తొలగిస్తే తప్పేంది? 2014కు ముందు అక్రమంగా దేశంలోకి వలస వచ్చిన 4 కోట్ల మంది ఓట్లను తీసేస్తే మీకొచ్చిన నొప్పేంది...మోదీకి అండగా నిలుద్దాం.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వండి’అని భావోద్వేగంతో సంజయ్ తన ప్రసంగం ముగించారు.
అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ హయాంలో చేపట్టిన సర్‌ని రాహుల్ ఎందుకు వ్యతిరేకించలేదు. మోదీ ఎన్నిక చెల్లదంటున్న రాహుల్‌కు.. రేవంత్ ఎన్నిక కూడా చెల్లదు. రేవంత్ ప్రభుత్వాన్ని రద్దు చేసే దమ్ముందా’అని నిలదీశారు.


