న్యూఢిల్లీ: భారత్, నేపాల్ మధ్య రైల్వే అనుసంధానాన్ని బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ధామ్ నుంచి నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్ వరకు కొత్త రైలు సర్వీసు ప్రారంభం కానుంది. నవంబర్ 23న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా సంయుక్తంగా ఈ రైలును ప్రారంభించనున్నారు. రెండు దేశాల మధ్య రవాణా సౌకర్యాలను విస్తరించడంతోపాటు ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించడం ఈ సర్వీసు ప్రధాన ఉద్దేశం.
ప్రత్యేక రైలుగా తొలి ప్రయాణం
తొలుత ఈ రైలును ప్రారంభోత్సవ ప్రత్యేక సర్వీసుగా నడపనున్నారు. అయోధ్య నుంచి జనక్‌పూర్‌కు వెళ్లే రైలుకు 04295 నంబరు కేటాయించారు. తిరుగు ప్రయాణంలో 04296 నంబరుతో నడుస్తుంది. సాధారణ సర్వీసులు ప్రారంభమైన తర్వాత వెళ్లే రైలుకు 15595, తిరుగు రైలుకు 15596 నంబర్లు ఉంటాయి.
అయోధ్య నుంచి ఎప్పుడు బయల్దేరుతుందంటే?
నవంబర్ 23న మధ్యాహ్నం 12.30 గంటలకు అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలు బయల్దేరుతుంది. మరుసటి రోజు నవంబర్ 24న ఉదయం 10 గంటలకు నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు బయల్దేరి నవంబర్ 25న ఉదయం 8.10 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది.
ఈ స్టేషన్లలో ఆగుతుంది
తొలి ప్రయాణంలో ఉత్తరప్రదేశ్, బిహార్‌ల మీదుగా రైలు నేపాల్‌లోకి ప్రవేశిస్తుంది. మంకాపూర్, బస్తీ, గోరఖ్‌పూర్, పానియహవా, నర్కటియాగంజ్, రక్సౌల్, సీతామఢి, శిశో హాల్ట్, మధుబని, జయనగర్ కస్టమ్స్ యార్డ్ స్టేషన్లలో ఆగుతుంది. అనంతరం భారత్ సరిహద్దు దాటి నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్‌కు చేరుకుంటుంది.
పూర్తి సమయ పట్టిక ఇదే
అయోధ్యలో మధ్యాహ్నం 12.30 గంటలకు బయల్దేరే రైలు మధ్యాహ్నం 2.05 గంటలకు మంకాపూర్, 3.03 గంటలకు బస్తీ, సాయంత్రం 5.30 గంటలకు గోరఖ్‌పూర్ చేరుకుంటుంది. రాత్రి 9 గంటలకు నర్కటియాగంజ్, 11.10 గంటలకు రక్సౌల్ చేరుతుంది. అర్ధరాత్రి 1.35 గంటలకు సీతామఢి, తెల్లవారుజామున 2.53 గంటలకు శిశో హాల్ట్, 4.48 గంటలకు మధుబని మీదుగా ప్రయాణిస్తుంది. ఉదయం 6.30 గంటలకు జయనగర్ కస్టమ్స్ యార్డ్‌కు చేరుకుని, అక్కడి నుంచి నేపాల్‌లోకి ప్రవేశిస్తుంది. ఉదయం 10 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.
రెగ్యులర్ సర్వీసులపై త్వరలో స్పష్టత
ప్రారంభోత్సవ ప్రత్యేక రైలుకు ఉన్న స్టాపులే సాధారణ సర్వీసులకూ ఉండే అవకాశం ఉందని రైల్వే వర్గాలు తెలిపాయి. అయితే సాధారణ రైలు పూర్తి మార్గం, సమయ పట్టికను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే ఈ వివరాలను వెల్లడించనున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది.
ఇదీ చదవండి: ‘పంబా’ను కలుషితం చేస్తే.. సెక్షన్ 279 ప్రకారం..


