వాషింగ్టన్: అమెరికాలో థాంక్స్‌గివింగ్ సెలవులకు ముందు విమాన ప్రయాణాల రద్దీ పెరిగిన వేళ డెల్టా ఎయిర్‌లైన్స్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆదివారం సుమారు 2 వేల విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
విమానాల బరువు, సమతుల్యతను లెక్కించే ఆటోమేటిక్ వ్యవస్థలో సాంకేతిక లోపం ఏర్పడటమే ఈ సమస్యకు కారణం. విమానం నిర్ణీత సురక్షిత బరువు పరిమితుల్లో ఉందో లేదో ఈ వ్యవస్థ నిర్ధారిస్తుంది. సమస్యను పరిష్కరించేందుకు డెల్టా సిబ్బంది మాన్యువల్ విధానాన్ని అనుసరించారు. కొన్ని గంటల తర్వాత వ్యవస్థ తిరిగి పనిచేయడం ప్రారంభించింది.
డెల్టా ప్రధాన కేంద్రంగా ఉన్న అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ విమానాలు ఆలస్యమయ్యాయి. ఆదివారం ఉదయం అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) అక్కడికి వచ్చే కొన్ని విమానాలపై గంటపాటు తాత్కాలిక ఆంక్షలు విధించింది.
ఫ్లైట్‌అవేర్ గణాంకాల ప్రకారం డెల్టా విమానాల్లో సుమారు 58 శాతం ఆలస్యమయ్యాయి. వీటిలో 70 శాతం సమస్యలు సాంకేతిక లోపం వల్లే తలెత్తాయి. మిగిలినవి ప్రతికూల వాతావరణం కారణంగా ఆలస్యమయ్యాయి. బాధితులకు ప్రత్యామ్నాయ విమానాలు, హోటల్ వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామని సంస్థ ప్రకటించింది. విమానాలు రద్దయితే టికెట్ డబ్బులు తిరిగి చెల్లిస్తామని వెల్లడించింది. థాంక్స్‌గివింగ్ సమయంలో ప్రయాణాల రద్దీ నేపథ్యంలో ఈ పరిణామం ఆందోళన కలిగించింది.
ఇదీ చదవండి: దలైలామా వారసుడి ఎంపిక.. భారత్‌తో అమెరికా వ్యూహం!


