పనాజీ: గోవాలో గిరిజనుల భూములను ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. గిరిజనుల హక్కులను హరించడమే కాకుండా, వారి భూములను కూడా లాక్కుంటున్నారని విమర్శించారు. కరాపూర్‌లో గ్రామాలకు చెందిన భూములను మంత్రులకు సన్నిహితంగా ఉన్న బిల్డర్లకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కరాపూర్‌లో పర్యటించిన దీప్కే.. స్థానికుల సమస్యలను ప్రస్తావించారు. గ్రామం నుంచి గోవా మెడికల్ కాలేజీ (జీఎంసీ) ఆసుపత్రికి వెళ్లాలంటే సుమారు గంటన్నర ప్రయాణించాల్సి వస్తోందన్నారు. ప్రజల తరఫున పోరాడుతున్న సామాజిక కార్యకర్త గౌరీశ్ గడిపై భూకబ్జాదారులు దాడి చేశారని తెలిపారు. తలకు ఎనిమిది కుట్లు పడటంతో పాటు, చేయి విరిగిందని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.
గౌరీశ్ గడికి ప్రభుత్వం వెంటనే పోలీసు రక్షణ కల్పించాలని దీప్కే డిమాండ్ చేశారు. ఆయనపై మరోసారి దాడి జరిగితే అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. గోవా భూములను ప్రైవేటు పెట్టుబడిదారులకు అప్పగిస్తున్నారంటూ సీజేపీ నేత అశుతోష్ రంకా ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలతో కలిసి త్వరలో పౌరుల మేనిఫెస్టో రూపొందిస్తామని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు ఈ మేనిఫెస్టోలోని డిమాండ్లను అంగీకరించాలని కోరుతామని తెలిపారు.
గోవాలో భూముల జోన్ల మార్పిడికి సంబంధించిన వివాదాస్పద సెక్షన్ 39Aను రద్దు చేయడమే మేనిఫెస్టోలో తొలి ప్రధాన డిమాండ్‌గా ఉంటుందని అశుతోష్ రంకా వెల్లడించారు. ఈ డిమాండ్‌కు అంగీకరించని పార్టీలకు ఓటు వేయవద్దని గోవా ప్రజలను కోరుతామని చెప్పారు. గోవాలోని ఆదివాసీ గిరిజనుల హక్కులు చాలాకాలంగా ఉల్లంఘనలకు గురవుతున్నాయని నేత సౌరవ్ దాస్ పేర్కొన్నారు. సెక్షన్ 39Aతో పాటు గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ మేనిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు. ఆదివారం గోవాలో నిర్వహించిన 'క్యా బోల్తీ పబ్లిక్' ప్రచార కార్యక్రమంలో అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకా, అజింక్య షిండే పాల్గొన్నారు. భూముల హక్కులు, ఉపాధి అవకాశాలు, గోవా సాంస్కృతిక గుర్తింపు పరిరక్షణ వంటి అంశాలపై వారు మాట్లాడారు.
ఇదీ చదవండి: అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి!


