యూపీ ఎన్నికల్లో పొత్తులపై నేడు కాంగ్రెస్,  ఎస్‌పీ నేతల చర్చలు  | SP, Congress to begin UP seat-sharing talks At Delhi 23 november 2026 | Sakshi
Sakshi News home page

యూపీ ఎన్నికల్లో పొత్తులపై నేడు కాంగ్రెస్,  ఎస్‌పీ నేతల చర్చలు 

Nov 23 2026 4:43 AM | Updated on Nov 23 2026 4:43 AM

SP, Congress to begin UP seat-sharing talks At Delhi 23 november 2026

లక్నో: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి 2027 ఆరంభంలో జరిగే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ)నేతలు సోమవారం ఢిల్లీలో చర్చలు జరపనున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ ప్రమోద్‌ తివారీ నివాసంలో ఈ చర్చలు రెండు రోజులపాటు కొనసాగే అవకాశముందని యూపీ పార్టీ వర్కింగ్‌ కమిటీ చీఫ్‌ ఇమ్రాన్‌ మసూద్‌ చెప్పారు. సోమవారం ప్రాథమికంగా చర్చలు జరుపుతామన్నారు. 

కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా సారథ్యం వహించే చర్చల కమిటీలో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, యూపీ పార్టీ అధ్యక్షురాలు ఆరాధనా మిశ్రా, ఇమ్రాన్‌ మసూద్‌ సభ్యులుగా ఉంటారని ఆ పార్టీ ప్రకటించింది. అదేవిధంగా, ఎస్‌పీ తరఫున ఎంపీ రామ్‌ గోపాల్‌ యాదవ్, పార్టీ రాష్ట్ర చీఫ్‌ శ్యాంలాల్‌ పాల్, ఎంపీలు రాజీవ్‌ రాయ్, ఇక్రా చౌదరి ఉంటారని ఆ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ ప్రకటించారు.

 ఈ కమిటీ ఇండియా కూటమి పార్టీలతోనూ యూపీలో సీట్ల వాటాలపై చర్చలు జరుపనుందని ఎక్స్‌లో అఖిలేశ్‌ వెల్లడించారు. కాగా, ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్నందున, డిసెంబర్‌ 20 కల్లా సీట్ల పంపకాలు ఖరారు చేయాలని భావిస్తున్నట్లు యూపీ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి రాజేంద్రపాల్‌ గౌతమ్‌ చెప్పారు. అసెంబ్లీలోని 403 సీట్లకు గాను 2017 ఎన్నికల్లో ఎస్‌పీతో జట్టు కట్టిన కాంగ్రెస్‌ పార్టీ 107 స్థానాల్లో పోటీకి దిగింది. 2022 ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా బరిలోకి దిగాయి. తిరిగి 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి మంచి ఫలితాలను సాధించాయి. అందుకే, ఈసారి ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement