హైదరాబాద్: బ్లాక్ ఫ్రైడే ఆన్లైన్ షాపింగ్ సేల్ సందర్భంగా సైబర్ మోసాలు పెరిగే ప్రమాదం ఉందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ప్రజలను హెచ్చరించింది. భారీ డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లు, మోసపూరిత ప్రకటనలు, ఫిషింగ్ లింకుల ద్వారా వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపింది.
ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ఇస్తామంటూ నకిలీ షాపింగ్ వెబ్సైట్లను సృష్టించి, వాటి లింకులను వాట్సాప్, ఎస్ఎంఎస్, సోషల్ మీడియా ద్వారా పంపిస్తున్నారని వెల్లడించింది. వీటిపై క్లిక్ చేసిన వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు, క్రెడిట్, డెబిట్ కార్డు సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని పేర్కొంది. నకిలీ పేమెంట్ లింకులు, క్యూఆర్ కోడ్ల ద్వారా కూడా అనధికారిక లావాదేవీలకు పాల్పడుతున్నారని వివరించింది.
TGCSB సూచించిన జాగ్రత్తలు
- గుర్తింపు పొందిన వెబ్సైట్లు, అధికారిక యాప్‌లలో మాత్రమే షాపింగ్ చేయాలి.
- కొనుగోళ్లు, చెల్లింపులకు ముందు వెబ్సైట్ URLను క్షుణ్ణంగా పరిశీలించాలి.
- నమ్మశక్యం కాని భారీ డిస్కౌంట్లు, ఫ్లాష్ సేల్ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
- OTP, UPI PIN, CVV, బ్యాంకింగ్ వివరాలను ఎవరికీ వెల్లడించకూడదు.
- తెలియని లింకులపై క్లిక్ చేయకూడదు. అనుమానాస్పద QR కోడ్లను స్కాన్ చేయకూడదు.
ఆకర్షణీయమైన ఆఫర్లు, పరిమిత కాలపు డిస్కౌంట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజల కష్టార్జితాన్ని కొల్లగొట్టే అవకాశం ఉందని TGCSB హెచ్చరించింది. ఆన్లైన్ కొనుగోళ్ల సమయంలో అప్రమత్తతే సైబర్ మోసాల నుంచి రక్షణ అని స్పష్టం చేసింది.
సైబర్ మోసానికి గురైతే వెంటనే స్పందించండి
ఆర్థిక సైబర్ మోసానికి గురైన వారు ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించింది. సత్వర ఫిర్యాదు ద్వారా నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని తెలిపింది.


