ఆర్మీ కుటుంబాల్లోని ఏడుగురు మృతి
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి
భుజ్: గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును, వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొనగా అందులోని మూడు నెలల పసికందు సహా ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులందరూ భుజ్‌లో విధులు నిర్వహించే ఆర్మీ అధికారుల కుటుంబీకులేనని పోలీసులు తెలిపారు.
రాన్ ఆఫ్ కచ్ నుంచి వీరంతా భుజ్‌కు వస్తుండగా శనివారం రాత్రి 10 గంటల సమయంలో జాతీయ రహదారిపై ఈఘోరం జరిగిందన్నారు. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జయిందని, అందులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు గంటల సమయం పట్టిందన్నారు. ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రధాని ప్రకటించారు.


