అంతా మీరే చేశారు! | CM Revanth Reddy Fires On KCR And Harish Rao | Sakshi
Sakshi News home page

అంతా మీరే చేశారు!

Nov 24 2026 4:22 AM | Updated on Nov 24 2026 4:22 AM

CM Revanth Reddy Fires On KCR And Harish Rao

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సరెండర్‌ అయ్యారు 

కేసీఆర్, హరీశ్‌రావులపై సీఎం రేవంత్‌ ఫైర్‌

తెలంగాణకు 298.6 టీఎంసీలు ఇస్తే సరిపోతుందని అంగీకరించారు 

మన అవసరాల కోసం పోరాడకుండా 2020లో అదే వాటాకు శాశ్వతంగా ఒప్పుకున్నారు 

అంతా చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోంది 

పల్నాడు వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు చేపట్టేందుకు 2022లోనే అక్కడి ప్రభుత్వం జీవో ఇచ్చింది 

సంబంధిత జీవోలపై కేసీఆర్‌ ప్రభుత్వం ఎప్పుడూ, ఎక్కడా అభ్యంతరం చెప్పలేదు 

ఆ ఇద్దరి నిర్ణయాల వల్లే రాష్ట్రానికి అందాల్సిన నీటి వాటా తరలిపోతోందన్న సీఎం

సాక్షి, హైదరాబాద్‌:  ‘కృష్ణా నదీ జలాల్లో రాష్ట్రానికి న్యాయమైన వాటాను రాబట్టుకోకుండా మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్‌ అయ్యారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతం 71 శాతం తెలంగాణలో, 29 శాతం ఏపీలో ఉంది. ఈ లెక్కన కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు 578 టీఎంసీలు రావాలి.

అయితే 2015 జూన్‌ 18, 19 తేదీల్లో అప్పటి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఉమాభారతి సమక్షంలో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో ఏపీకి 512 టీఎంసీలు (66%) ఇచ్చి తెలంగాణకు 298.96 టీఎంసీలు (34%) ఇస్తే సరిపోతుందని అంగీకరిస్తూ నాటి  కేసీఆర్, హరీశ్‌రావు ఇద్దరూ రెండు సంతకాలు పెట్టారు. రాష్ట్ర అవసరాలను ప్రస్తావిస్తూ మన వాటా కోసం పోరాడకుండా 299 టీఎంసీలకు అంగీకరించి తెలంగాణ నీటి హక్కులపై మామా, అల్లుళ్లు కలిసి మరణశాసనం రాశారు.

ఈ కేటాయింపులను ఏటా పునఃసమీక్షించే అవకాశమున్నా, ఏకంగా కృష్ణా ట్రిబ్యునల్‌–2 తీర్పు అమల్లోకి వచ్చే వరకు ఇవే పంపకాలు కొనసాగించేందుకు ఒప్పుకుంటూ 2020 జనవరి 29న రాసిచ్చారు. ఈ ప్రాంతానికి జల సమాధి కడుతూ కేసీఆర్‌ సంతకం చేశారు..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాగార్జునసాగర్‌ నుంచి 1.8 టీఎంసీల నీళ్లను తరలించుకోవడానికి ఏపీ ప్రభుత్వం చేపట్టిన పల్నాడు డ్రింకింగ్‌ వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు రేవంత్‌ సర్కారు సహకరిస్తోందని బీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన ఆరోపణలను.. సోమవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఎం తీవ్రంగా ఖండించారు. 

అబద్ధాలతో ప్రణాళికాబద్ధంగా.. 
    ‘కృష్ణా జలాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బీఆర్‌ఎస్‌ ప్రణాళికాబద్ధంగా ప్రయతి్నస్తోంది. పల్నాడు వాటర్‌ గ్రిడ్‌ అంశంపై అర్ధసత్యాలు, అసత్యాలతో ప్రజలను హరీశ్‌రావు, కేటీఆర్‌ తప్పుదోవ పట్టిస్తున్నారు. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద రూ.1,200 కోట్లతో పల్నాడు వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు చేపట్టేందుకు 2022 ఫిబ్రవరి 16న ఏపీలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం జీవో నంబర్‌ 56 జారీ చేసింది.

కేంద్రం రూ.500 కోట్ల మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇచ్చేలా ప్రతిపాదించారు. 2022 ఫిబ్రవరి 24న ప్రకాశం జిల్లాకు 0.22 టీఎంసీల నీటి కేటాయింపుల కోసం జీవో 482 ఇచ్చారు. నాటి కేసీఆర్‌ ప్రభుత్వం ఈ జీవోలపై కృష్ణా బోర్డుతో పాటు జల్‌ జీవన్‌ మిషన్‌ దగ్గరా, ఎప్పుడూ అభ్యంతరం తెలపలేదు. పల్నాడు ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు ఇచి్చనప్పుడు, కేంద్ర ఆర్థిక సహకారంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు.  

జగన్‌ ముందే ఊహించి జీవో ఇచ్చారు.. 
    కేసీఆర్‌ పదవి పోగొట్టుకుంటే వచ్చే ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును అడ్డుకుంటాయని ముందే జగన్‌ జీవో ఇచ్చారు. ప్రతిరోజూ 11 టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోవడానికి అంగీకరిస్తూ సంతకాలు చేసి తెలంగాణ ప్రయోజనాలను జలసమాధి చేసిన కేసీఆర్, హరీశ్‌రావుకు ఉరేసినా, కోదండంతో కొట్టినా తక్కువే. 2023 తీర్పు కాదు..కేసీఆర్‌ను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పించడమే అసలు శిక్ష. ప్రాజెక్టు నిర్మాణం మా దృష్టికి రాగానే  మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కృష్ణాబోర్డు చైర్మన్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. కేంద్ర జలశక్తి శాఖకు సైతం లేఖ రాశాం..’ అని సీఎం తెలిపారు.  

వైఎస్‌ హయాంలోనే పోతిరెడ్డిపాడుకు అనుమతులు 
    ‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో 2004 నుంచి 2006 వరకు టీఆర్‌ఎస్‌కు చెందిన ఆరుగురు మంత్రులుగా ఉన్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచేందుకు రూ.1,250 కోట్ల అంచనాలతో 2005 మార్చి 29న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో డిమాండ్‌ ఫర్‌ గ్రాంట్‌ను ప్రవేశపెట్టారు. మంత్రులు ఆమోదించిన తర్వాతే ఈ కేటాయింపులు జరిగాయి. నాడు అసెంబ్లీలో ఎందుకు నిలదీయలేదు? ఇందుకు సంబంధించి 2005 సెప్టెంబర్‌ 13న జీవో జారీ కాగా, నాటికి మంత్రులుగా లేమని హరీశ్‌రావు చెబుతున్నారు.

అసెంబ్లీలో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు వారు మంత్రులుగానే ఉన్నారు. కృష్ణా జలాలను వైఎస్‌కు తాకట్టు పెట్టింది మీరే. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచేందుకు అనుమతులిచ్చారు. రాయలసీమకు నీళ్లు తరలించుకుపోతుంటే హరీశ్‌రావు హారతులు పట్టారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవని హరీశ్‌రావును వైఎస్‌ మంత్రిని చేశారు.

వైఎస్‌ ఆయనకు గురువు. ఆయనకు హరీశ్‌రావు గురుదక్షిణ చెల్లించారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ నుంచి పోతిరెడ్డిపాడు, మల్యాల, ముచ్చుమర్రి మార్గాల్లో ఏపీకి నీటిని తరలించేందుకు అనుమతులిచ్చారు. హంద్రీనీవా సుజల స్రవంతి మొదటి దశ ద్వారా 40 టీఎంసీల నీటిని తరలించుకునేందుకు 2004 జూలై 24న జీవో ఇచి్చనప్పుడు హరీశ్‌రావు మంత్రివర్గంలోనే ఉన్నారు.  

జగన్‌ సీఎంగా ఉన్నప్పుడూ సహకరించారు 
    జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు శ్రీశైలం డెడ్‌ స్టోరేజీ నుంచి నీటిని తీసుకునేందుకు ముచ్చుమర్రి ప్రాజెక్టును, 2020లో రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. ఏపీ ప్రాజెక్టులకు సహకరించి తెలంగాణ ప్రాంత నీటి హక్కులకు సమాధి కట్టింది కేసీఆర్, హరీశ్‌రావులే. తెలంగాణ వచ్చాక ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, పాలమూరు–రంగారెడ్డి వంటి ప్రాజెక్టులను కేసీఆర్‌ పూర్తి చేయలేదు. రాయలసీమ ప్రాజెక్టులను మాత్రం అక్కడి ప్రభుత్వం పట్టుదలతో పూర్తి చేసుకుంది.

కేసీఆర్‌ హయాంలో కృష్ణా నదిని పూర్తిగా తరలించుకుపోయేలా ఏపీ 8 ప్రాజెక్టులు నిర్మించింది. తెలంగాణలో మాత్రం ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. రాయలసీమ వెళ్లి రొయ్యల పులుసు, పంచభక్ష పరమాన్నాలు తింటూ తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆరే. 2026–27లో తెలంగాణ 45.44 శాతం కృష్ణా నీళ్లనే వాడుకుంది. గత పాలకులే దీనికి కారణం.’ అని రేవంత్‌ విమర్శించారు.   

జగన్‌కు విందు..‘రాయలసీమ’కు అనుమతులు 
    ‘ప్రగతిభవన్‌లో నాటి ఏపీ సీఎం జగన్‌కు కేసీఆర్‌ విందు ఇచ్చాకే రాయలసీమ ఎత్తిపోతల పథకం పుట్టుకొచ్చింది. కేసీఆర్‌ మంచి మనిషి అని, గోదావరి నీటిని శ్రీశైలం వరకు తీసుకెళ్లేందుకు ముందుకు వచ్చారని అప్పట్లో జగన్‌ కొనియాడారు. ఇప్పుడు సాగునీటి శాఖ అప్పగించమని హరీశ్‌ అంటున్నారు.

ఆయనకు అంత తెలివి ఉంటే సాగునీటి శాఖ మంత్రిగా ఆయన్ను కేసీఆర్‌ ఎందుకు తప్పించారు?’ అని ముఖ్యమంత్రి నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బ్రిజే‹Ùకుమార్‌ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు ముందు బలమైన వాదనలు వినిపిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, దామోదర్‌ రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement