ఢిల్లీ: తమిళనాడులో కార్తీక దీపం వెలిగింపు వ్యవహారం రాజకీయంగా, న్యాయపరంగా చర్చనీయాంశంగా మారింది. మధురైలోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న దీపథూన్ (దీప స్తంభం) వద్ద కార్తీక దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన అనుమతిని సవాలు చేస్తూ ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. నవంబర్ 24న ఒకసారి మాత్రమే దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించగా.. ఆ ఉత్తర్వులను పునఃపరిశీలించాలని ప్రభుత్వం కోరింది. రాష్ట్ర హిందూ మత, ధర్మాదాయ శాఖ కమిషనర్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న దీపథూన్ వద్ద కార్తీక దీపం వెలిగించాలన్న వివాదంపై నవంబర్ 20న సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం. పంచోలి ధర్మాసనం.. నవంబర్ 24న దీపథూన్ వద్ద దీపం వెలిగించేందుకు ఒక్కసారి మాత్రమే అనుమతించింది. ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు తీర్పులోని కొన్ని వ్యాఖ్యలపై స్టే విధించింది. అయితే ఈ కార్యక్రమానికి కొన్ని షరతులు విధించింది. ఆలయ అధికారులు అనుమతించిన ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు మాత్రమే అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. సాధారణ ప్రజలు, ఊరేగింపులు, ప్రదర్శనలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. అవసరమైతే భద్రత కోసం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్)ను కూడా మోహరించవచ్చని పేర్కొంది. ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతను మధురై జిల్లా కలెక్టర్‌కు అప్పగించింది.
ప్రభుత్వ అభ్యంతరాలు?
దీపథూన్ వద్ద దీపం వెలిగించడం సంప్రదాయం కాదని తమిళనాడు ప్రభుత్వం వాదిస్తోంది. ఉచ్చిపిళ్లయార్ ఆలయం సమీపంలోని దీప మండపంలోనే సంప్రదాయబద్ధంగా కార్తీక దీపం వెలిగిస్తారని పేర్కొంటోంది. వివాదాస్పదంగా ఉన్న రాతి స్తంభం వద్ద దీపం వెలిగిస్తే శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ దీప స్తంభం హజ్రత్ సుల్తాన్ సికందర్ బాదుషా ఔలియా దర్గాకు సుమారు 50 మీటర్ల దూరంలో ఉంది. ఇరు మతాల ప్రార్థనా స్థలాలకు సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వాదిస్తోంది. దీపం వెలిగించే కార్యక్రమం జరిగిపోతే, ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలించినా గత పరిస్థితిని తిరిగి తీసుకురావడం సాధ్యం కాదని ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొన్నట్లు వార్తలు వెల్లడించాయి. అందువల్ల ప్రధాన కేసులో తుది నిర్ణయం వచ్చే వరకు దీపథూన్ వద్ద దీపం వెలిగించేందుకు ఇచ్చిన అనుమతిని నిలిపివేయాలని కోరింది.
విజయ్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు
మరోవైపు తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ విజయ్ ప్రభుత్వ తీరును విమర్శించారు. హిందువుల సంప్రదాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే సుప్రీంకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తోందని విమర్శించారు. దీపథూన్ వద్ద దీపం వెలిగించడాన్ని ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తోందని ఆయన ప్రశ్నించారు. ఆలయ ఆస్తులను కాపాడాల్సిన హిందూ మత, ధర్మాదాయ శాఖే ఈ వివాదంలో ఇలా వ్యవహరించడం ఏమిటని నిలదీశారు. ఇతర సంస్థలు సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ సంయమనం పాటిస్తుంటే ప్రభుత్వం మాత్రం రివ్యూ పిటిషన్ ఎందుకు వేసిందని ప్రశ్నించారు.
జనవరిలో అసలు కేసుపై విచారణ
సుప్రీంకోర్టు ఇచ్చిన అనుమతి ఈ ఏడాదికి మాత్రమే వర్తిస్తుందని, దీని ఆధారంగా భవిష్యత్తులో దీపథూన్ వద్ద దీపం వెలిగించే హక్కు ఏర్పడదని స్పష్టం చేసింది. ఈ ఒక్కసారి అనుమతిని సంప్రదాయానికి లేదా శాశ్వత హక్కుకు ఆధారంగా చూపించడానికి వీల్లేదని పేర్కొంది. ఈ వివాదానికి సంబంధించిన ప్రధాన కేసుతో పాటు మతపరమైన హక్కులకు సంబంధించిన అంశాలపై 2027 జనవరిలో సుప్రీంకోర్టు సమగ్ర విచారణ చేపట్టనుంది. దీంతో నవంబర్ 24న కార్తీక దీపం ఎక్కడ వెలిగిస్తారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు తాజా రివ్యూ పిటిషన్‌పై ఏం నిర్ణయం తీసుకుంటుంది? విజయ్ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: యూపీలో హ్యాట్రిక్‌పై కమలం గురి!


